Telugu Global
International

సెకండ్ వేవ్.. సెకండ్ పార్ట్ అక్కడ మొదలైంది..

భారత్ లో సెకండ్ వేవ్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. దేశ వైద్య వ్యవస్థలోని లోపాలన్నీ కళ్లకు కట్టింది. వ్యాక్సినేషన్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో విఫలమైందో తెలియజెప్పింది. దీనంతటికీ కారణం డెల్టా వేరియంట్ విజృంభణేనని తేలింది. అయితే భారత్ లో డెల్టా భయాలు తగ్గుతున్న వేళ.. బ్రిటన్, అమెరికాలో ఈ వేరియంట్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఇతర ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే ఫస్ట్ వేవ్ సమయంలో భారత్ […]

సెకండ్ వేవ్.. సెకండ్ పార్ట్ అక్కడ మొదలైంది..
X

భారత్ లో సెకండ్ వేవ్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. దేశ వైద్య వ్యవస్థలోని లోపాలన్నీ కళ్లకు కట్టింది. వ్యాక్సినేషన్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో విఫలమైందో తెలియజెప్పింది. దీనంతటికీ కారణం డెల్టా వేరియంట్ విజృంభణేనని తేలింది. అయితే భారత్ లో డెల్టా భయాలు తగ్గుతున్న వేళ.. బ్రిటన్, అమెరికాలో ఈ వేరియంట్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు.

ఇతర ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే ఫస్ట్ వేవ్ సమయంలో భారత్ పై ప్రభావం కాస్త ఆలస్యంగానూ, తక్కువగానూ కనపడింది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా మరణ మృదంగం వాయించింది. కానీ సెకండ్ వేవ్ మాత్రం భారత్ ని గట్టిగా తాకింది. ఇతర దేశాల్లో కూడా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నా.. భారత్ లో కేసులు, మరణాల సంఖ్య ఊహించని స్థాయిలో భారీగా పెరిగింది. ఇప్పుడా ప్రభావం తగ్గుముఖం పడుతున్నా.. సెకండ్ వేవ్ సెకండ్ పార్ట్ బ్రిటన్, అమెరికాలో మొదలైంది.

బ్రిటన్ లో డెల్టా బీభత్సం..
కరోనా డెల్టా వేరియంట్‌ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. 11రోజులకోసారి అక్కడ డెల్టా వేరియంట్ కేసులు రెట్టింపవుతున్నాయి. మిగతా వాటికంటే డెల్టా వేరియంట్‌ ప్రధాన రకంగా మారిందని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఏడాది మే 20 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహించిన లక్ష స్వాబ్‌ పరీక్షల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. ఏప్రిల్ నుంచి కొవిడ్‌ బాధితులు ఆసుపత్రుల్లో చేరడం ఎక్కువయిందని, మే నెలాఖరుకు ఈ సంఖ్య బాగా పెరిగిందని అంటున్నారు. కొవిడ్ నిర్థారణ పరీక్షలు పెంచి, వ్యాక్సినేషన్ ని మరింత వేగవంతం చేసినా కూడా బ్రిటన్ లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. ఓ దశలో లాక్ డౌన్ ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుందంటే అక్కడ వైరస్ వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా లండన్ లో కొవిడ్ బాధితుల్లో 90శాతం మంది డెల్టా వేరియంట్ బారిన పడ్డారు.

అమెరికాలోనూ డెల్టా కష్టాలు..
మోనోక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు డెల్టా వేరియంట్ అంతగా లొంగడం లేదని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొంది. డెల్టా వేరియంట్‌పై టీకాల సామర్థ్యం కూడా తక్కువగానే ఉందని వివరించింది. ఇన్‌ ఫెక్షన్‌ వ్యాప్తి, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే వైరస్‌ వేరియంట్లను ఆందోళనకర రకాలుగా వర్గీకరిస్తారని.. టీకాలు, చికిత్సలు, నిర్ధారణ పరీక్షలు కూడా వీటిపై అంతగా ప్రభావం చూపలేవని నిపుణులు వెల్లడిస్తున్నారు. అమెరికన్లు అందరూ టీకాలు వేయించుకుని రక్షణ పొందాలని సీడీసీ అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా డెల్టా వేరియంట్‌ పై ఆందోళన వ్యక్తం చేసింది. వేగంగా వ్యాప్తిచెందే సామర్థ్యాన్ని పెంచుకున్న ఈ రకం, మిగతావాటికంటే ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.

First Published:  20 Jun 2021 1:54 AM IST
Next Story