Telugu Global
NEWS

కౌశిక్ రెడ్డి నిష్క్రమణ కాంగ్రెస్ కు ప్లస్సా..? మైనస్సా..?

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కరోజులోనే కీలక పరిణామాలు జరిగాయి. టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణలు లీక్ కావడం, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోడానికి టీపీసీసీ సిద్ధపడటం, నోటీసులివ్వడం, ఆలోగా కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటించడం, పోతూ పోతూ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అన్నీ చకచగా జరిగిపోయాయి. అయితే కౌశిక్ నిష్క్రమణ కాంగ్రెస్ కి ప్లస్సా, మైనస్సా అనేది రాబోయే […]

కౌశిక్ రెడ్డి నిష్క్రమణ కాంగ్రెస్ కు ప్లస్సా..? మైనస్సా..?
X

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కరోజులోనే కీలక పరిణామాలు జరిగాయి. టీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణలు లీక్ కావడం, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోడానికి టీపీసీసీ సిద్ధపడటం, నోటీసులివ్వడం, ఆలోగా కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా ప్రకటించడం, పోతూ పోతూ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేయడం అన్నీ చకచగా జరిగిపోయాయి. అయితే కౌశిక్ నిష్క్రమణ కాంగ్రెస్ కి ప్లస్సా, మైనస్సా అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.

హూజూరూబాద్ నియోజకవర్గ చరిత్రలో గత 20ఏళ్లలో ప్రత్యర్థులెవరికీ రాని స్థాయిలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి ఓట్లు సాధించారు. మంత్రిగా ఉన్న అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటలపై పోటీ చేసి ఏకంగా 61వేల ఓట్లు తెచ్చుకోగలిగారు. ఈటల రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉంటుందని ఆశించారంతా. కానీ ఆలోపే.. కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తో టచ్ లోకి వెళ్లడం, కాంగ్రెస్ రాజకీయాలకు దూరం జరగడంతో ఆయనపై వేటు వేయాలని అధిష్టానం భావిస్తూ వచ్చింది, సరైన సమయం కోసం ఎదురు చూసింది. కౌశిక్ రెడ్డిని మరికొన్నాళ్లు కాంగ్రెస్ లోనే ఉంచి, చివరి నిముషంలో టీఆర్ఎస్ లో చేర్చుకోవాలనేది కేటీఆర్ ఆలోచన. అలా చేస్తే.. కాంగ్రెస్ కొత్త అభ్యర్థిని వెదుక్కోవడానికి తంటాలు పడుతుందని, హుజూరాబాద్ లో పట్టు కోల్పోతుందని ఆయన భావించారు. ఈమేరకు టికెట్ ఇస్తామని కౌశిక్ రెడ్డికి హామీ కూడా ఇచ్చేశారు. అయితే ఆ హామీతోనే కౌశిక్ చెలరేగిపోయారు. స్థానిక బీజేపీ నేతలకు ఫోన్లు చేసి తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమైపోయిందని, స్థానిక నాయకుల సపోర్ట్ కావాలని కోరారు. ఈ ఫోన్ సంభాషణ లీక్ కావడంతో కాస్త ముందుగానే కౌశిక్ ని కాంగ్రెస్ సాగనంపాల్సి వచ్చింది.

బీసీ నేత కోసం కాంగ్రెస్ అన్వేషణ..
గత 17ఏళ్లుగా హుజూరాబాద్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు పరాజితులుగానే మిగిలిపోయారు. అందులోనూ ఈ దఫా.. ఈటల తనని తాను బీసీగా మరింత ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకోడాని ఇష్టపడుతున్నారు. బడుగులకు, దొరల ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఇది అంటూ ఆయన ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఈ దశలో మరో బలమైన బీసీ నాయకుడిని ఈటలపై పోటీకి నిలిపేందుకు అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి. పీసీసీ పీఠం దక్కించుకున్న తర్వాత తనకిది తొలి పరీక్ష కావడంతో రేవంత్ రెడ్డి కూడా హుజూరాబాద్ పై ఫోకస్ పెంచారని తెలుస్తోంది. ఉప ఎన్నికే లక్ష్యంగా ఆయన పాదయాత్రకు కూడా సిద్దమవుతున్నారని సమాచారం. ఈలోగా కౌశిక్ రెడ్డి వ్యవహారంపై క్లారిటీ రావడంతో ముందుగానే బలమైన అభ్యర్థిని వెదికిపెట్టుకునే అవకాశం కాంగ్రెస్ కి లభించింది.

టీఆర్ఎస్ కిం కర్తవ్యం..
కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ హామీ ఇచ్చి ఉండొచ్చు కానీ, ఆ హామీతో ఆయన చెలరేగిపోవడం, యువతను మందుతో కొంటాం, డబ్బులు వెదజల్లుతాం అంటూ ఫోన్లో రెచ్చిపోవడం సంచలనంగా మారింది. మరిప్పుడు కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ భరించగలదా..? ఆడియో టేపులను ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారంలోకి తెస్తే అది టీఆర్ఎస్ కి పరువునష్టం కాదా..? అధికార పార్టీకి కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని, కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకుంటున్నారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ ఎదుర్కోగలదా..? రాబోయే రోజుల్లో వీటిపై మరింత క్లారిటీ వస్తుంది.

First Published:  13 July 2021 3:23 AM IST
Next Story