ఈ మరణాలకు లెక్క చెప్పేదెవరు..?
కరోనాతో మరణించారని స్పష్టంగా తెలుస్తున్నా కూడా.. డెత్ సర్టిఫికెట్ లో ఆ కారణం రాయకుండా తప్పించుకుంటున్నారు చాలామంది వైద్యులు. ఆస్పత్రుల్లో జరిగే మరణాలకే ఇలా ఉంటే.. ఇక ఇంటి దగ్గర చనిపోతున్నవారి పరిస్థితి ఏంటి? కరోనా టెస్ట్ లేదు కాబట్టి.. అవన్నీ సహజ మరణాల లెక్కలోకే వెళ్తున్నాయి. కరోనా సోకినా.. ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోతున్నవారిని కరోనా లిస్ట్ లో కలపడంలేదు. టెస్ట్ చేయించుకోకపోయినా, టెస్ట్ రిజల్ట్ రాకపోయినా.. మరణానికి కరోనా కారణం కాదని అనేస్తున్నారు. […]
కరోనాతో మరణించారని స్పష్టంగా తెలుస్తున్నా కూడా.. డెత్ సర్టిఫికెట్ లో ఆ కారణం రాయకుండా తప్పించుకుంటున్నారు చాలామంది వైద్యులు. ఆస్పత్రుల్లో జరిగే మరణాలకే ఇలా ఉంటే.. ఇక ఇంటి దగ్గర చనిపోతున్నవారి పరిస్థితి ఏంటి? కరోనా టెస్ట్ లేదు కాబట్టి.. అవన్నీ సహజ మరణాల లెక్కలోకే వెళ్తున్నాయి. కరోనా సోకినా.. ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోతున్నవారిని కరోనా లిస్ట్ లో కలపడంలేదు. టెస్ట్ చేయించుకోకపోయినా, టెస్ట్ రిజల్ట్ రాకపోయినా.. మరణానికి కరోనా కారణం కాదని అనేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటానికి ఇదే కారణం. గుజరాత్ రాష్ట్రంలో బయటపడిన కఠోర వాస్తవాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కళ్లకు కడుతున్నాయి.
కంప్యూటరీకరణ అందుబాటులోకి వచ్చాక, జనన, మరణాలపై అధికారిక లెక్కలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా ప్రతిమరణం రిజిస్టర్ అవుతోంది. ఇలా గుజరాత్ లో ఈ ఏడాది మార్చి 1నుంచి మే 10 మధ్య కాలంలో అంటే 71రోజుల వ్యవధిలో రిజిస్టర్ అయిన మరణాల సంఖ్య 1.23 లక్షలు. అయితే అధికారిక లెక్కల ప్రకారం కొవిడ్ వల్ల చనిపోయిన వారి సంఖ్య కేవలం 4,200. ఈ రెండు లెక్కల మధ్య ఏమాత్రం పోలిక లేదు. మరి మిగతావారంతా ఎందుకు చనిపోయారు? ఎలా చనిపోయారు? కరోనావల్ల చనిపోయారని రుజువులు లేవు కాబట్టి.. వారివన్నీ సహజమరణాల కోటాలో కలిసిపోతున్నాయి. లేదా మరో ఇతర అనారోగ్యాన్ని జతచేస్తూ డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు డాక్టర్లు.
2021లో 71రోజలు వ్యవధిలో గుజరాత్ లో అధికారిక మరణాలు 1.23 లక్షలు కాగా.. 2020లో ఇదే కాలంలో కేవలం 58వేలమంది మాత్రమే చనిపోయారు. గతేడాది కూడా అదే సమయంలో కరోనా ఉధృతంగా ఉంది. మరి దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా ఈ ఏడాది మరణాల సంఖ్య ఉండటం దేనికి సంకేతం. వాస్తవానికి గుజరాత్ జనాభా ప్రకారం సగటు లెక్కలు తీస్తే.. 2015-18 మధ్య కాలంలో మార్చి1నుంచి మే 10మధ్య చనిపోయినవారి సంఖ్య 82,500. అంటే సగటు మరణాలకంటే ఈ ఏడాది మరణాల శాతం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి వీటన్నిటినీ లెక్కలోనుంచి తీసివేయడం వల్ల ఏం జరుగుతోంది..? అసలు లెక్కలు లేకుండా కాకి లెక్కలు ప్రచారంలోకి వస్తున్నాయి. కరోనా మరణాల సంఖ్య పెద్దగా లేదని అధికారులు సర్దిచెప్పుకుంటున్నారు.
ఇది కేవలం గుజరాత్ సమస్య మాత్రమే కాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా కరోనా మరణాల లెక్కల్లో తేడాలు భారీగా ఉంటున్నాయి. దాదాపుగా దేశ జనాభాలో ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన వారిని ఎవరో ఒకర్ని కరోనా వల్ల కోల్పోయారు. ఈ మరణాలన్నీ కరోనా లెక్కల్లో ఉన్నాయా లేదా అనేది మాత్రం అనుమానమే. గుజరాత్ లో అధికారిక లెక్కలు 1.23 లక్షలే అయినా, అసలు మరణాలు అంతకంటే ఎక్కువే అని అంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా మరణాల్లో ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.