Telugu Global
NEWS

కృష్ణా నీటిపై కొత్త మెలిక.. ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్న కేసీఆర్..

కృష్ణానది నీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జరిగిన కేటాయింపులు 811 టీఎంసీలు. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం కుదిర్చిన ఒప్పందం ప్రకారం ఈ 811 టీఎంసీల నీటిలో ఏపీ 66శాతం తెలంగాణ 34శాతం వాడుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఇదే పద్ధతిలో నీటి కేటాయింపులు జరిగాయి. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం కారణంగా మరోసారి నీటి వాటాలు తెరపైకి వచ్చాయి. దీంతో అసలుకే ఎసరు పెడతామంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 66:33 పద్ధతికి […]

కృష్ణా నీటిపై కొత్త మెలిక.. ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్న కేసీఆర్..
X

కృష్ణానది నీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి జరిగిన కేటాయింపులు 811 టీఎంసీలు. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం కుదిర్చిన ఒప్పందం ప్రకారం ఈ 811 టీఎంసీల నీటిలో ఏపీ 66శాతం తెలంగాణ 34శాతం వాడుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఇదే పద్ధతిలో నీటి కేటాయింపులు జరిగాయి. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం కారణంగా మరోసారి నీటి వాటాలు తెరపైకి వచ్చాయి. దీంతో అసలుకే ఎసరు పెడతామంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 66:33 పద్ధతికి స్వస్తి పలుకుతున్నామని ఇకపై 50:50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరగాలని కొత్త మెలిక పెట్టారు.

బచావత్‌ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏళ్లు కావస్తున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించలేదని తాజాగా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడతామని చెప్పారు. పోతిరెడ్డిపాడు పేరుతో నీటి హక్కుల్ని ఏపీ కాలరాస్తుంటే తెలంగాణ ప్రజలు సహించబోరన్నారు. రాయలసీమ ఎత్తిపోతల, తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి.. తదితరత అంశాలపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన ఆయన నీటివాటాల్లో కొత్త లెక్కలు చెప్పారు.

తెలంగాణ భూభాగం సముద్రమట్టానికి ఎత్తులో ఉందని, చుట్టూ నదులున్నా.. నీటిపారుదలకు అవకాశం లేదని, అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా పంటలు పండించుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో లిఫ్ట్ లు ఏర్పాటు చేయలేదని, అలా మోసపోయిన తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ వరప్రదాయినిలా మారిందని చెప్పారు. రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

జల విద్యుత్‌ ఉత్పత్తి ఆపేది లేదు..
ఆంధ్ర ప్రదేశ్ కాలు అడ్డం పెట్టి నీళ్లు పారించుకుంటోందని మండిపడిన కేసీఆర్, తెలంగాణలో రెండు పంటలకూ నీరందాలంటే.. జల విద్యుత్‌ అవసరం అని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకోసం, విద్యుత్‌ ఉత్పత్తి కోసం కేటాయించిన నీటిని వినియోగించుకుంటామని అన్నారు. తెలంగాణలో 30 లక్షలకు పైగా బోర్లున్నాయని, రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తులో 40శాతం సాగునీటి అవసరాలకే వినియోగమవుతోందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు అడ్డు చెప్పినా వినేది లేదన్నారు.

సముద్రానికి వదలకపోతే, సాగునీటికి వాడుకోండి.
ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని వృథాగా సముద్రానికి వదిలేస్తున్నారని, దానికి కారణం తెలంగాణ ప్రభుత్వమేనంటూ ఏపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కేసీఆర్. ప్రకాశం బ్యారేజీ నీటిని సాగునీటి అవసరాలకు, కృష్ణాజిల్లా అవసరాలకు వాడుకోవాలని సూచించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చెప్పడం హాస్యాస్యదం అన్నారాయన. పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్‌ పనులు చేపట్టడం సరికాదని చెప్పారు. మొత్తమ్మీద వాటాల విషయంలో కొత్త లెక్కలు తీసి కేసీఆర్ సరికొత్త బాంబు పేల్చారు.

First Published:  4 July 2021 4:25 AM IST
Next Story