Telugu Global
NEWS

ఒకేమాటపై ఉందాం.. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. సీఎంలకు జగన్ లేఖ..

వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేమాటపై ఉండాలని కోరుతూ లేఖలు రాశారు ఏపీ సీఎం జగన్. వ్యాక్సిన్‌ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒకే గొంతుక వినిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ సరఫరాలో రాష్ట్రాలు పరస్పర సహకారం అందించుకోవాలని జగన్‌ కోరారు. వ్యాక్సినేషన్‌ వేగంగా జరగకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, టీకా లభ్యత […]

ఒకేమాటపై ఉందాం.. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.. సీఎంలకు జగన్ లేఖ..
X

వ్యాక్సినేషన్ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేమాటపై ఉండాలని కోరుతూ లేఖలు రాశారు ఏపీ సీఎం జగన్. వ్యాక్సిన్‌ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒకే గొంతుక వినిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ సరఫరాలో రాష్ట్రాలు పరస్పర సహకారం అందించుకోవాలని జగన్‌ కోరారు. వ్యాక్సినేషన్‌ వేగంగా జరగకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, టీకా లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని ఆ లేఖల్లో వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని ముక్త కంఠంతో కోరదామని అన్నారు.

గ్లోబల్ టెండర్లకు ఆదరణ లేదు..
ఒకవేళ కేంద్రం వ్యాక్సినేషన్ పై చేతులెత్తేసినా.. రాష్ట్రాలు సొంతగా వాటిని సమకూర్చుకుందామంటే పరిస్థితులు అనుకూలించడంలేదు. ఏపీ పిలిచిన గ్లోబల్ టెండర్లకు కనీసం ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. కంపెనీలన్నీ కేంద్రానికే నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ఇష్టపడుతున్నాయి. ఈ దశలో ఇక రాష్ట్రాల చేతుల్లో ఏమీ లేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిందలు మోయాల్సి వస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యతను కేంద్రానికే అప్పగించాలని సీఎం జగన్ ముఖ్యమంత్రులను కోరారు.

“నేను అందరి ముఖ్యమంత్రులను కోరేది ఒక్కటే.. వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రమే చేపట్టాలని ఒకే మాటగా వినిపిద్దాం. ప్రారంభంలో కేంద్రమే వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత తీసుకున్న విషయం మీకు తెలిసిందే. ఆరోగ్య సిబ్బందికి సరైన సమయంలో టీకాలు ఇవ్వడం మంచి ఫలితాలను ఇచ్చింది. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వాలి అన్న నిర్ణయంతో సరైన సమయంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయగలిగాం. తద్వారా కరోనా సెంకడ్‌ వేవ్‌ ఉధృతిలో కూడా వారు వైరస్‌ తో పోరాడగలిగారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్ది ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ” అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు జగన్.

అన్ని రాష్ట్రాల్లోనూ అసంతృప్తి..
ఇప్పటికే కొంతమంది రెబల్ ముఖ్యమంత్రులు వ్యాక్సినేషన్ విషయంలో తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్రంతో యుద్ధానికి దిగిపోయారు కూడా. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా టీకాల బాధ్యత కేంద్రానికేనంటూ కుండబద్దలు కొట్టారు. ఈ దశలో ఏపీ సీఎం జగన్ కూడా వ్యాక్సినేషన్ వ్యవహారాన్ని కేంద్రం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గ్లోబల్ టెండర్లకు సానుకూల ఫలితాలు లేవని, ఇక రాష్ట్రాలు చేయగలిగిందేమీ లేదని అంటున్నారు.

కేంద్రం వైఖరి ఏంటి..?
అయితే ఇప్పటికే కేంద్రం టీకాల విషయంలో తప్పు మీద తప్పు చేస్తూ వచ్చింది. దేశీయ టీకాలను ప్రోత్సహించే క్రమంలో అంతర్జాతీయంగా టీకాల సేకరణ చేపట్టలేదు. పరువు, ప్రతిష్ట అంటూ పేద దేశాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేసి మనదేశ ప్రజలకు ఖాళీ చేతులు చూపించారు. ఇప్పుడిక విదేశీ టీకాలకు ఆర్డర్ ఇచ్చినా.. తగినన్ని నిల్వలు లేవు కాబట్టి, సరఫరా పెరుగుతుందని భావించలేం. ఈ దశలో రాష్ట్రాలనుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

First Published:  4 Jun 2021 2:05 AM IST
Next Story