Telugu Global
Family

పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం.. ఎయిమ్స్ ఏం చెబుతోందంటే..?

కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను కబళించింది, సెకండ్ వేవ్ మధ్యవయస్కులవారిపై తీవ్ర ప్రభావం చూపించింది, థర్డ్ వేవ్ కచ్చితంగా చిన్నారులకు ప్రమాదంగా మారుతుంది. ఇదీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. కానీ థర్డ్ వేవ్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడానికి ఎక్కడా శాస్త్రీయమైన ఆధారాలు లేవు, ఇది కేవలం ఊహాజనితమైన హెచ్చరిక మాత్రమే. అయినా సరే సెకండ్ వేవ్ వల్ల వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా, థర్డ్ వేవ్ లో పిల్లలకు వచ్చే ముప్పుని నివారించడానికి ఇప్పటికే వివిధ […]

పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం.. ఎయిమ్స్ ఏం చెబుతోందంటే..?
X

కరోనా ఫస్ట్ వేవ్ వృద్ధులను కబళించింది, సెకండ్ వేవ్ మధ్యవయస్కులవారిపై తీవ్ర ప్రభావం చూపించింది, థర్డ్ వేవ్ కచ్చితంగా చిన్నారులకు ప్రమాదంగా మారుతుంది. ఇదీ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం. కానీ థర్డ్ వేవ్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనడానికి ఎక్కడా శాస్త్రీయమైన ఆధారాలు లేవు, ఇది కేవలం ఊహాజనితమైన హెచ్చరిక మాత్రమే. అయినా సరే సెకండ్ వేవ్ వల్ల వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా, థర్డ్ వేవ్ లో పిల్లలకు వచ్చే ముప్పుని నివారించడానికి ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చిన్నారుల ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టిపెట్టాయి, చిన్న పిల్లలకోసం బెడ్స్ సిద్ధం చేస్తున్నాయి. చిన్నపిల్లల వైద్యనిపుణుల నియామకాలు కూడా కార్పొరేట్ ఆస్పత్రుల్లో పెరిగాయి.

ఈ సన్నద్ధతను ఎవరూ తప్పుబట్టరు, వద్దని చెప్పరు. అయితే థర్డ్ వేవ్ కేవలం చిన్నారులనే ఇబ్బంది పెడుతుందనేది మాత్రం తప్పుడు ప్రచారమేనంటోంది ఎయిమ్స్ తాజా అధ్యయనం. చిన్నపిల్లలు, పెద్దవారిలో కరోనా పాజిటివిటీ రేటు దాదాపు సమానంగానే ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యయనాల్లో భాగంగా.. ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్‌ 10 మధ్య ఢిల్లీ, భువనేశ్వర్, గోరఖ్ పూర్, అగర్తల.. ప్రాంతాల్లో దాదాపు 4,509 మందిపై ఈ సర్వే చేపట్టారు. వీరిలో 700 మంది 2-17 ఏళ్ల మధ్య వయసువారు. మిగతావారంతా 18 ఏళ్లు పైబడినవారు. ఈ అధ్యయనం ప్రకారం కరోనా పాజిటివిటీ రేటు 18 ఏళ్ల లోపు వారిలో 55.7 శాతంగా, అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో 63.5 శాతంగా తేలింది. అంటే దాదాపుగా పెద్దవారిపై కరోనా ప్రభావం ఎలా ఉందో, చిన్న పిల్లలపై కూడా అదే స్థాయిలో ఉందని అర్థమవుతోంది. అంటే చిన్నారులకు కొవిడ్ ముప్పు ప్రత్యేకంగా ఏదీ ఉండదు. కొవిడ్ కి వారు అతీతులు కాదు, అత్యంత ఇష్టులు అంతకంటే కాదు.

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో కూడా చిన్నపిల్లలు కొవిడ్ బారిన పడ్డారు. అయితే లక్షణాలు లేకపోవడం, వారిలో ఉన్న రోగనిరోధక శక్తి వల్ల త్వరగా కోలుకోవడంతో.. వైరస్ వారిపై పెద్దగా ప్రభావం చూపించలేదని తేలింది. దాదాపు అసింప్టమాటిక్ కేసులన్నీ 18ఏళ్ల లోపు ఉన్నవారిలో ఎక్కువగా కనిపించేవి. ఒకవేళ థర్డ్ వేవ్ ముప్పు వచ్చినా, డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభించినా.. ప్రత్యేకంగా చిన్న పిల్లలకు కలిగే నష్టమేమీ లేదు. పెద్దవారితోపాటు, వారు కూడా కొవిడ్ బారిన పడతారంతే. అంతేకానీ థర్డ్ వేవ్ కేవలం చిన్నపిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తుందనే వాదన అర్థరహితం అని ఎయిమ్స్ తాజా అధ్యయనం చెబుతోంది.

First Published:  18 Jun 2021 4:17 AM IST
Next Story