Telugu Global
Business

వాట్సప్ కి కేంద్రం వార్నింగ్..

ప్రైవసీ పాలసీ 2021 విషయంలో వాట్సప్ వెనక్కి తగ్గకపోయే సరికి కేంద్రం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. యూరోపియన్లకు ఒకన్యాయం, ఇండియన్లకు మరో న్యాయమా అంటూ నిలదీసింది. ఈమేరకు మరోసారి కేంద్ర ఐటీ శాఖ వాట్సప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. అసలేంటి వివాదం..? ఫేస్ బుక్ తో కలసిపోయిన వాట్సప్.. తన వినియోగదారుల సమాచారాన్ని మాతృసంస్థ ఫేస్ బుక్ తో పంచుకోడానికి సిద్ధపడింది. అయితే ఈ వ్యవహారం బయటపడే సరికి, వాట్సప్ వినియోగదారుల అనుమతి మేరకేనంటూ కొత్త […]

వాట్సప్ కి కేంద్రం వార్నింగ్..
X

ప్రైవసీ పాలసీ 2021 విషయంలో వాట్సప్ వెనక్కి తగ్గకపోయే సరికి కేంద్రం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. యూరోపియన్లకు ఒకన్యాయం, ఇండియన్లకు మరో న్యాయమా అంటూ నిలదీసింది. ఈమేరకు మరోసారి కేంద్ర ఐటీ శాఖ వాట్సప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.

అసలేంటి వివాదం..?
ఫేస్ బుక్ తో కలసిపోయిన వాట్సప్.. తన వినియోగదారుల సమాచారాన్ని మాతృసంస్థ ఫేస్ బుక్ తో పంచుకోడానికి సిద్ధపడింది. అయితే ఈ వ్యవహారం బయటపడే సరికి, వాట్సప్ వినియోగదారుల అనుమతి మేరకేనంటూ కొత్త నాటకానికి తెరతీసింది. వారి అంగీకారం కోసం మెసేజ్ లు పంపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి-8ని డెడ్ లైన్ గా విధించింది. చాలామంది ఈ విధానాన్ని వ్యతిరేకించారు. కేంద్రం కూడా దీన్ని తప్పుబట్టింది. సమాచార విధానంలోని విలువలను, డేటా సెక్యూరిటీని, వినియోగదారుల ఎంపిక స్వేచ్ఛను దెబ్బతీసేలా ఈ నూతన పాలసీ ఉందని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. భారతదేశంలో అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలను లెక్కచేయకుండా కొత్త ప్రైవసీ పాలసీ ఎలా తీసుకొచ్చారని నిలదీసింది. ఈ క్రమంలో మే-15 వరకు నూతన పాలసీని వాయిదా వేస్తూ వాట్సప్ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది.

తీరా గడువు పూర్తి కావడంతో ఇప్పుడు వినియోగదారులకు కొత్తగా ప్రైవసీ పాలసీకి ఒప్పుకోవాలంటూ మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టింది. కొంతమంది దీనిని అంగీకరించారు కూడా. దీనిపై తాజాగా స్పందించిన కేంద్రం మరోసారి వాట్సప్ యాజమాన్యానికి నోటీసులు పంపించింది. ఈ నోటీసుపై ఏడు రోజుల్లోగా స్పందించాలని, సంతృప్తికరమైన సమాధానం రాకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దేశ పౌరుల హక్కులను, ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, భారత చట్టాల ప్రకారం వాట్సప్‌ పై చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. ప్రైవసీ విధానం విషయంలో యూరప్‌ వినియోగదారులు, భారతీయ వినియోగదారుల మధ్య వివక్ష చూపడం సరికాదని కేంద్రం హెచ్చరించింది.

అయితే వాట్సప్ ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఇప్పటికే చాలామంది కొత్త విధానానికి అనుమతి తెలియజేశారని, మిగిలినవారి అకౌంట్లను తాము తొలగించలేదని స్పష్టం చేశారు. అయితే ఇదే విషయంపై కొన్ని రోజులపాటు రిమైండర్లు పంపిస్తామని తెలిపారు. వాట్సప్ యూజర్లు సమ్మతి తెలియజేయకపోతే రాబోయే రోజుల్లో వారికి అన్ని ఫీచర్లు అందుబాటులో ఉండవని తెలుస్తోంది. వీడియో కాల్స్ తో మొదలు పెట్టి, వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని తొలగిస్తారు, ఆ తర్వాత క్రమేపీ చాట్ లిస్ట్ కూడా కనిపించకుండా పోతుంది, వాట్సప్ అకౌంట్ డిలీట్ అవుతుంది. ఈలోగా కేంద్రం ఇచ్చిన నోటీసులకు వాట్సప్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చుడాలి.

First Published:  19 May 2021 9:53 PM
Next Story