Telugu Global
Health & Life Style

ఏపీలో ఇక ప్లాస్మా థెరపీ లేనట్టే..

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీని భాగం చేయొద్దని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలిచ్చారు. జిల్లా అధికారులెవరూ ప్లాస్మా థెరపీని ప్రోత్సహించొద్దని ఆయన స్పష్టం చేశారు. కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌ లో ప్లాస్మా థెరపీని తొలగించారని ఆయన చెప్పారు. గత కొద్దికాలంగా కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఏపీలో ఆ విధానానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో కొన్ని […]

ఏపీలో ఇక ప్లాస్మా థెరపీ లేనట్టే..
X

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీని భాగం చేయొద్దని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలిచ్చారు. జిల్లా అధికారులెవరూ ప్లాస్మా థెరపీని ప్రోత్సహించొద్దని ఆయన స్పష్టం చేశారు. కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌ లో ప్లాస్మా థెరపీని తొలగించారని ఆయన చెప్పారు. గత కొద్దికాలంగా కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఏపీలో ఆ విధానానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా నుంచి కోలుకున్నవారిలో కొన్ని నెలలపాటు కొవిడ్ వైరస్ తో పోరాడే యాంటీబాడీస్ ఉంటాయి. రక్తంలో, తద్వారా ప్లాస్మాలో కూడా ఈ యాంటీబాడీస్ ఉంటాయనే ఉద్దేశంతో కరోనా నుంచి కోలుకున్నవారి దగ్గర ప్లాస్మా సేకరించి, కరోనా రోగులకు అందించడమే ప్లాస్మా థెరపీ. కొవిడ్ ఫస్ట్ వేవ్ నేపథ్యంలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. అన్ని రకాల ప్రయోగాలు విఫలం అయితే చివరకు ప్లాస్మా థెరపీకి మొగ్గుచూపేవారు. ఆ తర్వాత అంత సీరియస్ గా లేనివారికి కూడా ప్లాస్మా ఇవ్వడం మొదలు పెట్టారు. చివరకు కొన్ని బ్లడ్ బ్యాంకులు దీన్ని ఓ బిజినెస్ గా మార్చేశాయి.

ప్లాస్మా థెరపీతో కరోనా మరణాల రేటు తగ్గుతుందని కొంతమంది డాక్టర్లు కూడా చెప్పడంతో.. కరోనానుంచి కోలుకున్నవారంతా ప్లాస్మా దానం చేయడాన్ని అప్పట్లో ఓ బాధ్యతగా చేపట్టారు. సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై ప్రచారం చేశారు. అయితే చివరిగా, కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీతో ఎలాంటి ఉపయోగం లేదని తేలింది. బ్రిటన్, అర్జెంటీనా వంటి దేశాల్లో జరిగిన ప్రయోగాలు ప్లాస్మా థెరపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చాయి. దీంతో భారత్ లో కూడా ఈ విధానంపై తీవ్ర చర్చ జరిగింది. కొంతమంది వైద్యులు, శాస్త్రవేత్తలు.. కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీని ఆపేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

కొవిడ్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం..
వైద్యులు, నిపుణుల సలహాతో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొవిడ్ ప్రొటోకాల్ నుంచి ప్లాస్మా థెరపీని తొలగించింది. అనధికారికం (ఆఫ్ లేబుల్ ట్రీట్ మెంట్) గా కూడా ఈ విధానాన్ని వాడొద్దని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు ఏపీలో కూడా ప్లాస్మా థెరపీని నిషేధిస్తున్నట్టు తెలిపారు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఇకపై ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ ని ఉపయోగించొద్దని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారి వద్ద ప్లాస్మా సేకరించే విధానంపై కూడా నిషేధం విధించే అవకాశం ఉంది.

First Published:  19 May 2021 3:25 AM IST
Next Story