తిరుమలలో సర్వదర్శనాలు ఎప్పట్నుంచంటే..?
కరోనా సెకండ్ వేవ్ పెరుగుదున్న దశలో తిరుమలలో రద్దీ నివారించేందుకు శ్రీవారి సర్వదర్శనాలు రద్దు చేశారు. కేవలం 300 రూపాయల ప్రత్యేక టికెట్ పైనే భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. కాలినడక భక్తుల దర్శనాలు యథాతథంగానే కొనసాగుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ పెరుగుదున్న దశలో తిరుమలలో రద్దీ నివారించేందుకు శ్రీవారి సర్వదర్శనాలు రద్దు చేశారు. కేవలం 300 రూపాయల ప్రత్యేక టికెట్ పైనే భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. కాలినడక భక్తుల దర్శనాలు యథాతథంగానే కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 12నుంచి ఇదే విధానం అమలులో ఉంది. ఫస్ట్ వేవ్ సమయంలో పూర్తిగా భక్తుల దర్శనాలు రద్దు చేసినా, సెకండ్ వేవ్ లో మాత్రం పరిమితంగా దర్శనాలకు అనుమతిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినా, కర్ఫ్యూ వేళలు సడలించినా.. తిరుమల సర్వ దర్శనాల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు అధికారులు. సర్వదర్శనాలకు టోకెన్లు మంజూరు చేయడంలేదు.
ఇటీవలే టీటీడీ బోర్డు పదవీకాలం ముగియడంతో.. ఈవో, స్పెసిఫైడ్ అథారిటీ అదనపు బాధ్యతలు చేపట్టారు. సర్వదర్శనాలపై స్పెసిఫైడ్ అథారిటీ కూడా నిర్ణయం తీసుకోలేదు. సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ముందు జాగ్రత్తగా సర్వదర్శనాలను మరికొన్నాళ్లు వాయిదా వేశారు అధికారులు. 300 రూపాయల ప్రత్యేక దర్శనాలపై కూడా పరిమితి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకి సగటున 18వేలమందికి మాత్రమే దర్శనాలు అందుతున్నాయి.
చిత్తూరులో కేసుల సంఖ్యపై ఆందోళన..
ఏపీలో ఈరోజునుంచి సడలించిన కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి వచ్చాయి. మొత్తం 8జిల్లాల్లో రాత్రి 9గంటల వరకు వ్యాపార కార్యకలాపాలకోసం సడలింపునిచ్చారు. సడలింపులు లేని మిగిలిన 5 జిల్లాల్లో చిత్తూరు కూడా ఉంది. కొవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉండటంతో అక్కడ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. జిల్లాలో కేసుల సంఖ్య ఇంకా తగ్గకపోవడంతో తిరుమల దర్శనాల విషయంలో వెసులుబాటు ఇచ్చేందుకు వెనకడుగేస్తున్నారు అధికారులు.
అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలించాకే..
ఏపీలోని అన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులు అమలులోకి వచ్చిన తర్వాత తిరుమల దర్శనాల విషయంలో అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఈనెల 7వరకు అమలులో ఉంటాయి. పరిస్థితులు చక్కబడితే ఆ తర్వాత నిబంధనలు పూర్తి స్థాయిలో సడలిస్తారని, తిరుమల దర్శనాల విషయంలో వెసులుబాటు ఉంటుందని, సర్వదర్శనాలకు కూడా అనుమతులిస్తారని అంటున్నారు.