Telugu Global
National

కోవాక్సిన్ తీసుకున్నారా..? అయితే ఆ దేశాల్లో నో ఎంట్రీ..

టీకా వేసుకున్న వారికే ఎంట్రీ అంటున్న దేశాలతో భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. అందరూ కాదు, కోవాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే. అవును, కోవాక్సిన్ తీసుకున్నా తీసుకోనట్టే లెక్క అంటూ కొన్ని దేశాలు వారికి అనుమతులివ్వడంలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి ఇంకా అత్యవసర వినియోగ అనుమతి లభించకపోవడంతోనే ఈ తలనొప్పులన్నీ. టీకా అనుమతుల లెక్కేంటంటే..? మనదేశంలో కేవలం మన ప్రభుత్వం అనుమతిచ్చిన వ్యాక్సిన్లనే ఉపయోగిస్తున్నారు. WHO అనుమతులతో మనకి అవసరం లేదు. ఇంగ్లండ్ లాంటి కొన్ని దేశాలు […]

కోవాక్సిన్ తీసుకున్నారా..? అయితే ఆ దేశాల్లో నో ఎంట్రీ..
X

టీకా వేసుకున్న వారికే ఎంట్రీ అంటున్న దేశాలతో భారతీయులు ఇబ్బంది పడుతున్నారు. అందరూ కాదు, కోవాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే. అవును, కోవాక్సిన్ తీసుకున్నా తీసుకోనట్టే లెక్క అంటూ కొన్ని దేశాలు వారికి అనుమతులివ్వడంలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి ఇంకా అత్యవసర వినియోగ అనుమతి లభించకపోవడంతోనే ఈ తలనొప్పులన్నీ.

టీకా అనుమతుల లెక్కేంటంటే..?
మనదేశంలో కేవలం మన ప్రభుత్వం అనుమతిచ్చిన వ్యాక్సిన్లనే ఉపయోగిస్తున్నారు. WHO అనుమతులతో మనకి అవసరం లేదు. ఇంగ్లండ్ లాంటి కొన్ని దేశాలు స్థానిక ప్రభుత్వ అనుమతితోపాటు, WHO అనుమతిచ్చిన వ్యాక్సిన్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం మన దేశంలో వినియోగిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు WHO అనుమతి ఉంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ – ఆస్ట్రాజెనెకా సంయుక్త ఉత్పత్తి అయిన ఈ వ్యాక్సిన్ ఇతర దేశాలు కూడా వినియోగిస్తున్నాయి. అయితే భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కి మాత్రం ఇంకా WHO అనుమతి ఇవ్వలేదు. దరఖాస్తు ప్రక్రియ పెండింగ్ లో ఉంది. దీంతో ఇతరదేశాలేవీ కోవాక్సిన్ ని పరిగణలోకి తీసుకోవడంలేదు. భారత్ లో మేము రెండు డోసుల టీకా తీసుకున్నామని సంబరపడి విదేశీ ప్రయాణాలకు సిద్ధపడితే ముందు ఏ వ్యాక్సిన్ వేసుకున్నారో చెప్పండి అని అడుగుతున్నారు. కోవిషీల్డ్ అయితే ఓకే చెబుతున్నారు, కోవాక్సిన్ అయితే కుదరదు పొమ్మంటున్నారు.

సౌదీ ఆరేబియా, అమెరికా, బ్రిటన్ దేశాలు కోవాక్సిన్ తీసుకున్నవారిని అనుమతించడంలేదు. ఒకవేళ, అత్యవసర ప్రయాణ అనుమతిచ్చినా కూడా అక్కడకి వెళ్లిన తర్వాత హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందే. WHO కోవాక్సిన్ కి అనుమతిచ్చే వరకు అలా హోమ్ క్వారంటైన్ లో ఉండేందుకు సిద్ధపడితేనే తమ దేశాల్లోకి ఎంట్రీ అంటున్నారు అధికారులు.

సౌదీ అరేబియాలో ప్రభుత్వ కోవిడ్ యాప్ తవ్వాకల్నా, హెల్త్ పాస్ పోర్ట్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ యాప్ కేవలం ఫైజర్, ఆస్ట్రాజెనెకా, WHO ఆమోదించిన ఇతర వ్యాక్సిన్లను మాత్రమే గుర్తిస్తుంది. కోవాక్సిన్ ను టీకాగా పరిగణించదు. అంటే కోవాక్సిన్ తీసుకుని సౌదీ అరేబియా వెళ్తే.. కచ్చితంగా క్వారంటైన్లో ఉండాలి. కోవిడ్ పరీక్షలు కూడా తప్పనిసరి.

విద్యార్థులకు తిప్పలు..
ఉన్నత విద్యకోసం యూఎస్, యూకే వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు ఈ నియమం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం సింగిల్ డోస్ తీసుకున్న కొంతమంది, విదేశీ నిబంధనలకు భయపడి రెండో డోసు కోవిషీల్డ్ తీసుకుంటామని ఆస్పత్రులకు వస్తున్నారట. అయితే భారత్ లో ఇలాంటి మిక్స్డ్ డోస్ కి అనుమతి లేదు కాబట్టి, డాక్టర్లు వారిని వారించి పంపించేస్తున్నారు. వీలైతే మళ్లీ రెండు డోసులు కోవిషీల్డ్ తీసుకోడానికి కూడా కొంతమంది సిద్ధపడుతున్నారట. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కాకుండానే కోవాక్సిన్ కి భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, అంతర్జాతీయంగా మాత్రం ఇంకా గుర్తింపు లభించలేదు. WHO నుంచి కొవాక్సిన్ కి అనుమతి వచ్చే వరకు ఈ తిప్పలు తప్పేలా లేవు.

First Published:  9 Jun 2021 12:48 AM GMT
Next Story