Telugu Global
National

భారతీయ వ్యాక్సినేషన్ పై మోదీ చెప్పిందంతా అబద్ధమేనా..?

టీకా ప్రక్రియపై జాతీనుద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. అసత్యాలు, అర్థసత్యాలతో ప్రజల్ని ఏమార్చాలని చూసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ టీకా చరిత్రనే ఆయన తనకిష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. గతంలో వ్యాక్సిన్ లకోసం భారతదేశం దశాబ్దాల తరబడి ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూసేదని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ని మనమే సొంతంగా తయారు చేసుకోగలిగామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ అదంతా వాస్తవ విరుద్ధం అని తేలింది. ప్రపంచ టీకా చరిత్రలోనే భారత్ […]

భారతీయ వ్యాక్సినేషన్ పై మోదీ చెప్పిందంతా అబద్ధమేనా..?
X

టీకా ప్రక్రియపై జాతీనుద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. అసత్యాలు, అర్థసత్యాలతో ప్రజల్ని ఏమార్చాలని చూసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ టీకా చరిత్రనే ఆయన తనకిష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. గతంలో వ్యాక్సిన్ లకోసం భారతదేశం దశాబ్దాల తరబడి ఇతర దేశాల సాయం కోసం ఎదురు చూసేదని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ని మనమే సొంతంగా తయారు చేసుకోగలిగామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ అదంతా వాస్తవ విరుద్ధం అని తేలింది. ప్రపంచ టీకా చరిత్రలోనే భారత్ సమున్నత స్థానంలో ఉందని, ఏనాడూ ఇతర దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని చెబుతున్నారు నిపుణులు.

భారత వ్యాక్సిన్ చరిత్ర ఇదీ..
ప్లేగు వ్యాక్సిన్ ని 1897లో అప్పటి బాంబేలోని గ్రాంట్ మెడికల్ కాలేజీలో వాల్డమర్ హాఫ్ కిన్స్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా తనపై తానే ప్రయోగించుకున్నారు. ఆ తర్వాత బైకుల్లా జైలులోని ఖైదీలపై ప్రయోగించారు. 1899లో ప్లేగు లేబరొటరీ భారత్ లో ఏర్పాటైంది. 1948లో మద్రాస్ లోని గిండిలో బీసీజీ ల్యాబొరేటరీ ఏర్పాటైంది. 1940కి ముందే డిఫ్తీరియా, పెట్రుసిస్, టెటనస్ వ్యాక్సిన్లు భారత్ లో తయారయ్యాయి. మొట్టమొదటి జంతు వ్యాక్సిన్ డిపోను 1890 లోనే షిల్లాంగ్‌ లో ఏర్పాటు చేశామని, అదీ భారత సత్తా అని చెబుతున్నారు నిపుణులు. ప్రభుత్వ రంగంలో ఉన్న వ్యాక్సిన్ తయారీ కేంద్రాలన్నీ క్రమక్రమంగా మూతబడగా.. ఇప్పుడు మనం సీరం ఇన్ స్టిట్యూట్, భారత్ బయోటెక్ అంటూ ప్రైవేటు సంస్థలపై ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు.

మశూచి నివారణ ఇలా జరిగింది..
ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రపంచాన్నే గడగడలాడించిన మశూచి వ్యాధికి టీకా కనుగొన్న నాలుగేళ్ల తర్వాత 1802లో భారత్ లో మూడేళ్ల పిల్లవాడికి దాన్ని వినియోగించారు. 1850 వరకు ఈ వ్యాక్సిన్ భారత్ కు దిగుమతి అయింది. అయితే దీన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే లింఫ్ ద్రావణం తగినంత లేకపోవడం సమస్యగా ఉండేది. భారత శాస్త్రవేత్తల కృషి ఫలితంగా లింఫ్ ద్రావణాన్ని మనం తయారు చేసుకోవడం మొదలు పెట్టి దానిలో స్వయం సమృద్ధి సాధించాం. 1947నాటికి మశూచి టీకాలు పూర్తిగా దేశీయంగానే తయారయ్యేవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దక్షిణ అమెరికాలో మశూచి నిర్మూలన 1971లో పూర్తికాగా, భారత్, ఇతర ఆసియా దేశాల్లో 1975లో మశూచిని పూర్తిగా నిర్మూలించగలిగారు. ఆఫ్రికా దేశాల్లో 1977వరకు మశూచి జాడ ఉంది. భారత్ లో ఈ వ్యాధి నిర్మూలనకు అధిక సమయం పట్టడానికి టీకా లభ్యత ఒక్కటే కారణం కాదని, మన సామాజిక, ఆర్థిక అంశాలు కూడా దానికి కారణంగా నిలిచాయని చెబుతున్నారు నిపుణులు.

పోలియో వ్యాక్సిన్ మనమే తయారు చేసుకున్నాం..
నోటి ద్వారా తీసుకునే ఓరల్ పోలియా వ్యాక్సిన్(OPV), ఇంజెక్షన్ ద్వారా తీసుకునే ఇంజెక్షన్ పోలియో వ్యాక్సిన్ (IPV) రెండింటి తయారీలో కూడా భారత్ ముందుంది. పోలియో వ్యాక్సిన్ మొదట అమెరికాలో తయారు చేశారు. 1960లో నోటిద్వారా తీసుకునే పోలియో డ్రాప్స్ తయారు చేశారు. భారత్ లోని పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 1970లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ తయారు చేసింది. కొన్ని రాజకీయ సంకుచిత నిర్ణయాలతో ఆ తర్వాత మనం వెనకబడటంతో.. పోలియోని భారత్ నుంచి తరిమేయడానికి 2011 వరకు సమయం పట్టింది.

మిషన్ ఇంద్రధనుస్సుకి అసత్యాల రంగులద్దిన మోదీ..
మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా భారత్ లో చిన్నారుల వ్యాక్సినేషన్ ని 60నుంచి 90శాతానికి పెంచామని చెప్పారు మోదీ. వాస్తవం ఏంటంటే.. భారత్ లో ఇప్పటి వరకు ఒక్క రాష్ట్రం కూడా 90శాతం మార్కుని అందుకోలేదు. భారత ఆరోగ్య శాఖ అంచనా గణాంకాలనే మోదీ తమ ప్రభుత్వం గొప్పలుగా చెప్పుకున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా జరిగిందేమీ లేదు. కరోనా వ్యాక్సిన్ విషయంలో భారత్ ఇతర దేశాలకంటే ముందంజలో ఉందనే విషయం కూడా అవాస్తవమే. తమ లోపాలను కప్పి పుచ్చుకునేందుకు.. ప్రధాని మోదీ ఏకంగా భారతీయ టీకా చరిత్రనే చిన్నచూపు చూడటం నిజంగా విచారకరమైన విషయం.

First Published:  9 Jun 2021 3:47 AM GMT
Next Story