వ్యాక్సిన్ లో మిక్సింగ్ వద్దు.. కేంద్రం క్లారిటీ..
తొలి డోసు కొవాక్సిన్ తీసుకుని, రెండో డోసు కొవిషీల్డ్ తీసుకోవచ్చా..? తొలి డోసు కొవిషీల్డ్ తీసుకుని, రెండో డోసు స్పుత్నిక్-వి తీసుకుకోవచ్చా..? అనే అనుమానాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇలాంటి మిక్సింగ్ వ్యవహారంపై కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడతాయనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ప్రస్తుతానికి టీకా డోసుల మిక్సింగ్ కి అనుమతి లేదని, తొలి డోసు ఏ […]
తొలి డోసు కొవాక్సిన్ తీసుకుని, రెండో డోసు కొవిషీల్డ్ తీసుకోవచ్చా..? తొలి డోసు కొవిషీల్డ్ తీసుకుని, రెండో డోసు స్పుత్నిక్-వి తీసుకుకోవచ్చా..? అనే అనుమానాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇలాంటి మిక్సింగ్ వ్యవహారంపై కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడతాయనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ప్రస్తుతానికి టీకా డోసుల మిక్సింగ్ కి అనుమతి లేదని, తొలి డోసు ఏ కంపెనీ టీకా వేసుకుంటే, రెండో డోసు కూడా అదే కంపెనీ టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై అంతర్జాతీయంగా పరిశోధనలు జరుగుతున్నాయని, సానుకూల ఫలితాలున్నా, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా కూడా ఉండే అవకాశం ఉందని, అందుకే దాని జోలికి వెళ్లడంలేదని స్పష్టం చేశారు అధికారులు. అదే సమయంలో రెండు డోసుల మధ్య వ్యవధి 12 వారాలు ఉండాలని స్పష్టం చేశారు. కొవాక్సిన్, కొవిషీల్డ్ రెండు టీకాలకు ఈ వ్యవధి ఒకటేనని చెప్పారు.
కొనసాగుతున్న పరిశోధనలు..
ప్రస్తుతానికి రెండు డోసులు ఒకే టీకా వేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసినా.. దీనిపై పరిశోధనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని సిద్ధార్థనగర్ లో 20 మందికి మొదటి, రెండో డోసులుగా వేర్వేరు సంస్థలకు చెందిన వ్యాక్సిన్లు వేశారు. తొలిడోసుగా సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్ ను గత ఏప్రిల్ లో వేయగా, రెండో డోసుగా భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాక్సిన్ మే నెలలో వేశారు. తర్వాత వీరంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అసలు దుష్ప్రభావాలేవీ కనిపించలేదని అధికారులు చెప్పారు. అటు స్పెయిన్ కు చెందిన కార్లోస్ హెల్త్ ఇన్ స్టిట్యూట్ కూడా ఇలాంటి పరిశోధనే సాగించింది. మొదటి డోసుగా ఆస్ట్రాజెనెకా, రెండో డోసుగా ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు ఆరోగ్యంగా ఉన్నారని, ఆ టీకాలు వారిలో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని గుర్తించారు.
రోజుకి కోటి వ్యాక్సిన్ల పంపిణీ కలకాదు..
భారత్ లో రోజుకి కోటిమందికి వ్యాక్సినేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఐసీఎంఆర్ అధినేత బలరాం భార్గవ తెలిపారు. ఆగస్ట్ నాటికి ఆ టార్గెట్ అందుకుంటామని, డిసెంబర్ చివరినాటికి భారత్ లో అర్హులందరికీ వ్యాక్సిన్ వేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీకా కొరతపై వస్తున్న వార్తల్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొట్టిపారేశారు.