Telugu Global
Health & Life Style

స్కిన్ బ్యాంక్.. వైద్య రంగంలో మరో ముందడుగు..

‘మరణం తర్వాత కూడా జీవించండి.. నేత్రదానం చేయండి’ అనే నినాదం అందరికీ తెలిసిందే. బ్రెయిన్ డెత్ కేసుల్లో కళ్లతోపాటు కీలక అవయవాలు కూడా మరికొంతమందికి పునర్జన్మ ఇస్తాయి. అయితే మనిషి చనిపోయిన తర్వాత చర్మం కూడా ఇతరులకు దానం చేయొచ్చనేది ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్న విషయం. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాగే.. చర్మాన్ని నిల్వ చేసేందుకు స్కిన్ బ్యాంక్ లు ఉంటాయి. భారత్ లో ఇప్పటి వరకు 16 స్కిన్ బ్యాంకులున్నాయి. గత నెల హైదరాబాద్ […]

స్కిన్ బ్యాంక్.. వైద్య రంగంలో మరో ముందడుగు..
X

‘మరణం తర్వాత కూడా జీవించండి.. నేత్రదానం చేయండి’ అనే నినాదం అందరికీ తెలిసిందే. బ్రెయిన్ డెత్ కేసుల్లో కళ్లతోపాటు కీలక అవయవాలు కూడా మరికొంతమందికి పునర్జన్మ ఇస్తాయి. అయితే మనిషి చనిపోయిన తర్వాత చర్మం కూడా ఇతరులకు దానం చేయొచ్చనేది ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్న విషయం. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాగే.. చర్మాన్ని నిల్వ చేసేందుకు స్కిన్ బ్యాంక్ లు ఉంటాయి. భారత్ లో ఇప్పటి వరకు 16 స్కిన్ బ్యాంకులున్నాయి. గత నెల హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్ 17వది, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిది కావడం విశేషం.

భారత్ లో ఉన్న 16 స్కిన్ బ్యాంకుల్లో 8 మహారాష్ట్రలో ఉన్నాయి. తమిళనాడులో 4, కర్నాటకలో 2, ఒడిశా, మధ్యప్రదేశ్ లో చెరొక స్కిన్ బ్యాంక్ ఉన్నాయి. ఉస్మానియాలో ఏర్పాటు చేసిన స్కిన్ బ్యాంక్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

మన దేశంలో ప్రతి సంవత్సరం పది లక్షలకు పైగా కాలిన గాయాల కేసులు నమోదవుతున్నాయి. వాటిలో చాలావరకు అదనపు చర్మం అవసరమున్నవే. అగ్ని ప్రమాదంలో ఎక్కువ శాతం చర్మం కాలిపోయి ఉంటే, రోగి శరీరంలో ఒకచోట ఉన్న చర్మాన్ని తీసి, మరొక చోట అంటు కట్టి కొంతవరకు పరిష్కారం చూపుతారు. దీన్ని ‘ఆటోగ్రాఫ్ట్‌’ అంటారు. అయితే పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు, చర్మంలో ఎక్కువశాతం కాలిపోయినప్పుడు ప్రత్యామ్నాయ చర్మం అవసరం అవుతుంది.

అగ్ని ప్రమాదాల్లో చర్మం కాలిపోయిన వారికి ఇన్ఫెక్షన్‌ సోకకుండా ఉండాలంటే రోజూ డ్రెస్సింగ్‌ చేయాలి. ఆ సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తాడు. గ్రాఫ్టింగ్‌ పద్ధతిలో రోజూ డ్రెస్సింగ్‌ అవసరం ఉండదు. మూడు నెలల వరకూ అసలు డ్రెస్సింగ్‌ జోలికి వెళ్లక్కర్లేదు. అయితే ఇలా గ్రాఫ్టింగ్ చేయాలంటే మాత్రం చర్మం కావాలి. అందుకే ఇప్పుడు స్కిన్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి.

ఎలా సేకరిస్తారు..?
మరణించిన తర్వాత కళ్ల నుంచి రెటినాను వేరు చేసినట్టే, చర్మాన్ని కూడా సేకరిస్తారు. చర్మదాత మరణించిన ఆరు గంటలలోపే చర్మాన్ని తీసుకొని, గ్లిజరాల్‌ లో నిల్వ ఉంచి, స్కిన్‌ బ్యాంక్‌ కు తీసుకెళ్లి శీతలీకరణ విధానంలో భద్రపరుస్తారు. ముందుగా దాత శరీరం నుంచి రక్తనమూనా సేకరిస్తారు. ఎయిడ్స్‌, హెపటైటిస్‌, చర్మ క్యాన్సర్‌ లు లేవని నిర్ధారణ అయితేనే చర్మం తీసుకుంటారు. కాళ్లు, తొడలు, వీపు భాగం నుంచి చర్మాన్ని సేకరిస్తారు. చర్మంపై ఉన్న సన్నని పొరను మాత్రమే తీస్తారు. ఇలా సేకరించిన చర్మాన్ని 4-8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద 5 సంవత్సరాల వరకు స్కిన్‌ బ్యాంక్‌లో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసిన చర్మాన్ని కాలిన రోగులకు, ఆర్థోపెడిక్‌, ట్రామా రోగులకు, తీవ్ర చర్మరోగాలకు ఉపయోగిస్తారు.

First Published:  11 July 2021 3:20 AM IST
Next Story