Telugu Global
National

భారత్ తర్వాత, నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?

అక్కడే పుట్టిపెరిగింది కాబట్టి సహజంగానే కరోనా తొలి టార్గెట్ చైనా అయింది. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్.. కరోనా ధాటికి విలవిల్లాడాయి. తొలి దశను భారత్ తప్పించుకోగలిగినా, సెకండ్ వేవ్ మాత్రం బాగా ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించేంతలా.. ఇక్కడ వైరస్ విజృంభించింది. కరోనా కొత్త వేరియంట్ కి, ఏకంగా భారత్ వేరియంట్ అనే పేరుతో ప్రచారం జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే భారత్ […]

భారత్ తర్వాత, నెక్స్ట్ టార్గెట్ ఎవరు..?
X

అక్కడే పుట్టిపెరిగింది కాబట్టి సహజంగానే కరోనా తొలి టార్గెట్ చైనా అయింది. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్.. కరోనా ధాటికి విలవిల్లాడాయి. తొలి దశను భారత్ తప్పించుకోగలిగినా, సెకండ్ వేవ్ మాత్రం బాగా ఇబ్బంది పెడుతోంది. దాదాపుగా అంతర్జాతీయ సమాజం మొత్తం భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించేంతలా.. ఇక్కడ వైరస్ విజృంభించింది. కరోనా కొత్త వేరియంట్ కి, ఏకంగా భారత్ వేరియంట్ అనే పేరుతో ప్రచారం జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే భారత్ లో క‌రోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారి కేసులు 4 లక్షలనుంచి 3లక్షలకు తగ్గాయి. మరణాల సంఖ్య కలవరపెడుతున్నా.. నెలాఖరునాటికి కేసుల సంఖ్య బాగా తగ్గుతుందని, జూన్ నాటికల్లా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా కనుమరుగై, రాష్ట్రాలు కర్ఫ్యూలను ఎత్తివేస్తాయనే ప్రచారం జరుగుతోంది. భారత్ సంగతి సరే.. మరి మిగతా దేశాల సంగతేంటనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఇప్పటికే బ్రిటన్ లో కూడా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. అయితే అక్కడ మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండటం.. దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తి కావడం, కొత్త వేరియంట్ లను కూడా వ్యాక్సిన్లు సమర్థంగా అడ్డుకోగలగడంతో.. భారత్ లాంటి దారుణ పరిస్థితులు అక్కడ కనిపించట్లేదు. అయితే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం.. అల్ప, మధ్య ఆదాయ దేశాలకు ఓ హెచ్చరికలాంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆర్థిక వేత్తలు హెచ్చరించారు. కరోనా ఫస్ట్ వేవ్ ని సమర్థంగా ఎదుర్కొన్న భారత్, సెకండ్ వేవ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, కరోనా కేసుల్లేవనే కారణంగా మిగతా దేశాలు అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి ప్రకోపానికి గురికాని దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బ్రెజిల్‌ లో కనిపించిన ఉపద్రవం, భారత్‌ లో ప్ర‌స్తుతం కనిపిస్తోన్న విలయం.. మున్ముందు మిగిలిన అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో కూడా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఆర్థిక వేత్తల నివేదిక హెచ్చరిస్తోంది. ‘ఇప్పటి వరకు కరోనా ఉప్పెనను చవిచూడని ఆఫ్రికాతో సహా, అల్ప, మధ్యాదాయ దేశాలకు భారత్‌ లోని కరోనా పరిస్థితులు ఒక హెచ్చరిక’ అంటూ అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తే ముప్పుని అడ్డుకోవచ్చని సూచించింది. అదే సమయంలో కరోనా లేదు, రాదు అనే ఆలోచనలే దరికి రానీయకూడదని, కరోనా మన పక్కనే ఉంది అనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని సూచించింది. అల్ప ఆదాయ దేశాలలో వ్యాక్సినేషన్ ఇంకా ఊపందుకోలేదు. కొన్ని ఆఫ్రికా దేశాలకు అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అలాంటి దేశాలపై థర్డ్ వేవ్ ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ రూపంలో భారత్ ని వణికించిన కరోనా వేరియంట్.. తర్వాత ఏ దేశాన్ని, ఏ రూపంలో చుట్టుముడుతుందోననే ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.

First Published:  23 May 2021 12:47 PM IST
Next Story