Telugu Global
National

ఇద్దరు పిల్లల నిబంధనపై యూపీలో నిరసన జ్వాల..

ఉత్తర ప్రదేశ్ జనాభా బిల్లు -2021ను ముస్లిం సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఓ పథకం ప్రకారం, ముస్లిం జనాభాను నియంత్రించడానికి, యూపీలో రాజకీయ రగడ సృష్టించడానికే ఈ బిల్లు తీసుకొస్తున్నారంటూ మండిపడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామంటూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహ్మద్ హెచ్చరించారు. అసలేంటీ బిల్లు..? జనాభాను కట్టడి చేసేందుకు యూపీ బీజేపీ ప్రభుత్వం ‘ఇద్దరు పిల్లల’ నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు- […]

ఇద్దరు పిల్లల నిబంధనపై యూపీలో నిరసన జ్వాల..
X

ఉత్తర ప్రదేశ్ జనాభా బిల్లు -2021ను ముస్లిం సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఓ పథకం ప్రకారం, ముస్లిం జనాభాను నియంత్రించడానికి, యూపీలో రాజకీయ రగడ సృష్టించడానికే ఈ బిల్లు తీసుకొస్తున్నారంటూ మండిపడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామంటూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ మహ్మద్ హెచ్చరించారు.

అసలేంటీ బిల్లు..?
జనాభాను కట్టడి చేసేందుకు యూపీ బీజేపీ ప్రభుత్వం ‘ఇద్దరు పిల్లల’ నిబంధనతో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌ జనాభా (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం) బిల్లు- 2021ను ఆ రాష్ట్ర లా కమిషన్‌ (యూపీఎస్ఎల్సీ) వెబ్‌ సైట్‌ లో విడుదల చేసింది. ఈ బిల్లుపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించే గడువుని జులై 19గా నిర్ణయించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారికంగా ఈ బిల్లు విడుదల చేస్తారు. ఆగస్ట్ రెండో వారంలో రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు.

బిల్లులో ఏమున్నాయి..?
– ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు.
– ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే.. వారికి ప్రమోషన్లు ఉండవు.
– స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
– ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు అనర్హులు.
– కుటుంబంలో ఎంతమంది ఉన్నా రేషన్ కార్డులో నలుగురికి మాత్రమే ఎంట్రీ.
– ఇద్దరు పిల్లల నిబంధన పాటించేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి.
– ప్రభుత్వ ఉద్యోగులకైతే సర్వీసు మొత్తంలో రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇస్తారు.
– ఇల్లు లేదా ప్లాట్‌ కొనాలనుకుంటే వారికి సబ్సిడీ అందిస్తారు.
– ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్‌ చార్జీల్లో మినహాయింపులు
– ఒక్కరే సంతానం ఉంటే మరిన్ని అదనపు సదుపాయాలు

ముస్లింలను టార్గెట్ చేయడానికేనా..?
వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దశలో యోగి సర్కారు ఈ సంచలనాత్మక బిల్లుకి శ్రీకారం చుట్టడంతో ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ముస్లిం జనాభాను నియంత్రించడానికి, మైనార్టీలను రాజకీయంగా ఎదగనీయకుండా చేసేందుకు ఈ బిల్లు తీసుకొస్తున్నారని ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

బీజేపీ సమర్థింపు..
అయితే బీజేపీ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. పరిమితంగా ఉన్న సహజ, ఆర్థిక వనరులను ప్రజలందరికీ అందించడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు యూపీ సర్కారు పేర్కొంది. అందరికీ తిండి, తాగునీరు, ఇళ్లు, విద్య, వైద్య సేవలు అందించాలంటే ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న జనాభాను నియంత్రించాలని తెలిపింది. అసోం రాష్ట్రంలో కూడా ఈ బిల్లు ఉందని, వచ్చే నెలలో దీన్ని చట్టం చేయబోతున్నారని బీజేపీ చెబుతోంది.

First Published:  11 July 2021 2:53 AM IST
Next Story