Telugu Global
National

కోవిడ్ మృతుల్లో బీహార్ తప్పుడు లెక్కలు ఇలా బయటపడ్డాయి..

భారత్ లో కరోనా మరణమృదంగంపై వాస్తవాలు దాచి పెడుతున్నారంటూ అంతర్జాతీయ మీడియా ఆమధ్య పరిశోధనాత్మక కథనాలు రాసింది. అయితే వాటన్నిటినీ మోదీ ప్రభుత్వం కొట్టిపారేసింది. కోవిడ్ లెక్కల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ మండిపడింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏ స్థాయిలో తప్పులు చేస్తున్నాయో తేటతెల్లమైంది. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే కరోనా మృతుల సంఖ్యలో 3971 మంది పేర్లు గల్లంతయ్యాయి. బక్సర్ జిల్లాలో మృతుల సంఖ్య నమోదులో జరిగిన తప్పులపై చీవాట్లు పెట్టిన పాట్నా హైకోర్టు, రాష్ట్రవ్యాప్తంగా […]

కోవిడ్ మృతుల్లో బీహార్ తప్పుడు లెక్కలు ఇలా బయటపడ్డాయి..
X

భారత్ లో కరోనా మరణమృదంగంపై వాస్తవాలు దాచి పెడుతున్నారంటూ అంతర్జాతీయ మీడియా ఆమధ్య పరిశోధనాత్మక కథనాలు రాసింది. అయితే వాటన్నిటినీ మోదీ ప్రభుత్వం కొట్టిపారేసింది. కోవిడ్ లెక్కల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ మండిపడింది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏ స్థాయిలో తప్పులు చేస్తున్నాయో తేటతెల్లమైంది. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే కరోనా మృతుల సంఖ్యలో 3971 మంది పేర్లు గల్లంతయ్యాయి. బక్సర్ జిల్లాలో మృతుల సంఖ్య నమోదులో జరిగిన తప్పులపై చీవాట్లు పెట్టిన పాట్నా హైకోర్టు, రాష్ట్రవ్యాప్తంగా లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించడంతో అసలు విషయం బయటపడింది.

జూన్ 8న బీహార్ లో కోవిడ్ మృతుల సంఖ్య 5,458 అంటూ పేర్కొంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 9న ఆ సంఖ్యను ఏకంగా 9,429కి సవరించింది. ఒక్కసారిగా మృతుల సంఖ్య 72శాతం పెరిగింది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు నితీష్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. మృతుల లెక్కలు దాచిపెట్టారంటూ మండిపడుతున్నాయి. మరణాల లెక్క వెలుగులోకి రావడంతో నితీష్ పాప ప్రక్షాళ జరిగినట్టు కాదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.

కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో గ్రామీణ బీహార్ పెద్దగా ప్రభావితం కాలేదు. రెండో వేవ్ వచ్చేనాటికి రూరల్ బీహార్ లో మరణాల సంఖ్య పెరిగింది. హోమ్ ఐసోలేషన్లో ఉండి చనిపోయినవారిని కోవిడ్ మృతుల కింద లెక్కగట్టలేదు. ప్రైవేటు ఆస్పత్రులు కొన్ని మరణాలను కోవిడ్ లిస్ట్ లో కలపలేదు. కరోనా తగ్గిపోయిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతో మరికొంతమంది చనిపోయారు, వారు కూడా ఆ లిస్ట్ లో లేరు. దీంతో బీహార్ లో మృతుల సంఖ్యలో లెక్కలు తప్పాయి. తాజాగా 72శాతం ఎక్కువగా ఈ లెక్కల్ని సవరించడం మాత్రం విశేషం.

బీహార్ లో కోవిడ్ కారణంగా మృతిచెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4లక్షలు నష్టపరిహారంగా అందిస్తోంది. పరిహారంపై దృష్టిపెట్టడానికంటే ముందు మృతుల సంఖ్య తేల్చాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పరిహారం ఇచ్చేందుకు వెనకాడుతున్న ప్రభుత్వం లెక్కల్లో జిమ్మిక్కులు చేస్తోందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్ష నేతలు. మరోవైపు కరోనా మరణాలపై ఆడిట్ నిర్వహించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ఆదేశించడం విశేషం.

First Published:  11 Jun 2021 4:20 AM IST
Next Story