Telugu Global
National

మోదీకి దీదీ మరో షాక్.. బెంగాల్ లో ఘర్ వాపసీ..

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన తృణమూల్ నేతలందరికీ ఐదేళ్లు ఒడ్డునపడ్డ చేపల్లా బతకడం కష్టంగా మారుతోంది. అందుకే వారంతా సొంతగూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గోడదూకేందుకు రెడీగా ఉన్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మమతా బెనర్జీ తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యేలోగా బెంగాల్ బీజేపీ చీలికలు పేలికలు కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమబెంగాల్ లో అధికారం గ్యారెంటీ అని కలలుగన్న బీజేపీకి ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓటమి […]

మోదీకి దీదీ మరో షాక్.. బెంగాల్ లో ఘర్ వాపసీ..
X

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన తృణమూల్ నేతలందరికీ ఐదేళ్లు ఒడ్డునపడ్డ చేపల్లా బతకడం కష్టంగా మారుతోంది. అందుకే వారంతా సొంతగూటికి చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు గోడదూకేందుకు రెడీగా ఉన్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మమతా బెనర్జీ తిరిగి అసెంబ్లీకి ఎన్నికయ్యేలోగా బెంగాల్ బీజేపీ చీలికలు పేలికలు కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

పశ్చిమబెంగాల్ లో అధికారం గ్యారెంటీ అని కలలుగన్న బీజేపీకి ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓటమి ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే ఎన్నికల తర్వాత ఆ సంతోషం కూడా ఎక్కువకాలం బీజేపీకి మిగిల్చేలా లేరు దీదీ. ఆ పార్టీపై ఘర్ వాపసీ అస్త్రం ప్రయోగించారు. ఎన్నికల ముందు టీఎంసీని వదిలి వెళ్లినవారంతా దీదీ నీడలోకి వచ్చేందుకే ఇష్టపడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే సోనాలీ గుహా, తృణమూల్ ని వదిలిపెట్టిన తర్వాత నీటిలోంచి బైటపడ్డ చేపలా ఉందని బేలగా మాట్లాడుతున్నారు. అప్పట్లో దీదీని వదిలి బీజేపీ కండువా కప్పుకున్న ఫుట్‌ బాల్ క్రీడాకారుడు దీపేందు బిశ్వాస్ మరోసారి తృణమూల్ జెండా పట్టుకుంటానని దీదీకి లేఖ రాశారు. సరళా ముర్మి, అమల్ ఆచార్య వంటి నేతలు కూడా టీఎంసీలోకి వచ్చేస్తామంటూ రాయబారాలు పంపుతున్నారట. మాజీ మంత్రి రాజీవ్ బెనర్జీ కూడా ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినవారే కాదు, ఏడెనిమిది మంది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తృణమూల్‌ లో చేరడంపై ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ తెలిపారు. అయితే కార్యకర్తల మనోభావాలు దృష్టిలో ఉంచుకొని తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారాయన. పైకి ఇలాంటి కబుర్లు చెబుతున్నా.. బీజేపీని బలహీన పరిచేందుకు వలసల్ని ప్రోత్సహించడమే టీఎంసీ మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది.

ముకుల్ రాయ్ కూడా తిరిగి వచ్చేస్తారా..?
తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ తర్వాత నెంబర్2 గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కూడా తిరిగి దీదీ దగ్గరకు వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు బాగా ముందుగానే ముకుల్ రాయ్ బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆశించారాయన. అయితే ఓటమి తర్వాత కనీసం ప్రతిపక్షనేత గా కూడా అవకాశం దక్కకపోవడంతో ముకుల్ రాయ్ అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్లేటు ఫిరాయిస్తారని చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన సువేందు అధికారిని బీజేపీ నెత్తిన పెట్టుకోవడం, ప్రతిపక్షనేత పదవి కట్టబెట్టడం కొంతమంది సీనియర్లకు కూడా నచ్చడంలేదు. దీంతో బీజేపీలో అంతర్గత పోరు మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని తమకు అనూకూలంగా మార్చుకుని బెంగాల్ లో బీజేపీని పూర్తిగా బలహీన పరిచేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

First Published:  1 Jun 2021 5:47 PM IST
Next Story