Telugu Global
National

కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న రాష్ట్రాలు..

కరోనా తొలిదశలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి, కేసులు తగ్గాక ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ అన్ లాక్ దిశగా అడుగులు వేసిన కేంద్రం, సెకండ్ వేవ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. అటు వ్యాక్సినేషన్ ని పట్టించుకోలేదు, ఇటు ఆక్సిజన్ సరఫరాని సమర్థంగా నిర్వహించలేదు. కనీసం ఆంక్షల విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది కేంద్రం. ఈ దశలో రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర వైఖరిని తీవ్రంగా నిర‌సిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తప్పుబడుతున్నాయి […]

కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న రాష్ట్రాలు..
X

కరోనా తొలిదశలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి, కేసులు తగ్గాక ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ అన్ లాక్ దిశగా అడుగులు వేసిన కేంద్రం, సెకండ్ వేవ్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. అటు వ్యాక్సినేషన్ ని పట్టించుకోలేదు, ఇటు ఆక్సిజన్ సరఫరాని సమర్థంగా నిర్వహించలేదు. కనీసం ఆంక్షల విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది కేంద్రం. ఈ దశలో రాష్ట్రప్రభుత్వాలు కేంద్ర వైఖరిని తీవ్రంగా నిర‌సిస్తున్నాయి.

ముఖ్యంగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని తప్పుబడుతున్నాయి వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు. రాష్ట్రాలపై పెత్తనం చలాయించడానికి, జీఎస్టీ పేరుతో ఆర్థిక వనరుల్లో వాటా లాగేసుకోడానికి ముందు వరుసలో ఉండే కేంద్రం.. విపత్తు వేళ మాత్రం రాష్ట్రాలను గాలికి వదిలేస్తుందా అని ప్రశ్నిస్తున్నారు విపక్షాల నేతలు.

‘పాకిస్థాన్‌ మన దేశంపై దాడి చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోండంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను వదిలేస్తుందా? ఉత్తర ప్రదేశ్‌ తన యుద్ధట్యాంకులు తనే కొనుక్కోవాలా? సైనికులకోసం తుపాకుల్ని ఢిల్లీ ప్రభుత్వాన్నే కొనమంటారా? ఇపుడు మన దేశం కొవిడ్‌-19పై యుద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ సమకూర్చకుండా.. మీ చావు మీరు చావండంటూ రాష్ట్రాలను ఎందుకు వదిలేస్తోంది?’ అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఢిల్లీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆధిపత్యం లేకుండా తన పట్టు నిలుపుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఢిల్లీలో సంక్షోభం వచ్చింది, వ్యాక్సిన్ ఇవ్వండి అంటే మాత్రం పత్తా లేకుండా పోతోంది. ఈ విషయంపైనే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని నిలదీశారు. వ్యాక్సిన్ పూర్తి భారం రాష్ట్రాలు మోయలేవని, కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వ్యాక్సిన్ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుని ఢిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా తప్పుబట్టాయి. మన దేశంలో వ్యాక్సిన్ తయారవుతున్నా మనకి అందుబాటులో లేకపోవడం శోచనీయం అంటున్నాయి. విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి మంచిపేరు తెచ్చుకున్న ప్రధాని మోదీ, దేశ ప్రజల్ని మోసం చేశారంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. మరోవైపు టీకా ఉత్పత్తిదారులు రాష్ట్రాలకు నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కూడా సుముఖంగా లేరనే విషయం తేలిపోయింది. కేంద్రానికి ఇవ్వాల్సిన కోటా పూర్తయితేనే ఆ తర్వాత రాష్ట్రాలకు ఇస్తామంటూ టీకా సంస్థల యజమానులు తేల్చి చెప్పారు. మరోవైపు గ్లోబల్ టెండర్లకు వెళ్లాలన్నా కూడా ఆయా సంస్థలకు కేంద్రం అనుమతివ్వడం తప్పనిసరి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతిలో లేని వ్యవహారాన్ని నెత్తినవేసుకుని ప్రతిపక్షాల విర్శలు కాచుకుంటున్నాయి. తప్పు కేంద్రానిదైనా నింద మాత్రం రాష్ట్రాలపైనే పడుతోంది. కనీసం థర్డ్ వేవ్ సమయానికైనా వ్యాక్సినేషన్ సజావుగా సాగితే కేసుల సంఖ్య అదుపులో ఉండే అవకాశం ఉంది.

First Published:  27 May 2021 7:25 AM IST
Next Story