కరెంటు సరే.. నీళ్లెక్కడ సారూ.. కేజ్రీపై సెటైర్లు..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.. అక్కడి ప్రజలపై వరాలు కురిపించడం మొదలు పెట్టారు. పంజాబ్ లో తమకు అధికారం అప్పగిస్తే 300 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ప్రతి ఇంటికీ కరెంటు బిల్లు మాఫీ చేస్తామని అన్నారాయన. ఢిల్లీలో ఆల్రడీ ఈ ప్రయోగం పూర్తి సక్సెక్ అయిందని, ఇప్పుడు పంజాబ్ ప్రజలు కూడా తమ నూతన వాగ్దానంపై సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు కేజ్రీవాల్. ఒకరకంగా తమ ఎన్నికల హామీతో అధికార […]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.. అక్కడి ప్రజలపై వరాలు కురిపించడం మొదలు పెట్టారు. పంజాబ్ లో తమకు అధికారం అప్పగిస్తే 300 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ప్రతి ఇంటికీ కరెంటు బిల్లు మాఫీ చేస్తామని అన్నారాయన. ఢిల్లీలో ఆల్రడీ ఈ ప్రయోగం పూర్తి సక్సెక్ అయిందని, ఇప్పుడు పంజాబ్ ప్రజలు కూడా తమ నూతన వాగ్దానంపై సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు కేజ్రీవాల్. ఒకరకంగా తమ ఎన్నికల హామీతో అధికార కాంగ్రెస్ ఇరుకున పడిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇలా గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో కేజ్రీవాల్ ని ఇరుకున పెట్టే అంశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీలో ప్రజలు నీటికోసం నిలబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్న ఫొటోలు హాట్ టాపిక్ గా మారాయి.
ఢిల్లీ శివారు గ్రామాల ప్రజలు ప్రతిరోజు మంచి నీటి ట్యాంకర్ కోసం పడిగాపులు కాస్తుంటారు. తీరా ట్యాంకర్ వచ్చిన తర్వాత వారి వంతు కోసం భారీ క్యూలైన్లలో నిలబడాల్సిందే. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి ఏళ్లు గడుస్తున్నా సీఎం కేజ్రీవాల్ తమను పట్టించుకోవడంలేదని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. పంజాబ్ లో కరెంటు కష్టాలు తీరుస్తానని హామీలు గుప్పిస్తున్న కేజ్రీవాల్.. ముందుగా ఢిల్లీలో నీటి కొరతపై దృష్టి పెడితే మంచిదని ప్రజలు సూచిస్తున్నట్టు ఫొటోలు, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి.
అయితే కేజ్రీవాల్ టీమ్ మాత్రం ఇదంతా బీజీపీ కుట్ర అంటూ కొట్టిపారేసింది. ఢిల్లీలో మంచినీటి సమస్య ఉన్నా.. ఆమ్ ఆద్మీ హయాంలో చాలా వరకు ప్రజల కష్టాలు తీరాయని అంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఢిల్లీ ప్రజల కష్టాలు పట్టించుకోలేదని చెబుతున్నారు. పంజాబ్ లో తమకు క్రేజ్ పెరుగుతుందననే ఉద్దేశంతో బీజేపీ, కాంగ్రెస్ కలసి ఇలాంటి దుష్ప్రచారం మొదలు పెట్టాయని మండిపడ్డారు.