Telugu Global
Others

చైనా వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు..

కరోనా వైరస్ పై వివిధ వ్యాక్సిన్ల ప్రభావంపై సాంకేతిక అంశాలే బయటకొస్తున్నాయి కానీ, అసలైన సామర్థ్యం మాత్రం ఇంకా రుజువుకాలేదు. చాలా చోట్ల రెండు డోసులు తీసుకున్నవారు కూడా కొవిడ్ బారిన పడటం, మరణం అంచులకు వెళ్లడం, మరణానికి గురికావడం చూస్తూనే ఉన్నాం. అయితై చైనా తయారు చేసిన టీకాల సామర్థ్యంపై ఇప్పుడు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. చైనా వ్యాక్సిన్ తీసుకున్న దేశాల్లో కరోనా మళ్లీ విజృంభించడమే దీనికి కారణం. కరోనా పుట్టుకకు చైనాయే కారణం అనుకున్నా.. కరోనా […]

చైనా వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు..
X

కరోనా వైరస్ పై వివిధ వ్యాక్సిన్ల ప్రభావంపై సాంకేతిక అంశాలే బయటకొస్తున్నాయి కానీ, అసలైన సామర్థ్యం మాత్రం ఇంకా రుజువుకాలేదు. చాలా చోట్ల రెండు డోసులు తీసుకున్నవారు కూడా కొవిడ్ బారిన పడటం, మరణం అంచులకు వెళ్లడం, మరణానికి గురికావడం చూస్తూనే ఉన్నాం. అయితై చైనా తయారు చేసిన టీకాల సామర్థ్యంపై ఇప్పుడు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. చైనా వ్యాక్సిన్ తీసుకున్న దేశాల్లో కరోనా మళ్లీ విజృంభించడమే దీనికి కారణం.

కరోనా పుట్టుకకు చైనాయే కారణం అనుకున్నా.. కరోనా వైరస్ ను విజయవంతంగా అదుపులో పెట్టగలిగిన దేశాల్లో కూడా చైనాదే ప్రథమ స్థానం. వ్యాక్సినేషన్లో కూడా చైనా ముందుంది. కొవిడ్ ని అరికట్టేందుకు చైనా రెండు రకాల వ్యాక్సిన్లు తయారు చేసింది. సైనావాక్, సైనోఫార్మ్ పేరుతో వీటిని మార్కెట్ చేస్తోంది. చైనాతోపాటు సుమారు 90దేశాలు ఈ వ్యాక్సిన్ వాడుతున్నాయి. అయితే విచిత్రంగా చైనా మినహా మిగతా కొన్ని దేశాల్లో ఈ వ్యాక్సిన్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటం విశేషం.

చైనాకు చెందిన సైనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ 78.1 శాతం, సైనోవాక్ టీకా 51 శాతం సామ‌ర్థ్యంతో పనిచేస్తాయని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఈ నమ్మకంతోటే చైనా టీకాల‌ను సుమారు 90 దేశాలు వేసుకుంటున్నాయి. ఈ టీకాలనే వాడుతున్న మంగోలియాలో గ‌త ఆదివారం కొత్త‌గా 2400 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. అయితే వ్యాక్సిన్ల‌కు.. మ‌ళ్లీ కేసులు పెర‌గ‌డానికి సంబంధం లేద‌ని చైనా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ క‌నీస స్థాయికి చేరాల‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే షీషెల్స్, చిలీ, బహ్రెయిన్, మంగోలియా దేశాల్లో 50నుంచి 68శాతం వరకు టీకాల పంపిణీ పూర్తయింది. అయినా కూడా అక్కడ కరోనా కేసులు పెరగడం ఆందోళనకు దారి తీస్తోంది. ఇక ఇండోనేషియాలో కొత్త వేరియంట్ వ్యాప్తి ఇప్పుడే మొదలవుతోంది. అక్క‌డ సైనోవాక్ టీకా తీసుకున్న 350 మంది డాక్ట‌ర్లు, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు మ‌ళ్లీ పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. బెహ్రెయిన్‌, యూఏఈ దేశాల్లో సైనోఫార్మ్ టీకా తీసుకున్న‌వారు మ‌ళ్లీ అనారోగ్యానికి గుర‌వుతున్న‌ట్లు నివేదికలు చెబుతున్నాయి.

కొవిడ్ ను సంపూర్ణంగా నియంత్రించ‌డంలో చైనా వ్యాక్సిన్లు విఫ‌ల‌మైన‌ట్లు అనేక దేశాల నుంచి సేక‌రించిన‌ డేటా ఆధారంగా తెలుస్తోందని ఇటీవ‌ల న్యూయార్క్ టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. చైనా టీకాలు కొత్త వేరియంట్ల‌పై అస‌లు ప‌నిచేయ‌డం లేద‌ని ఆ రిపోర్ట్‌లో తెలిపారు. దీంతో చైనా టీకాల సామర్థ్యంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

First Published:  23 Jun 2021 2:06 AM GMT
Next Story