తెలంగాణ కరోనా మరణాల లెక్క తేలేదెలా..?
బీహార్ లో కరోనా మరణాలపై హైకోర్టు లెక్కలు తీయాలని చెప్పడంతో.. ఒక్కసారిగా అక్కడ మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే దాదాపుగా 72శాతం మరణాల కౌంట్ పెరిగింది. దీని ప్రభావం దేశవ్యాప్త లెక్కలపై కూడా పడింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూ రాడానికి ఈ సవరణలే కారణం. గతంలో కరోనా మరణాలను సరిగా లెక్కించకపోవడం, ఇప్పుడు వాటిని సవరించడంతో ఈ తేడా స్పష్టంగా కనపడుతోంది. ఇటీవల కోల్ […]
బీహార్ లో కరోనా మరణాలపై హైకోర్టు లెక్కలు తీయాలని చెప్పడంతో.. ఒక్కసారిగా అక్కడ మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే దాదాపుగా 72శాతం మరణాల కౌంట్ పెరిగింది. దీని ప్రభావం దేశవ్యాప్త లెక్కలపై కూడా పడింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూ రాడానికి ఈ సవరణలే కారణం. గతంలో కరోనా మరణాలను సరిగా లెక్కించకపోవడం, ఇప్పుడు వాటిని సవరించడంతో ఈ తేడా స్పష్టంగా కనపడుతోంది. ఇటీవల కోల్ కతా లెక్కల్లో కూడా ఇలాగే సవరణలు జరిగాయి. తాజాగా తెలంగాణలో కూడా ఇలాగే లెక్కలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. అవును, కరోనా మరణాల లెక్కలపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రముఖ మీడియా సంస్థ ఆర్టీఐ ద్వారా అసలు వివరాలు బయటపెట్టింది.
అధికారిక లెక్కలకు 10రెట్లు ఎక్కువ..
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే.. అధికారిక లెక్కలకంటే, కరోనా మరణాల సంఖ్య 10రెట్లు ఎక్కువని తేలింది. 2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు అధికారికంగా 3,275మంది మాత్రమే కరోనాతో చనిపోయినట్టు రికార్డుల్లో ఉంది. అయితే వాస్తవానికి దీనికి పది రెట్లు, అంటే 32,752 మంది కరోనాతో చనిపోయినట్టు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంలో తేలింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మే వరకు తెలంగాణలో నమోదైన డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా ఈ తేడా బయటపడింది. 2016 నుంచి 2019 మధ్య కాలంలో సహజమరణాల సంఖ్య ఎంత ఉందో, దాని ప్రకారం ఈ ఏడాది లెక్కలు సరిపోల్చితే ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. మరణాల సంఖ్య 10రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
హైకోర్టు విస్మయం..
గతేడాది సెప్టెంబర్ లో కూడా కరోనా మరణాలపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఏప్రిల్ 27న మరోసారి హైకోర్టు కరోనా మరణాల లెక్క చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరణాల లెక్కను తక్కువచేసి చూపడం వల్ల ప్రజల్లో కరోనాపట్ల అప్రమత్తత ఉండదని, అది మరింత ప్రమాదకరమని అన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి. తమిళనాడులో మొత్తం కరోనా మరణాల్లో 27శాతం చెన్నైలో మాత్రమే చోటు చేసుకున్నాయి. ఇక కర్నాటకలోని మరణాల సంఖ్యలో మొత్తం 47శాతం బెంగళూరులోనే నమోదయ్యాయి. అదే స్థాయిలో తెలంగాణ మరణాల్లో కూడా హైదరాబాద్ దే సింహభాగం అని తేలుతోంది. అదే సమయంలో మరణాల సంఖ్యలో కూడా తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.