ఉత్తరాఖండ్ లో అసమ్మతి సెగలు.. కొత్త సీఎంపై సీనియర్ల గుర్రు..
ఉత్తరాఖండ్ సీఎం మార్పు ఊహించని పరిణామమే. మరో రెండు నెలలు సమయం ఉన్నా కూడా.. ఉన్నఫళంగా సీఎం తీరత్ సింగా రావత్ తో రాజీనామా చేయించింది అధిష్టానం. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యం, కరోనా కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. లోక్ సభ సభ్యుడిగా ఉన్న తీరత్ సింగ్ రావత్, అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేక సీఎం చైర్ నుంచి తప్పుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన పుష్కర్ […]
ఉత్తరాఖండ్ సీఎం మార్పు ఊహించని పరిణామమే. మరో రెండు నెలలు సమయం ఉన్నా కూడా.. ఉన్నఫళంగా సీఎం తీరత్ సింగా రావత్ తో రాజీనామా చేయించింది అధిష్టానం. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యం, కరోనా కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. లోక్ సభ సభ్యుడిగా ఉన్న తీరత్ సింగ్ రావత్, అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేక సీఎం చైర్ నుంచి తప్పుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన పుష్కర్ సింగ్ థామి వివాదానికి కేంద్రబిందువయ్యారు.
తీరత్ సింగ్ దిగిపోతారని తెలియగానే, సీఎం కుర్చీ తమదేనంటూ చాలామంది ఊహించారు. మంత్రి సత్పాల్ మహారాజ్ సహా మరో నలుగురు సీనియర్లు ఆ పదవిని ఆశించి భంగపడ్డారు. అనూహ్యంగా అధిష్టానం జూనియర్ అయిన పుష్కర్ సింగ్ థామిని తెరపైకి రావడంతో వారంతా రగిలిపోతున్నారు. 45ఏళ్ల పుష్కర్.. రెండోవిడత శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ లో పేరున్న నాయకుల లిస్ట్ లో ఆయన లేరు. అయినా కూడా మాజీ సీఎం భగత్ సింగ్ కోషియారీ ఆశీస్సులతో పుష్కర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న భగత్ సింగ్ కోషియారీ తన శిష్యుడికి సీఎం చైర్ అప్పగించడంలో, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సక్సెస్ అయ్యారు.
జూనియర్ కి అనుకోని విధంగా అందలం దక్కే సరికి స్వతహాగా సీనియర్లు రగిలిపోతున్నారు. అందులోనూ మరో 8నెలలలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ దశలో తమ సత్తా చూపిస్తామని, అధిష్టానానికి బుద్ధి చెబుతామని అంటున్నారు వారంతా. కేవలం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండటం, ఇటీవల రాష్ట్రంలోని కొవిడ్ కేంద్రాలను వరుసగా సందర్శిస్తూ హడావిడి చేయడం, కేంద్రంలోని పెద్దలకు మద్దతుగా పదే పదే ట్వీట్లు వేయడం పుష్కర్ కి కలిసొచ్చింది. ప్రస్తుతానికి ఉత్తరాఖండ్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. రగిలిపోతున్న సీనియర్లను బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా.. వచ్చే ఎన్నికలనాటికి సీఎం మార్పు ప్రభావం ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది.