Telugu Global
National

రాజ్యాంగ పదవులు కాదు.. రాజకీయ పదవులే..

కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో బీజేపీ రాజకీయాలు మరీ ఏవగింపుగా మారుతున్నాయి. మంత్రిగా ఉద్వాసన పలికే ముందుగా థావర్ చంద్ గహ్లాత్ కి గవర్నర్ పదవిని కట్టబెట్టారు. తాజాగా మరో మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి తమిళనాడు గవర్నర్ పదవి అప్పగించారు. అసలు గవర్నర్ పోస్ట్ లు రాజ్యాంగబద్ధ పదవులా లేక రాజకీయ పదవులా అనేంతలా బీజేపీ వాటిలో మాజీలను, తాజాలను కూర్చోబెడుతూ రాజకీయాలు నడుపుతోంది. వానప్రస్థంలో గవర్నర్ పదవులు.. రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్ […]

రాజ్యాంగ పదవులు కాదు.. రాజకీయ పదవులే..
X

కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో బీజేపీ రాజకీయాలు మరీ ఏవగింపుగా మారుతున్నాయి. మంత్రిగా ఉద్వాసన పలికే ముందుగా థావర్ చంద్ గహ్లాత్ కి గవర్నర్ పదవిని కట్టబెట్టారు. తాజాగా మరో మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి తమిళనాడు గవర్నర్ పదవి అప్పగించారు. అసలు గవర్నర్ పోస్ట్ లు రాజ్యాంగబద్ధ పదవులా లేక రాజకీయ పదవులా అనేంతలా బీజేపీ వాటిలో మాజీలను, తాజాలను కూర్చోబెడుతూ రాజకీయాలు నడుపుతోంది.

వానప్రస్థంలో గవర్నర్ పదవులు..
రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్ పోస్ట్ లో రాజకీయ నాయకుల్ని కూర్చోబెట్టే అలవాటు కాంగ్రెస్ తోనే మొదలైనా.. రిటైర్ అయిపోయిన పొలిటీషియన్లకు మాత్రమే వాటిని రిజర్వ్ చేసి పెట్టేవారు. వారసులు లేక, రాజకీయాలనుంచి అనివార్యంగా తప్పుకునే దశలో గవర్నర్ పోస్ట్ లు ఇప్పించి సీనియర్లను సంతోషపెట్టేవారు. కానీ బీజేపీ జమానాలో ఆ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కారు. గవర్నర్ పదవిని ఓ ఆటవిడుపుగా వాడుకుంటున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవారిని కూడా గవర్నర్ పోస్టుల్లోకి పంపించి, వారి పదవీకాలం పూర్తయ్యాక తిరిగి రాజకీయాల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఆమధ్య మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన విద్యాసాగర్ రావు ఆ తర్వాత తెలంగాణ బీజేపీలో కీలకంగా పనిచేయాలనుకున్నారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయను తప్పించి ఆ తర్వాత గవర్నర్ గా పంపించారు. గతంలో పదవికి పదవికి మధ్య కనీసం కాస్త గ్యాప్ అయినా ఇచ్చేవారు. ఈ సారి మాత్రం అది కూడా లేదు.

ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణతోపాటు, గవర్నర్ పదవుల పునర్వ్యవస్థీకరణ కూడా ఒకే సమయంలో జరిగిపోయింది. కేబినెట్ నుంచి తొలగించిన ఇద్దరు నాయకులకు నేరుగా గవర్నర్ పోస్ట్ లు ఇచ్చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిగిలినవారిలో ఇంకెంతమందికి గవర్నర్ యోగం పట్టబోతుందోననే అనుమానాలు కూడా ఉన్నాయి. అంతెందుకు.. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ప్రత్యక్ష రాజకీయాలనుంచి బలవంతంగా తప్పించి ఆయనకు రాజ్యాంగబద్ధ పదవి కట్టబెట్టారనే అపవాదు కూడా బీజేపీపై ఉంది. రాజకీయ నాయకులకు రాజ్యాంగబద్ధమైన పదవులు వద్దు అనే నిబంధన రాజ్యాంగంలో లేదు కాబట్టే బీజేపీ ఆడింది ఆట, పాడింది పాట గా సాగుతున్నాయి. తన మనసుకి నచ్చినట్టు పనిచేస్తున్నాడనే ఉద్దేశంతో ఐఏఎస్ అధికారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించి మరీ ఎమ్మెల్సీని చేసి, యూపీ కిరీటం కట్టబెట్టాలని చూసిన మోదీ.. అంతకంటే గొప్పగా ఆలోచిస్తారనుకోలేం. మోదీకి నచ్చితే మంత్రి అవుతారు, నచ్చకపోతే గవర్నర్ అవుతారనే నానుడి క్రమంగా బలపడుతోంది.

First Published:  11 July 2021 3:05 AM IST
Next Story