ఢిల్లీకి పొంచి ఉన్న థర్డ్ వేవ్ ముప్పు..
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న వేళ.. ఢిల్లీ కాస్త ముందుగానే అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించింది. మిగతా అన్ని రాష్ట్రాలకంటే అన్ లాక్ విషయంలో ఢిల్లీ ఉదారంగా వ్యవహరిస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేశారు. అయితే ప్రజల ప్రవర్తన మాత్రం మరింత ప్రమాదకరంగా ఉంది. సెకండ్ వేవ్ ని జయించేశామన్న ధైర్యంతో చాలామంది మాస్కులు లేకుండా బయట తిరిగేస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ అనే మాట మరచిపోయారు, గుంపులు గుంపులుగా తిరుగుతూ కొవిడ్ నిబంధనలు […]
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న వేళ.. ఢిల్లీ కాస్త ముందుగానే అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించింది. మిగతా అన్ని రాష్ట్రాలకంటే అన్ లాక్ విషయంలో ఢిల్లీ ఉదారంగా వ్యవహరిస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేశారు. అయితే ప్రజల ప్రవర్తన మాత్రం మరింత ప్రమాదకరంగా ఉంది. సెకండ్ వేవ్ ని జయించేశామన్న ధైర్యంతో చాలామంది మాస్కులు లేకుండా బయట తిరిగేస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ అనే మాట మరచిపోయారు, గుంపులు గుంపులుగా తిరుగుతూ కొవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. ఇదే కొనసాగితే.. థర్డ్ వేవ్ ముప్పు మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
28వేలనుంచి 131కి పడిపోయిన కేసులు..
ఓ దశలో ఢిల్లీలో రోజువారీ కేసులు 28వేల గరిష్ట స్థితికి చేరుకున్నాయి. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడం వల్ల కేసుల సంఖ్య క్రమంగా అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో రోజువారీ కేసులు 131కి చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా తగ్గుతుందని అంచనా. అయితే అన్ లాక్ ప్రక్రియ వల్ల మొదటికే మోసం వచ్చేలా కనపడుతోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు..
సోమవారంనుంచి ఢిల్లీలో అన్ లాక్ పూర్తి స్థాయిలో అమలులోకి రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా బయటకు వస్తున్న పరిస్థితి కనపడుతోంది. షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. అంతవరకు బాగానే ఉంది కానీ, ఇలా బయటకు వెళ్తున్న ప్రజలు కరోనా వ్యాప్తికి పరోక్షంగా దోహదపడుతున్నారని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇటీవల ఢిల్లీలో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో జనాభా ఫుల్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
థర్డ్ వేవ్ పొంచి ఉంది జాగ్రత్త..
కరోనా ఫస్ట్ వేవ్ ని జయించామన్న ఉత్సాహంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జనజీవనంలో గణనీయమైన మార్పు కనిపించింది. విందులు, వినోదాలు, విహారయాత్రలంటూ అందరూ బయటకొచ్చారు. ఆ దెబ్బతో సెకండ్ వేవ్ విజృంభించింది. అప్పటినుంచి తిరిగి జూన్ వరకు అంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ ని జయించేశామన్న తొందరలో అదే తప్పు చేస్తున్నారు ఢిల్లీ వాసులు. మాస్క్ లు లేకుండానే బయటకు వస్తున్నారు, గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దీంతో వైద్యనిపుణులు థర్డ్ వేవ్ ముప్పు ఢిల్లీపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. థర్డ్ వేవ్ ని ముందుగా ఆహ్వానించేది కూడా ఢిల్లీయేనంటున్నారు.