Telugu Global
NEWS

కేసులు తగ్గుతున్న వేళ.. స్పీడ్ పెంచిన కేసీఆర్..

అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతి మే నెలాఖరుకు చల్లబడుతుందనే నిపుణుల అంచనాలు కూడా నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ దశలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత స్పీడందుతున్నారు. వరుస సమీక్షలతో బిజీబిజీగా ఉన్న కేసీఆర్, ఇటీవల సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పర్యటనకు మంచి స్పందన రావడంతో, వరంగల్ ఎంజీఎంని కూడా సందర్శించి ప్రతిపక్షాలకు షాకిచ్చారు. కరోనా నివారణ చర్యల్లో తెలంగాణ ఇప్పటి వరకూ వెనకపడిఉందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు […]

కేసులు తగ్గుతున్న వేళ.. స్పీడ్ పెంచిన కేసీఆర్..
X

అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. సెకండ్ వేవ్ ఉధృతి మే నెలాఖరుకు చల్లబడుతుందనే నిపుణుల అంచనాలు కూడా నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ దశలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత స్పీడందుతున్నారు. వరుస సమీక్షలతో బిజీబిజీగా ఉన్న కేసీఆర్, ఇటీవల సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి పర్యటనకు మంచి స్పందన రావడంతో, వరంగల్ ఎంజీఎంని కూడా సందర్శించి ప్రతిపక్షాలకు షాకిచ్చారు.

కరోనా నివారణ చర్యల్లో తెలంగాణ ఇప్పటి వరకూ వెనకపడిఉందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కేసులు పెరుగుతున్న వేళ, వ్యూహాత్మకంగా వైద్య, ఆరోగ్య మంత్రి ఈటలకు ఉద్వాసన పలికిన కేసీఆర్, ఆ శాఖను తానే తీసుకుని పని మొదలు పెట్టారు. ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి రోజూ సమీక్ష జరుపుతూ, తనయుడు కేటీఆర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో కరోనా పరిస్థితులు ఈటలకు ముందు, ఈటల తర్వాత అన్నట్టుగా మార్చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తుంటే.. దాన్ని అడ్డుకుని రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు అదే కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రతిపక్ష నేతలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్న కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్ అమలుతో బీజేపీని కూల్ చేశారు. ఆరోగ్యశ్రీ జాబితాలో కరోనాను చేర్చాలనే డిమాండ్ ని పక్కనపెట్టి, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నామని చెప్పారు.

గాంధీ, ఎంజీఎం.. సందర్శనతో మైలేజీ..
గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ వార్డు సందర్శనతో కేసీఆర్ కరోనా డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టారు. టీఆర్ఎస్ అనుకూల మీడియాతోపాటు, సోషల్ మీడియా అంతా ఇదే విషయాన్ని హైలెట్ చేసింది. కేసీఆర్ ధైర్యాన్ని మెచ్చుకుంది. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించి ప్రతి రోగితో ప్రత్యేకంగా మాట్లాడి మరింతగా హైలెట్ అయ్యారు కేసీఆర్. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వరుస సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో బిజీ అయ్యారు. పరామర్శలకు గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్, కరోనా వచ్చినప్పుడు చికిత్సకోసం యశోద ఆస్పత్రికి ఎందుకెళ్లారంటూ వైఎస్ షర్మిల వంటి నేతలు లాజిక్ తీస్తున్నా.. కేసీఆర్ మేనియా ముందు అవేవీ పనిచేయడంలేదు.

ఒకప్పుడు లాక్ డౌన్ కి పూర్తి వ్యతిరేకంగా అని చెప్పిన కేసీఆరే, ఆ తర్వాత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయడంతోపాటు.. ఇప్పుడు మరింత కఠినంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉదయం 10గంటల 10నిముషాల తర్వాత ఎవరూ రోడ్లపై కనిపించకూడదని ఆదేశించారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వారితో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని, దానిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని కోరారు. ఇంటింటి ఫీవర్ సర్వేను మరో దఫా చేపట్టాలన్నారు.

కేసీఆర్ చర్యలతో కేసులు తగ్గాయా, కేసులు తగ్గే సమయంలో కేసీఆర్ దూకుడు పెంచారా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఈటల వ్యవహారాన్ని విజయవంతంగా తొక్కిపెట్టి, కరోనా వేళ తన మైలేజీ మరింత పెంచుకుంటున్నారు.

First Published:  21 May 2021 10:15 PM GMT
Next Story