జూలై తర్వాత కొవాక్సిన్ కి WHO అనుమతి..
ప్రస్తుతం భారత్ సహా 13 దేశాల్లో వినియోగంలో ఉన్న కొవాక్సిన్ కు ప్రపంచ దేశాల్లో కూడా అనుమతి సంపాదించేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి జూలై తర్వాత తమకు అనుమతి వచ్చే అవకాశముందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. WHO అనుమతి లభిస్తే, 60దేశాల్లో కొవాక్సిన్ కి లైన్ క్లియర్ అయినట్టే. ప్రస్తుతం భారత్ తో పాటు, మెక్సికో, ఫిలిప్పైన్స్, ఇరాన్, పరాగ్వే, జింబాబ్వే.. సహా మొత్తం […]
ప్రస్తుతం భారత్ సహా 13 దేశాల్లో వినియోగంలో ఉన్న కొవాక్సిన్ కు ప్రపంచ దేశాల్లో కూడా అనుమతి సంపాదించేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి జూలై తర్వాత తమకు అనుమతి వచ్చే అవకాశముందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. WHO అనుమతి లభిస్తే, 60దేశాల్లో కొవాక్సిన్ కి లైన్ క్లియర్ అయినట్టే.
ప్రస్తుతం భారత్ తో పాటు, మెక్సికో, ఫిలిప్పైన్స్, ఇరాన్, పరాగ్వే, జింబాబ్వే.. సహా మొత్తం 13 దేశాల్లో కొవాక్సిన్ ని వినియోగిస్తున్నారు. అయితే యూరోపియన్ యూనియన్ లోని దేశాలు ఇంకా కొవాక్సిన్ కి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి తీసుకుంటే బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్ లోని ఇతర దేశాలు కూడా కొవాక్సిన్ కి రెడ్ కార్పెట్ పరుస్తాయి. అంతే కాదు.. యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ (EMA), లేదా WHO అనుమతి ఇచ్చిన వ్యాక్సిన్లు వేసుకున్న వారికే తమదేశంలోకి ఎంట్రీ అంటూ యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. అత్యవసర ప్రయాణాలకు మాత్రం మినహాయింపు ఉంది. ఈ నేపథ్యంలో WHO అనుమతికోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
తొలిసారిగా ఏప్రిల్ 19న, ప్రపంచ వ్యాప్తంగా కొవాక్సిన్ వినియోగ అనుమతికోసం తమ ఆశక్తిని వ్యక్తపరుస్తూ WHO కి భారత్ బయోటెక్ దరఖాస్తు చేసింది. అయితే పూర్తి వివరాలు సమర్పించాలన్న సూచనతో.. భారత్ బయోటెక్ అన్నీ సిద్ధం చేసి మరో దఫా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి భారత్ బయోటెక్ త్వరలో ప్రాథమిక సమావేశం ఏర్పాటు చేసుకుని రిపోర్ట్ సమర్పిస్తుంది.
ఫార్మసీ కంపెనీలకు యూరోపియన్ యూనియన్ అతి పెద్ద మార్కెట్. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్.. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, చైనా కంపెనీ సినోఫార్మ్ టీకాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ లిస్ట్ లో చేరేందుకు ఇప్పుడు కొవాక్సిన్ కూడా అనుమతికోసం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుని పరిశీలించిన తర్వాత WHO నిపుణులు భారత్ బయోటెక్ తయారీ కేంద్రానికి ఆన్ సైట్ ఇన్స్పెక్షన్ కు రావాల్సి ఉంటుంది.
మూడో దశలో 26వేలమందిపై ప్రయోగాలు చేసిన భారత్ బయోటెక్ సంస్థ కొవాక్సిన్ 78శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపింది. మార్చిలో ఇదే సంస్థ తమ టీకా సామర్థ్యాన్ని 80.6 శాతంగా తెలపడం గమనార్హం. ప్రస్తుతం WHO అనుమతికోసం భారత్ బయోటెక్ ఎదురు చూస్తోంది.