Telugu Global
NEWS

నీళ్లన్నీ తరలిపోయాక.. జలజగడంపై తీరిగ్గా సమావేశం..

సాగునీటి అవసరాలకోసం నిల్వ చేసుకున్న నీటిని జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం వృథా చేస్తుందనేది ఏపీ వాదన. అయితే కృష్ణాబోర్డు మాత్రం ఈ జలజగడంపై తీరిగ్గా సమావేశం పెట్టడానికి నిర్ణయించింది. ఈనెల 9న త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు, కృష్ణాబోర్డు కార్యదర్శి ఈ త్రిసభ్య కమిటీలో ఉంటారు. అయితే వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంపాలైన తర్వాత ఈ త్రిసభ్య కమిటీ ఏం తేలుస్తుందనేదే ఇప్పుడు చర్చనీయాంశం. […]

నీళ్లన్నీ తరలిపోయాక.. జలజగడంపై తీరిగ్గా సమావేశం..
X

సాగునీటి అవసరాలకోసం నిల్వ చేసుకున్న నీటిని జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం వృథా చేస్తుందనేది ఏపీ వాదన. అయితే కృష్ణాబోర్డు మాత్రం ఈ జలజగడంపై తీరిగ్గా సమావేశం పెట్టడానికి నిర్ణయించింది. ఈనెల 9న త్రిసభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లు, కృష్ణాబోర్డు కార్యదర్శి ఈ త్రిసభ్య కమిటీలో ఉంటారు. అయితే వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంపాలైన తర్వాత ఈ త్రిసభ్య కమిటీ ఏం తేలుస్తుందనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై మొదలైన వివాదం, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య జలజగడంగా మారింది. ఎత్తిపోతల పథకం సమస్య కాస్తా.. జలవిద్యుత్ పేరుతో జరుగుతున్న జల వృథావైపు మళ్లింది. ఏపీ సాగునీటి అవసరాలకోసం నిల్వచేసుకున్న నీటిని, జలవిద్యుత్ ఉత్పత్తికోసం తెలంగాణ వినియోగించుకోవడంతో అనివార్యంగా ఆ నీరు సముద్రం పాలుకావాల్సి వస్తోంది. శ్రీశైలంలో జలవిద్యుత్ కోసం గేట్లు ఎత్తేయడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి నీరందే అవకాశం మరింత క్షీణించింది. అటు పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తికోసం వదిలిన నీరు ప్రకాశం బ్యారేజీ ఫుల్ లెవల్ తాకడంతో గేట్లు ఎత్తేసి సముద్రానికి నీటిని వదిలేస్తున్నారు. ఈ దశలో తక్షణం చర్యలు తీసుకోవాల్సిన కృష్ణాబోర్డు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం విడ్డూరం. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై బోర్డు స్పందించి, జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. జలవిద్యుత్ ఉత్పత్తిని అడ్డుకోవడానికి ఎవరికీ అధికారం లేదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఈదశలో జోక్యం చేసుకోవాల్సిన బోర్డు తీరిగ్గా త్రిసభ్య కమిటీ సమావేశం అంటోంది. వారం రోజుల తర్వాత కమిటీ సమావేశం పెట్టేనాటికి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు కరిగిపోతాయి.

ఈనెల 9న జరిగే సమావేశం కోసం, ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలను పంపాలని రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజినీర్లకు కృష్ణాబోర్డు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతోపాటు, విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి ముందుగా బోర్డు కొత్త ఛైర్మన్‌ ఎం.పి.సింగ్‌ బాధ్యతలు చేపడతారు.

త్రిసభ్య కమటీ సిఫార్సులను తెలంగాణ లెక్క చేస్తుందా..?
ఇప్పటికే తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయ కోణంలో కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కృష్ణాబోర్డు రాసిన లేఖను బేఖాతరు చేసిన తెలంగాణ సర్కారు ఇప్పుడు త్రిసభ్య కమిటీ ఇచ్చే ఆదేశాలను పాటిస్తుందా అనేది అనుమానమే. మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్, ప్రధాని నరేంద్రమోదీకి కూడా ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. తెలంగాణ చేస్తున్న నీటి వృథాకు వెంటనే అడ్డుకట్ట వేయాలని కోరింది.

First Published:  2 July 2021 8:44 PM GMT
Next Story