Telugu Global
NEWS

అందరివాడ్ని అంటున్న రేవంత్ రెడ్డి.. సైలెంట్ అయిన కోమటిరెడ్డి..

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం రేవంత్ రెడ్డికి కట్టబెట్టడంతో కాంగ్రెస్ లో రేగిన అసంతృప్తి సెగలు, టీకప్పులో తుఫానులా ముగిసిపోయాయి. ఓవైపు రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకొని వెళ్తూ, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత వి.హెచ్.హనుమంతరావుని ఏకంగా ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. రోజుల వ్యవధిలోనే కొత్త కార్యవర్గంతో భేటీ అయ్యారు. మనమంతా క్రికెట్ టీమ్ లా పనిచేయాలని, తనకెలాంటి భేషజాలు లేవని చెప్పారు రేవంత్. మల్లురవి ఇంట్లో సమావేశమైన […]

అందరివాడ్ని అంటున్న రేవంత్ రెడ్డి.. సైలెంట్ అయిన కోమటిరెడ్డి..
X

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం రేవంత్ రెడ్డికి కట్టబెట్టడంతో కాంగ్రెస్ లో రేగిన అసంతృప్తి సెగలు, టీకప్పులో తుఫానులా ముగిసిపోయాయి. ఓవైపు రేవంత్ రెడ్డి అందర్నీ కలుపుకొని వెళ్తూ, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత వి.హెచ్.హనుమంతరావుని ఏకంగా ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. రోజుల వ్యవధిలోనే కొత్త కార్యవర్గంతో భేటీ అయ్యారు. మనమంతా క్రికెట్ టీమ్ లా పనిచేయాలని, తనకెలాంటి భేషజాలు లేవని చెప్పారు రేవంత్.

మల్లురవి ఇంట్లో సమావేశమైన కొత్త కార్యవర్గం, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెస్తామని, అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టేలా కలసికట్టుగా ముందుకెళ్తామని చెప్పింది. తాను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మనిషినని, కొత్త కమిటీపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడదామని చెప్పారు రేవంత్ రెడ్డి. మనస్ఫూర్తిగానే కాంగ్రెస్‌లోకి వచ్చానని.. తక్కువ సమయంలోనే అధిష్ఠానం కీలక పదవుల్ని ఇచ్చి ప్రోత్సహించిందని, తనకెలాంటి భేషజాలు లేవని, అందర్ని కలుపుకొని వెళ్తానని అన్నారు.

కోమటిరెడ్డి సైలెన్స్..
టీపీసీసీ అధ్యక్ష పదవికోసం చివరికంటూ పోరాటం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓ దశలో తనకే ఆ సీటు దక్కుతుందన్న ఉత్సాహంతో ఢిల్లీ వెళ్లారు. అయితే హస్తినకు పిలిచింది సీటు ఇవ్వడానికి కాదని, సర్దుకుపోవాలని చెప్పడానికని ఆయనకు ఆలస్యంగా తెలిసింది. అదే సమయంలో రేవంత్ రెడ్డికి పీసీసీ దక్కడంతో కోమటిరెడ్డి బాగా హర్ట్ అయ్యారు. ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు జరిగాయని, అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం ఓటుకు నోటు కేసులా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అధిష్టానం తలంటడంతో అంతలోనే సర్దుకున్నారు. రాజకీయ పరమైన అంశాలపై ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, తనను రాజకీయాల్లోకి లాగవద్దని, ప్రజాసమస్యలు తీర్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్నిగ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు.

అటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా అసంతృప్తుల్ని బుజ్జగిస్తున్నారు. పీసీసీ పీఠం ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు చల్లారినట్టు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి సీనియర్లంతా మద్దతు తెలుపుతూ లైన్ క్లియర్ చేశారు.

First Published:  28 Jun 2021 8:44 PM GMT
Next Story