Telugu Global
National

చివరికి రాముడితో కూడా వ్యాపారమేనా..?

అయోధ్య రామమందిరం వ్యవహారం బీజేపీకి కలిసొస్తుందని చాలామంది అంచనా. అయితే ఆ నిర్మాణం పూర్తికాకముందే బీజేపీ నేతలు ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. రామమందిరం ఆలయ భూముల కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2కోట్లు విలువ చేసే భూమిని 18.5కోట్ల రూపాయలకు ట్రస్ట్ కొనుగోలు చేసిందని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ సంచలన ఆరోపణలు చేశాయి. రామాలయం పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యాపారం చేస్తున్నాయంటూ మండిపడ్డాయి. […]

చివరికి రాముడితో కూడా వ్యాపారమేనా..?
X

అయోధ్య రామమందిరం వ్యవహారం బీజేపీకి కలిసొస్తుందని చాలామంది అంచనా. అయితే ఆ నిర్మాణం పూర్తికాకముందే బీజేపీ నేతలు ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. రామమందిరం ఆలయ భూముల కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2కోట్లు విలువ చేసే భూమిని 18.5కోట్ల రూపాయలకు ట్రస్ట్ కొనుగోలు చేసిందని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ సంచలన ఆరోపణలు చేశాయి. రామాలయం పేరుతో ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యాపారం చేస్తున్నాయంటూ మండిపడ్డాయి.

అసలేంటి వివాదం..?
అయోధ్యలో ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రవి తివారీ, సుల్తాన్‌ అన్సారీ, మార్చి 18న కుసుమ్‌ పాఠక్‌, హరీష్ పాఠక్ నుంచి 1.208 హెక్టార్ల స్థలాన్ని రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. వాస్తవానికి కేవలం అగ్రిమెంట్ రాయించుకున్నారంతే. అయితే ఆ స్థలం బాబ్రీమసీదు సమీపంలో కూడా లేదు. కానీ రామాలయ అవసరాలకోసం అటూ దాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కొనుగోలు చేసింది. అసలు రేటు 2కోట్లు కాగా.. దాన్ని రూ.18.5కోట్లు మధ్యవర్తులకు చెల్లించి ట్రస్ట్ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇదంతా కేవలం 5 నిమిషాల వ్యవధిలో జరిగిన వ్యవహారం. పాఠక్ సోదరులనుంచి తివారీ, అన్సారీ అనే వ్యక్తులు రూ.2కోట్లకు స్థలం కొనుగోలు చేసిన 5నిమిషాల తర్వాత ట్రస్ట్.. వారి వద్దనుంచి రూ.18.5కోట్లకు కొన్నది. ఈ గోల్ మాల్ వ్యవహారం బయటపడటంతో.. ట్రస్ట్ కార్యకలాపాలపై ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేశాయి. ట్రస్ట్ వివరణ ఇవ్వాలంటూ శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.

అయోధ్యలో మందిర నిర్మాణం కోసం రామజన్మభూమి ట్రస్టు ప్రజల నుంచి సుమారు రూ.3200 కోట్ల దాకా విరాళాలు సేకరించింది. మరి ఈ సొమ్మంతా పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తివారీ, అన్సారీ నుంచి కొనుగోలు చేసిన స్థలం విషయంలోనే పదహారున్నర కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందంటే.. ఇక మిగతా వ్యవహారాల్లో ఎంతమేర అక్రమాలు జరిగాయోనని ప్రతిపక్షాలు బీజేపీపై మండిపడుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ, హిందువులలో అనుమానాలు రేకెత్తేలా జరిగిన ఈ పరిణామాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

మురికి కడిగేసుకునే ప్రయత్నం..
ప్రతిపక్షాలు చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆలయ నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రామభక్తుల రక్తంతో చేతులు తడుపుకొన్నవారు తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని యూపీ డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేశ్‌ శర్మ మండిపడ్డారు. ఆలయ భూముల కొనుగోలులో అవినీతి జరిగిందన్న ఆరోపణలను ట్రస్టు జనరల్‌ సెక్రెటరీ చంపత్‌ రాయ్‌ కొట్టిపారేశారు.

మకిలి తొలగిపోయేనా..?
ప్రతిపక్షాల ఆరోపణల్ని బీజేపీ నేతలు సులభంగా కొట్టిపారేసినా.. కోట్లాదిమంది హిందూ భక్తుల మనసులో ఉన్న అనుమానాలను మాత్రం వారు తొలగించలేకపోతున్నారు. భూమి కొనుగోళ్ల వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు వారు ధైర్యం చేయడంలేదు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అయోధ్య రామమందిర నిర్మాణం తమకు సానుకూల అంశంగా మారుతుందనుకుంటున్న బీజేపీకి తాజా పరిణామం మింగుడుపడటంలేదు.

First Published:  15 Jun 2021 4:29 PM IST
Next Story