Telugu Global
National

డోసు డోసుకీ టీకా మార్చొచ్చా.. ?

తొలి డోసు కోవాక్సిన్ తీసుకుంటే, రెండో డోసు కూడా అదే తీసుకోవాలి. ముందు కోవిషీల్డ్ తీసుకుంటే రెండో సారి కూడా అదే వేయించుకోవాలి. ఇప్పటి వరకూ మనకు తెలిసింది ఇదే.. అయితే కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ డోసులు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో కోవాక్సిన్ వేసుకున్నవారికి ఎదురు చూపులు తప్పేలా లేవు. అందులోనూ నెలరోజుల గ్యాప్ పూర్తయ్యేలోపు కోవాక్సిన్ రెండోడోసు కచ్చితంగా వేయించుకోవాలి, లేకపోతే ప్రభావం తక్కువగా ఉంటుందనే ప్రచారమూ ఉంది. కోవిషీల్డ్ విషయంలో దాదాపు నాలుగున్నర […]

డోసు డోసుకీ టీకా మార్చొచ్చా.. ?
X

తొలి డోసు కోవాక్సిన్ తీసుకుంటే, రెండో డోసు కూడా అదే తీసుకోవాలి. ముందు కోవిషీల్డ్ తీసుకుంటే రెండో సారి కూడా అదే వేయించుకోవాలి. ఇప్పటి వరకూ మనకు తెలిసింది ఇదే.. అయితే కోవిషీల్డ్ కంటే కోవాక్సిన్ డోసులు తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో కోవాక్సిన్ వేసుకున్నవారికి ఎదురు చూపులు తప్పేలా లేవు. అందులోనూ నెలరోజుల గ్యాప్ పూర్తయ్యేలోపు కోవాక్సిన్ రెండోడోసు కచ్చితంగా వేయించుకోవాలి, లేకపోతే ప్రభావం తక్కువగా ఉంటుందనే ప్రచారమూ ఉంది. కోవిషీల్డ్ విషయంలో దాదాపు నాలుగున్నర నెలల గ్యాప్ కూడా ఆమోదయోగ్యం అంటున్నారు. మరి ఇప్పుడేం చేయాలి? మొదటిసారి ఓ కంపెనీ టీకా వేసుకుని, రెండోసారి అందుబాటులో ఉన్న మరో కంపెనీ టీకా వేసుకుంటే ప్రమాదమా..? ఇదే విషయంపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి.

రేపో మాపో స్పుత్నిక్ తో పాటు మరికొన్ని టీకాలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలా టీకాల పేర్లు గుర్తుపెట్టుకునే అవగాహన ప్రజలకు ఉండదు. సెల్ ఫోన్ మెసేజ్ లు ఎంతమందికి అందుబాటులో ఉంటాయనేది కూడా అనుమానమే. రశీదులిచ్చినా నెలల తరబడి దాచిపెట్టుకోగలరా అని కూడా ఆలోచించాలి. ఈ దశలో టీకా మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. ఈ విషయంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్‌-19 బృందం నిర్ణయించింది. ‘ఒకే వ్యక్తికి రెండు రకాల టీకాలు వేసే అంశంపై పరిశోధన ప్రారంభించబోతున్నాం. మరికొన్ని కొత్త టీకాలు రాగానే ఈ పని చేపడతాం’ అని కోవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూపు అధిపతి ఎన్.కె. అరోరా తెలిపారు. రెండు డోసుల్లో రెండు రకాల టీకాలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది నిర్థారించడమే ఈ పరిశీలన లక్ష్యమని వివరించారు. ‘జూలై నాటికి స్పుత్నిక్‌-వి టీకా లభ్యత మనదేశంలో బాగా పెరుగుతుంది, అప్పుడు ఈ టీకాను జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చుతాం’ అని అరోరా తెలిపారు. జైడస్‌ క్యాడిలా, నొవావ్యాక్స్, జెన్నోవా బయోఫార్మాసుటికల్స్‌ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.

స్పెయిన్‌ లో ఇప్పటికే నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మొదటి డోసు ఫైజర్‌ టీకా వేసుకుని, రెండో డోసు ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్నప్పటికీ ఎటువంటి ముప్పు లేదని, పైగా బాగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. బ్రిటన్, కెనడాల్లోనూ ఇటువంటి అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇప్పుడిక భారత్ లో కూడా ఇలా డోసుల మిక్సింగ్ కి అవకాశం ఉందో లేదో తేల్చుతామంటున్నారు అధికారులు. అయితే కోవిషీల్డ్, కోవాక్సిన్ పూర్తిగా విభిన్న పరిశోధనల ద్వారా తయారయ్యాయి కాబట్టి.. సరైన పరిశోధనలు జరిగి, మెరుగైన ఫలితాలు లేకపోయినా, కనీసం దష్పరిణామాలు లేవని నిర్థారించుకున్న తర్వాతే భారత్ లో ఈ ప్రయోగం చేపడితే బాగుంటుందని మరికొందరు అంటున్నారు.

First Published:  23 May 2021 8:32 AM GMT
Next Story