Telugu Global
National

యూపీలో ఎవరికి వారే.. యమునా తీరే..

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార బీజేపీ బలహీనపడిందనే వాదన బలంగా వినిపిస్తున్నా.. ఆ బలహీనతను తమకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రయత్నం చేయలేకపోతున్నాయి. వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ఒంటరిపోరుకే సిద్ధమవుతున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. 403 స్థానాల్లో ఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, 350 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బహుజన్ సమాజ్ […]

యూపీలో ఎవరికి వారే.. యమునా తీరే..
X

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార బీజేపీ బలహీనపడిందనే వాదన బలంగా వినిపిస్తున్నా.. ఆ బలహీనతను తమకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రయత్నం చేయలేకపోతున్నాయి. వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ఒంటరిపోరుకే సిద్ధమవుతున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. 403 స్థానాల్లో ఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, 350 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కూడా ఒంటరిపోరుకే సిద్ధమంటోంది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి కూటమిపై తమకు ఆసక్తి లేదని, ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. ఇటీవలే ఎంఐఎంతో సంప్రదింపులు జరిగినా ఒంటరిపోరుకే మాయావతి సై అంటున్నారు. దళితులు, మైనార్టీల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు బీఎస్పీ, ఎంఐఎం కలుస్తున్నాయన్న ప్రచారాన్ని మాయావతి కొట్టిపారేశారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, పంజాబ్ లో మాత్రం ఆకాలీదళ్ తో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.

ఒంటరైన కాంగ్రెస్..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని 100 సీట్లు కేటాయించింది. ఆ వంద సీట్లలో కాంగ్రెస్ కేవలం 7 మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ తో కలసి తాము తీవ్రంగా నష్టపోయామని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అంటున్నారు.

రెండేళ్ల క్రితం ఎస్పీ, బీఎస్పీ కలసినా అదే ఫలితం..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండేళ్లకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఒంటరిని చేసి, ఎస్పీ, బీఎస్పీ, ఇతర చిన్నపార్టీలు కలసి మహా ఘటబంధన్ పేరుతో పోటీ చేశాయి. అప్పుడు కూడా సేమ్ రిజల్ట్. యూపీలోని మొత్తం 80లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఏకంగా 62చోట్ల గెలిచింది. బీఎస్పీ -10, ఎస్పీ-5 చోట్ల గెలవగా.. కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ పోటీ చేసిన రాయ్ బరేలి సీటు మాత్రమే దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం కాంగ్రెస్ ని కలుపుకొని వెళ్లేందుకు అటు ఎస్పీ కానీ, ఇటు బీఎస్పీ కానీ సిద్ధంగా లేవు. దీంతో కాంగ్రెస్ ఒంటరిపోరుకి సిద్ధమవుతోంది.

ఓవైపు జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండగా.. ఇటు యూపీలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ప్రతిపక్షాలన్నీ సొంతగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ దశలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికలు, పేలికలుగా మారిపోయి.. అంతిమంగా బీజేపీయే లాభపడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

First Published:  30 Jun 2021 8:48 PM GMT
Next Story