Telugu Global
National

కరోనా కారణంగా సీఎం కుర్చీ పోయింది..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉత్తరాఖండ్ లో అనుకోకుండా సీఎం కుర్చీ మారిపోయింది. ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది మార్చిలో ఉత్తరాఖండ్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఆయన, నాలుగు నెలలు తిరక్కుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే నాటికి ఆయన లోక్ సభ సభ్యుడు. ఆరు నెలలలోగా ఉత్తరాఖండ్ శాసన సభకు ఆయన ఎన్నిక కావాల్సి ఉంది. రాష్ట్రంలో 2 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా […]

కరోనా కారణంగా సీఎం కుర్చీ పోయింది..
X

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఉత్తరాఖండ్ లో అనుకోకుండా సీఎం కుర్చీ మారిపోయింది. ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది మార్చిలో ఉత్తరాఖండ్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన ఆయన, నాలుగు నెలలు తిరక్కుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే నాటికి ఆయన లోక్ సభ సభ్యుడు. ఆరు నెలలలోగా ఉత్తరాఖండ్ శాసన సభకు ఆయన ఎన్నిక కావాల్సి ఉంది. రాష్ట్రంలో 2 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నా, ఆరు నెలల పదవీకాలానికి ఇంకా 2 నెలలు గడువున్నా కూడా తిరత్ సింగ్ తప్పుకోవాల్సి వచ్చింది.

2017లో ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు కూటమి కట్టడంతో అధికార బీజేపీ వేటు వేసింది. సీఎం కుర్చీలోనుంచి ఆయన్ను దింపేసి తిరత్ సింగ్ ని కూర్చోబెట్టింది. అందరి ఆశీస్సులతో సీఎం కుర్చీలో కూర్చున్న తిరత్ సింగ్, వచ్చే ఏడాది జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీని సన్నద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే ఆరు నెల‌ల్లోగా ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల వల్ల ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. మరోవైపు ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఉప ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల నియమావళి కూడా అడ్డుగా మారింది. దీంతో ఆయన అనివార్యంగా రాజీనామా చేశారు.

అయితే మరో రెండు నెలలు అవకాశం ఉన్నా కూడా ఇప్పుడే ఆయన ఎందుకు రాజీనామా చేశారనేది అనుమానించాల్సిన విషయం. తిరత్ సింగ్ రావత్ స్థానంలో ఆ పదవికోసం అప్పుడే ఆశావహులు అధిష్టానం వద్దకు క్యూ కట్టారు. అయితే సీఎం కుర్చీపై ఎవరిని కూర్చోబెట్టాలా అని బీజేపీ తీవ్రంగా ఆలోచిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి తిరత్ సింగ్ కి మార్గం సుగమం చేయాలంటే అనామకుడ్ని అక్కడ సీఎం చేయాలి. అలా చేస్తే ప్రతిపక్షాలను తట్టుకోగలమా లేదా అనే విషయంపై కూడా బీజేపీ మేధోమథనం జరుపుతోంది. మొత్తమ్మీద కరోనా కష్టకాలంలో ఉప ఎన్నికలు లేకపోవడంతో తిరత్ సింగ్ కి సీఎం కుర్చీ పోయింది.

First Published:  3 July 2021 4:36 AM IST
Next Story