సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి ఇంట విషాదం..
ఏడాది క్రితం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1200కిలోమీటర్లు ప్రయాణం చేసిన సాహస బాలిక జ్యోతి కుమారి ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని కాపాడుకోడానికి ఏ కూతురూ చేయలేని సాహసం చేసి దేశవ్యాప్తంగా అందరి అభినందనలు పొందిన జ్యోతి కుమారి.. చివరకు ఆ తండ్రిని కోల్పోయింది. గుండెపోటుతో జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ మరణించాడు, కుమార్తెకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. ఏడాది క్రితం, […]
ఏడాది క్రితం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1200కిలోమీటర్లు ప్రయాణం చేసిన సాహస బాలిక జ్యోతి కుమారి ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రిని కాపాడుకోడానికి ఏ కూతురూ చేయలేని సాహసం చేసి దేశవ్యాప్తంగా అందరి అభినందనలు పొందిన జ్యోతి కుమారి.. చివరకు ఆ తండ్రిని కోల్పోయింది. గుండెపోటుతో జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ మరణించాడు, కుమార్తెకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు.
ఏడాది క్రితం, కరోనా ఫస్ట్ వేవ్ విజృంభించిన వేళ, దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించింది. ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోయింది. పట్టణాల్లో పనిలేక, సొంత ఊరికి వెళ్లే వీలు లేక వలస జీవుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారిలో గుర్ గావ్ లో పనికి వచ్చిన తండ్రీ కూతుళ్లు మోహన్, జ్యోతి కుమారి కూడా ఉన్నారు. గుర్ గావ్ లో ఆటో డ్రైవర్ గా పనిచేసేందుకు మోహన్ రాగా, తండ్రికి చేదోడువాదోడుగా ఆయనతోపాటే ఉండేది జ్యోతి. ఆటోయాక్సిడెంట్ లో తండ్రి గాయపడటం, అంతలోనే లాక్ డౌన్ రావడంతో జ్యోతికి దిక్కుతోచలేదు. గుర్ గావ్ లో ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో సొంతఊరికి వచ్చేందుకు తండ్రీకూతుళ్లు సిద్ధపడ్డారు. తండ్రి అనారోగ్యంతో నడవలేని పరిస్థితి, దీంతో కూతురు సైకిల్ పై తండ్రిని ఎక్కించుకుని బీహార్ లోని దర్భంగాకి బయలుదేరింది.
1200 కిలోమీటర్ల దూరం, వారం రోజుల ప్రయాణం.
తండ్రికోసం ఏ కూతురూ చేయని సాహసం చేసింది జ్యోతి కుమారి. వారం రోజులపాటు అలుపెరగకుండా సైకిల్ తొక్కుతూ హర్యానా నుంచి బీహార్ చేరుకుంది. ఈ వార్త స్థానిక మీడియాలో రావడంతో జ్యోతికుమారి ఒక్కసారిగా పాపులర్ అయింది. దేశవ్యాప్తంగా ఆమెకు సైకిల్ గర్ల్ అనే పేరొచ్చింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక కూడా జ్యోతి కుమారి సాహసంపై ట్వీట్ చేయడంతో ఆమె సాహసగాథకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వం ఆమెకు ప్రధాన మంత్రి బాలపురస్కారం అందించింది. గతేడాది మే 18న తండ్రీకూతుళ్లు బీహార్ కు చేరుకోగా.. సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత జ్యోతి కుమారి తండ్రి చనిపోవడం దురదృష్టకరం.
ఈ విషయం తెలుసుకున్న దర్బంగ జిల్లా కలెక్టర్ డాక్టర్ త్యాగరాజన్.. జ్యోతి కుమారి కుటుంబాన్ని పరామర్శించారు. జ్యోతి తండ్రి మోహన్ కు మొత్తం ఆరుగురు సంతానం. పిల్లలకు ఆర్థిక సాయం అందించడంతోపాటు, కుటుంబానికి అండగా ఉంటామని స్థానిక అధికారులు తెలిపారు. తండ్రి ప్రాణం కోసం జ్యోతి కుమారి అంత సాహసం చేసినా.. చివరకు విధి ఆ తండ్రీ కూతుళ్లను ఇలా వేరుచేసింది.