శ్రీశైలం టు పులిచింతల.. ప్రధాని వద్దకు నీళ్ల పంచాయితీ..
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా రివర్ బోర్డ్ కి చేసిన ఫిర్యాదుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన జల జగడం.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. రాయలసీమ లిఫ్ట్ అక్రమం అంటున్న తెలంగాణ ప్రభుత్వం, జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో జల చౌర్యం చేస్తోందనేది ఏపీ ప్రభుత్వ వాదన. శ్రీశైలం ప్రాజెక్ట్ తో మొదలు పెట్టి, నాగార్జున సాగర్, పులిచింతల వద్ద కూడా అక్రమంగా నీటిని కిందకు వదిలేస్తున్నారని, దీనివల్ల […]
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా రివర్ బోర్డ్ కి చేసిన ఫిర్యాదుతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన జల జగడం.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు చేరింది. రాయలసీమ లిఫ్ట్ అక్రమం అంటున్న తెలంగాణ ప్రభుత్వం, జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో జల చౌర్యం చేస్తోందనేది ఏపీ ప్రభుత్వ వాదన. శ్రీశైలం ప్రాజెక్ట్ తో మొదలు పెట్టి, నాగార్జున సాగర్, పులిచింతల వద్ద కూడా అక్రమంగా నీటిని కిందకు వదిలేస్తున్నారని, దీనివల్ల ఏపీ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అటు జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చెప్పే అధికారం ఎవరికీ లేదంటూ తెలంగాణ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది.
రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదాలకు రాజకీయ కారణాలున్నాయంటూ ఇరు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ, రోజు రోజుకీ గొడవ ముదిరి పాకాన పడుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మిస్తున్నారంటూ గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరోసారి కృష్ణా రివర్ బోర్డుకి ఫిర్యాదు చేసింది. ఈ దశలో ఎత్తిపోతల పనులు పరిశీలనకు వస్తామంటూ బోర్డు ఏపీకి వర్తమానం పంపింది. అప్పటి వరకు పనులు ఆపేయాలని సూచించింది. అయితే అంతలోనే తెలంగాణ ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణలోని అన్ని జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగాలంటూ జీవో 34 జారీ చేసింది. దీంతో శ్రీశైలం సహా, సాగర్, పులిచింతల ప్రాజెక్ట్ ల వద్ద కూడా విద్యుత్ ఉత్పత్తికోసం నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏపీ సాగు అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిని కిందకు విడుదల చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది గతంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం. అయితే దాన్ని తుంగలో తొక్కి నీటిని వృథాగా సముద్రంపాలు చేస్తున్నారని ఏపీ ఆరోపిస్తోంది. ఇలా వృథా చేసే నీటిని తెలంగాణ వాటాలో కలపాలని డిమాండ్ చేస్తూ కృష్ణా రివర్ బోర్డ్ కి ఆల్రడీ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత కుదిరిన ఒప్పందాల్లో భాగంగా కృష్ణా నీటిని తెలంగాణ 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వినియోగించుకోవాలి. ఆ లెక్క ప్రకారం వృథా అవుతున్న నీటిని 299 టీఎంసీలనుంచి మినహాయించాలనేది ఏపీ వాదన.
బోర్డుకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం, తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని కిందకు వదలడం ఆపకపోవడంతో ఏపీ సీఎం జగన్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. పోతిరెడ్డిపాడుకి నీటి తరలింపు ఆపాలనే ఉద్దేశంతోటే, శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి మట్టాల్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిందనే అనుమానాలున్నాయని లేఖలో ఆరోపించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నా కూడా.. వాటిని పక్కనపెట్టి, అనధికారికంగా నీటిని వాడుతూ, వృథా చేస్తున్నారని ప్రధానికి జగన్ లేఖ ద్వారా తెలిపారు.