Telugu Global
International

అమెరికాలో కోవాక్సిన్ కు అత్యవసర అనుమతుల్లేవు..

భారత్‌ బయోటెక్‌ కు చెందిన కోవాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) స్పష్టంచేసింది. టీకా భద్రత, సామర్థ్యం, ప్రతికూలతలకు సంబంధించి తగినంత సమాచారం తమకు చేరలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికాలో కోవాక్సిన్ వినియోగానికి మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. అమెరికాలో భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ పంపిణీకి ‘ఆక్యుజెన్’ అనే కంపెనీ వద్ద హక్కులున్నాయి. ఈ కంపెనీ.. అక్కడ అత్యవసర […]

అమెరికాలో కోవాక్సిన్ కు అత్యవసర అనుమతుల్లేవు..
X

భారత్‌ బయోటెక్‌ కు చెందిన కోవాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వలేమని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) స్పష్టంచేసింది. టీకా భద్రత, సామర్థ్యం, ప్రతికూలతలకు సంబంధించి తగినంత సమాచారం తమకు చేరలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో అమెరికాలో కోవాక్సిన్ వినియోగానికి మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.

అమెరికాలో భారత్ బయోటెక్ తయారీ కోవాక్సిన్ పంపిణీకి ‘ఆక్యుజెన్’ అనే కంపెనీ వద్ద హక్కులున్నాయి. ఈ కంపెనీ.. అక్కడ అత్యవసర వినియోగ అనుమతికోసం FDAకు దరఖాస్తు చేసుకుంది. వివిధ కారణాలతో ఈ దరఖాస్తుని తిరస్కరించిన FDA, టీకాలకు పూర్తిస్థాయి అనుమతులు మంజూరు చేసే ‘బయొలాజిక్స్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌ (BLA)’ పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టీకా పనితీరు, ప్రయోగ పరీక్షల అదనపు సమాచారాన్ని కూడా జోడించాలని సూచించింది.

అయోమయంలో విద్యార్థులు..
ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు ఇది నిజంగా అశనిపాతమే. కోవాక్సిన్ టీకా తీసుకున్నవారికి తమ దేశంలో ఎంట్రీ లేదంటూ ఇప్పటికే అమెరికా, యూకే, సౌదీ అరేబియా దేశాలు స్పష్టం చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా, ఆయా దేశాల అధికారిక వైద్య విభాగాలు కోవాక్సిన్ కి అనుమతివ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. టీకా ప్రక్రియ పూర్తయితేనే అంతర్జాతీయ ప్రయాణికుల్ని తమ ప్రాంతంలో అడుగుపెట్టనిస్తామంటున్న ఆయా దేశాలు కోవాక్సిన్ ని అధికారిక టీకాల లిస్ట్ లో చేర్చలేదు. దీంతో భారత్ లో ఆ టీకా తీసుకుని, విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు, ఇతర విభాగాల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విదేశాలకు వెళ్తే క్వారంటైన్ తప్పనిసరి అవుతోంది, ఇతర అనుమతులు కూడా పరిమితంగానే ఉంటున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవాక్సిన్ కి ఇంకా అత్యవసర అనుమతివ్వలేదు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత పూర్తి సమాచారంతో WHOకి మరోసారి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ ముగిసిన తర్వాతే కోవాక్సిన్ టీకా తీసుకున్న వారికి విదేశీ ప్రయాణాల్లో వెసులుబాటు ఉంటుంది.

First Published:  11 Jun 2021 8:23 PM GMT
Next Story