ఆయుర్వేద మందు పంపిణీ తిరిగి ప్రారంభం అవుతుందా..?
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఇస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం తిరిగి మొదలైన ఈ మందు పంపిణీ గంటల వ్యవధిలోనే అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి రావడం, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండటంతో అధికారులు మందు పంపిణీని ఆపివేశారు. దీంతో చాలామంది అక్కడినుంచి వెనుదిరిగారు, మరికొందరు మందు పంపిణీ చేసే వరకు కదలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. […]
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనా నివారణకు ఇస్తున్న ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం తిరిగి మొదలైన ఈ మందు పంపిణీ గంటల వ్యవధిలోనే అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి రావడం, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండటంతో అధికారులు మందు పంపిణీని ఆపివేశారు. దీంతో చాలామంది అక్కడినుంచి వెనుదిరిగారు, మరికొందరు మందు పంపిణీ చేసే వరకు కదలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో మందు పంపిణీ తిరిగి ఎప్పుడు మొదలవుతుందనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరోవైపు ఆయుష్ బృందం, ఐసీఎంఆర్ నిపుణులు కరోనా ఆయుర్వేద మందు ప్రభావాన్ని తేల్చే పనిలో పడ్డారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెబుతున్నా.. దాని సమర్థత నిర్థారించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతానికి ప్రత్యక్ష సాక్షులు, మందుని వాడిన బాధితుల దగ్గర వివరాలు సేకరించారు. బాధితులు, వారి బంధువులు పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. మందు పంపిణీ చేసే విషయంలో జరిగిన గందరగోళమే ఏకైక ప్రతిబంధకంగా మారింది. వేలాదిమంది కృష్ణపట్నం గ్రామానికి రావడం, సామాజిక దూరం లేకుండా మందుకోసం ఎగబడటం లేనిపోని కొత్త సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అటు కరోనా రోగులంతా అంబులెన్సుల్లో తమ గ్రామానికి రావడంతో కృష్ణపట్నం స్థానికులు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా రోగుల్ని తమ ఊరికి రాకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు ఆయుర్వేద మందు తయారు చేస్తున్న ఆనందయ్యను పోలీసులు కృష్ణపట్నం నుంచి నెల్లూరుకి తరలించారు. ప్రస్తుతానికి మందు తయారు చేయడానికి కృష్ణపట్నంలో ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు, దానికి సంబంధించిన పదార్థాలు సేకరించేందుకు ఒకటి రెండురోజుల సమయం పడుతుందని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి చెబుతున్నారు. వీలైతే.. అన్ని ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి మందు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆన్ లైన్ సేవలను వినియోగించుకుని, కొరియర్ ద్వారా నేరుగా బాధితుల ఇళ్లకే మందు పంపిస్తామని, దూరప్రాంతాల వారు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం పంపించిన ఆయుర్వేద వైద్య నిపుణుల బృందం మరో మూడు రోజులపాటు నెల్లూరు జిల్లాలో మకాం వేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుష్ డిపార్ట్ మెంట్ నిపుణులు కృష్ణపట్నం మందు సమర్థత నిర్థారించేందుకు అక్కడికి వెళ్లారని, మందు వాడకంపై స్థానికంగా పూర్తి సానుకూలత ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రజలు ఈ మందుని నమ్ముతున్నా.. సైంటిఫిక్ గా రుజువు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడలో ఉన్న ఆయుర్వేద విభాగం ప్రాంతీయ అధికారులు కొందరు సోమవారం కృష్ణపట్నం వెళ్లి శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన జరుపుతారని ఆయన చెప్పారు. ఆ తరువాతే ఈ మందు ఫలితాలపై అవగాహన వస్తుందని అన్నారు. అటు ఐసీఎంఆర్ పరిశోధన కూడా పూర్తయిన తర్వతా ఈ మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే వేలాదిమంది ఒకేచోట గుమికూడే విధానానికి స్వస్తి పలికి ప్రత్యామ్నాయ మార్గాలు అణ్వేషించే అవకాశం ఉంది.