Telugu Global
NEWS

ఏపీలో కూడా మోదీ భజనలు షురూ..

టీడీపీ అధికారంలో ఉండగా.. పోలవరం ప్రాజెక్ట్ వద్ద ‘జయము జయము చంద్రన్నా’ అనే భజనా కాలక్షేపం ఓ రేంజ్ లో జరిగేది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భజనలు కనుమరుగయ్యాయి. అయితే ఇప్పుడీ భజనలను బీజేపీ భుజానికెత్తుకోవాలని చూస్తోంది. తాజాగా o.. ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసింది. పోలవరానికి కర్త, కర్మ, క్రియ ఆయనేనంటూ పొగడ్తల్లో ముంచెత్తారు బీజేపీ నేతలు. ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం ఎంతెంత నిధులిచ్చిందో లెక్కలు చెప్పారు, పునరావాసం లేటెందుకవుతోందని రంకెలేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ […]

ఏపీలో కూడా మోదీ భజనలు షురూ..
X

టీడీపీ అధికారంలో ఉండగా.. పోలవరం ప్రాజెక్ట్ వద్ద ‘జయము జయము చంద్రన్నా’ అనే భజనా కాలక్షేపం ఓ రేంజ్ లో జరిగేది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భజనలు కనుమరుగయ్యాయి. అయితే ఇప్పుడీ భజనలను బీజేపీ భుజానికెత్తుకోవాలని చూస్తోంది. తాజాగా o.. ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసింది. పోలవరానికి కర్త, కర్మ, క్రియ ఆయనేనంటూ పొగడ్తల్లో ముంచెత్తారు బీజేపీ నేతలు. ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం ఎంతెంత నిధులిచ్చిందో లెక్కలు చెప్పారు, పునరావాసం లేటెందుకవుతోందని రంకెలేశారు.

దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో మోదీ భజన తారా స్థాయిలో ఉంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీలో కాషాయదళం ఈ విషయంలో కాస్త వెనకబడింది. రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా కన్నా ఉన్నా, సోము ఆ ప్లేస్ లోకి వచ్చినా కూడా.. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు కానీ, మోదీ ప్రమోషన్ తక్కువైంది. దీంతో అధిష్టానం కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టాలని సూచించిందట. అందుకే మోదీ భజన బ్యాచ్ రంగంలోకి దిగింది.

రేషన్ సరకుల పంపిణీలోనూ చీప్ పబ్లిసిటీ..
కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పేదలకు రేషన్ సరకులు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సరకులు వీటికి అదనం. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే సరకులు ఇంటింటికీ వెళ్లి రేషన్ వాహనాల్లో పంపిణీ చేస్తుంటారు. గతంలో కేంద్రం ఇచ్చే సరకుల్ని కూడా వీటితో కలిపి పంపిణీ చేసేవారు. అలా చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పేరు రావట్లేదని అనుకున్నారేమో.. ఆ సరకుల పంపిణీని నెల మధ్యలో మొదలు పెట్టాలని ఆదేశాలొచ్చాయి. దానికి తగ్గట్టుగానే నెల మధ్యలో కేంద్రం నుంచి ఉచిత సరకులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇంకో మెలిక ఏంటంటే.. కేంద్రం ఇచ్చే సరకుల్ని రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేయకూడదట. ఆ వాహనాలపై సీఎం జగన్ బొమ్మ ఉంటుంది కాబట్టి పబ్లిసిటీ ఆయనకి వెళ్తుందట. కేంద్రం ఇచ్చే సరకుల్ని లబ్ధిదారులంతా కచ్చితంగా రేషన్ షాపులకే వెళ్లి తీసుకోవాలి. మోదీ పోస్టర్లు అన్ని షాపుల్లో కనిపించాలి. ఇదీ ఏపీ బీజేపీ నేతలకు అందిన వర్తమానం. దీని ప్రకారం ఆల్రడీ అన్ని రేషన్ షాపుల్లో మోదీ పోస్టర్లు వెలిశాయి. అది జగన్ బియ్యం, ఇది మోదీ బియ్యం అంటూ.. పేరు చెప్పి మరీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు బీజేపీ నేతలు.

మొత్తమ్మీద ఏపీలో కూడా మోదీ భజనా కాలక్షేపం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వచ్చే ఎన్నికలనాటికి జనసేనతో కలసి నడిచినా, టీడీపీతో జతకట్టినా.. కాలం కలసిరాక ఒంటరిగా బరిలో దిగాల్సి వచ్చినా.. ఇప్పటినుంచే మోదీ పేరుతోనే జనంలోకి వెళితే మంచిదనుకుంటున్నారు బీజేపీ నేతలు. అందుకే ఏపీలో భక్తిపారవశ్యం ఏరులై పారడం మొదలైంది.

First Published:  13 July 2021 9:55 PM GMT
Next Story