బీజేపీకి కొత్త చిక్కు.. రాజ్యసభలో ఆ పార్టీకి మెజార్టీ ఇప్పట్లో కష్టమే..!
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీ ఏ రాజకీయపార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగానే దూసుకుపోతున్నది. కానీ ఆ పార్టీకి మొదటి నుంచి రాజ్యసభలో ఆశించిన స్థాయిలో బలం లేదు. అందుకు కారణం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉండటమే. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో భవిష్యత్ లో కూడా బీజేపీకి రాజ్యసభలో బలం కష్టమేనని అనిపిస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళలో బీజేపీ ఓడిపోయింది. అయితే నిజానికి బెంగాల్లో బీజేపీకి గతంలో కంటే […]
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీ ఏ రాజకీయపార్టీ మద్దతు లేకుండా స్వతంత్రంగానే దూసుకుపోతున్నది. కానీ ఆ పార్టీకి మొదటి నుంచి రాజ్యసభలో ఆశించిన స్థాయిలో బలం లేదు. అందుకు కారణం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉండటమే.
అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో భవిష్యత్ లో కూడా బీజేపీకి రాజ్యసభలో బలం కష్టమేనని అనిపిస్తున్నది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళలో బీజేపీ ఓడిపోయింది. అయితే నిజానికి బెంగాల్లో బీజేపీకి గతంలో కంటే బలం పెరిగింది. ఎమ్మెల్యేలు పెరిగారు. అయితే ప్రస్తుతం బీజేపీ యూపీలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఆ మాటకొస్తే.. దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏమంత బాగాలేదు.
కరోనా సెకండ్‌వేవ్ నివారణలో మోదీ విఫలం అయ్యారన్న విమర్శలతో ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ప్రధాని నరేంద్రమోదీ.. ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడంపైనే దృష్టి సారించారని విమర్శలు వచ్చాయి.
అంతర్జాతీయ మీడియా సైతం మోదీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తిట్టిపోశాయి. లాన్సెట్ జర్నల్, టైమ్స్, గార్డియన్ లాంటి అంతర్జాతీయ పత్రికలు మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ కథనాలు ప్రచురించాయి.
మరోవైపు సోషల్ మీడియాలో సైతం మోదీకి ఎదురుగాలి వీచింది. దీంతో ఆ పార్టీ వ్యతిరేకతను డిఫెన్స్ చేసుకోలేక ఆపసోపాలు పడుతున్నది. ఇక రాజ్యసభలో మెజార్టీ సాధించడం బీజేపీకి ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.. మొత్తం 245 స్థానాలున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 93 మంది సభ్యుల బలముంది. రాజ్యసభలో బలం పెరగాలంటే రాష్ట్రాల్లో అధికారం ఉండటం ఎంతో కీలకం. కొందరు బీజేపీ సభ్యుల పదవీ కాలం కూడా త్వరలో ముగియబోతున్నది.
ప్రస్తుతం టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు బీజేపీలో చేరారు. వారి పదవీకాలం త్వరలో ముగియనున్నది. ఇక వారిస్థానంలో వైసీపీ సభ్యులు వచ్చే అవకాశం ఉంది. 2022లో రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయబోతున్నారు. ఏప్రిల్‌లో 18 మంది, జూన్‌లో 20 మంది, జూలైలో 33 మంది చొప్పున రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. అక్కడ రాజ్యసభ ఎన్నికలు జరిగితే బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు. ఇక త్వరలో ఎన్నికలు జరగబోతున్న యూపీలో సైతం బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.
మరోవైపు పంజాబ్‌లో సైతం బీజేపీ అధికారం చేపట్టే అవకాశం లేదు. అందుకు కారణం కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత రావడమే. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి రాజ్యసభలో బలం పెరగడం చాలా కష్టమని విశ్లేషకులు అంటున్నారు.