Telugu Global
Health & Life Style

బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ వైట్ ఫంగస్..

కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుందన్న వార్తలు మొదట్లో నమ్మశక్యంగా లేకపోయినా.. తర్వాత రోజుల్లో బాధితులు ఆస్పత్రులకు క్యూ కట్టడం, తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ బారినపడ్డవారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో జనంలో అప్రమత్తత మొదలైంది. కరోనానుంచి కోలుకునే క్రమంలో వాడే స్టెరాయిడ్లు, అప్పటికే షుగర్ వ్యాధి తీవ్రంగా ఉండటం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వంటి కారణాలతో బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుందని తేలింది. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజల్ని బ్లాక్ ఫంగస్ […]

బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ వైట్ ఫంగస్..
X

కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుందన్న వార్తలు మొదట్లో నమ్మశక్యంగా లేకపోయినా.. తర్వాత రోజుల్లో బాధితులు ఆస్పత్రులకు క్యూ కట్టడం, తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ బారినపడ్డవారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో జనంలో అప్రమత్తత మొదలైంది. కరోనానుంచి కోలుకునే క్రమంలో వాడే స్టెరాయిడ్లు, అప్పటికే షుగర్ వ్యాధి తీవ్రంగా ఉండటం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వంటి కారణాలతో బ్లాక్ ఫంగస్ దాడి చేస్తుందని తేలింది. దేశంలోని పలు రాష్ట్రాల ప్రజల్ని బ్లాక్ ఫంగస్ భయాలు వెంటాడుతున్న వేళ, తాజాగా బీహార్ లో వైట్ ఫంగస్ కలకలం రేగింది. పాట్నాలో నలుగురు రోగులు వైట్ ఫంగస్ బారిన పడ్డారు. అయితే వీరెవరికీ కరోనా పాజిటివ్ రాలేదని, కేవలం కరోనా లక్షణాలతో మాత్రమే ఉన్నారని అంటున్నారు వైద్యులు.

పాట్నా మెడికల్‌ కాలేజీ మైక్రోబయాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్.. ఈ వైట్ ఫంగస్ వ్యవహారాన్ని బయటపెట్టారు. వైట్ ఫంగస్ బారిన పడినవారికి సాధారణ యాంటీ ఫంగల్ ఔషధాలు ఇస్తున్నట్టు తెలిపారాయన. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారని, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

లక్షణాలు..
కరోనా సోకినప్పుడు కనిపించే లక్షణాలే వైట్ ఫంగస్ సోకినప్పుడు కూడా బయటపడుతున్నాయని వైద్యులు తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, శ్వాస ఇబ్బందులు వైట్ ఫంగస్ బాధితుల్లో ఉంటాయి. అయితే కరోనా లక్షణాలకంటే చాలా తీవ్రంగా ఇవి కనిపిస్తాయి. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తుందని, హెచ్ఆర్సీటీ అనే పరీక్ష ద్వారా దీన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.

ప్రభావం..
బ్లాక్ ఫంగస్.. కన్ను, ముక్కు వంటి భాగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తే.. వైట్ ఫంగస్.. నేరుగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని వెళ్లడిస్తున్నారు వైద్యులు. ఊపిరితిత్తులతోపాటు కిడ్నీ, మెదడు, జీర్ణకోశం, జననేంద్రియాలు, నోటిలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. చర్మం, గోళ్లపై కూడా వైట్ ఫంగస్ ప్రభావం కనిపిస్తుంది.

శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఎక్కువగా వ్యాధులు సోకుతుంటాయి, వారిపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కరోనా అయినా దాని కొనసాగింపుగా వచ్చిన బ్లాక్ ఫంగస్ అయినా కూడా ఇదే నియమం. కొత్తగా బయటపడుతున్న వైట్ ఫంగస్ విషయంలో కూడా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే దీని బారిన పడుతున్నారని తేలింది. షుగర్ వ్యాధి తీవ్రంగా ఉన్నవారు, కరోనా నివారణకోసం, లేదా ఇతర కారణాల వల్ల స్టెరాయిడ్లు ఎక్కువగా వాడినవారికి వైట్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి పాట్నా మెడికల్ కాలేజీ మాత్రమే వైట్ ఫంగస్ వ్యవహారాన్ని ధృవీకరించగా మిగతా చోట్ల ఎక్కడా వైట్ ఫంగస్ కేసులు బయటపడలేదు.

First Published:  20 May 2021 8:05 PM GMT
Next Story