Telugu Global
NEWS

ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేటు ఆస్పత్రులు.. ఏపీ హైకోర్టు కీలక సూచన..

కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆస్పత్రులు.. రోగులు, వారి బంధువులను పీల్చి పిప్పిచేస్తున్నాయనే మాట వాస్తవం. ప్రభుత్వాలు కరోనా వైద్యానికి గరిష్ట ఫీజులు ఖరారు చేసినా.. అనధికారికంగా బాధితుల్ని పీడించి మరీ వసూళ్లకు దిగుతున్నాయి యాజమాన్యాలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని ఇతర దేశాల ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులను తమ అధీనంలోకి తీసుకుంటాయి. మన దేశంలో గోవా రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. గోవాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని ప్రజలకు […]

ప్రభుత్వ పరిధిలోకి ప్రైవేటు ఆస్పత్రులు.. ఏపీ హైకోర్టు కీలక సూచన..
X

కరోనా కష్టకాలంలో ప్రైవేటు ఆస్పత్రులు.. రోగులు, వారి బంధువులను పీల్చి పిప్పిచేస్తున్నాయనే మాట వాస్తవం. ప్రభుత్వాలు కరోనా వైద్యానికి గరిష్ట ఫీజులు ఖరారు చేసినా.. అనధికారికంగా బాధితుల్ని పీడించి మరీ వసూళ్లకు దిగుతున్నాయి యాజమాన్యాలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని ఇతర దేశాల ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులను తమ అధీనంలోకి తీసుకుంటాయి. మన దేశంలో గోవా రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసింది. గోవాలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని ప్రజలకు కరోనా చికిత్స అందిస్తోంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలంటూ హైకోర్టు కీలక సూచన చేసింది. అలా చేస్తే, మరింత మంది బాధితులకు తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుందని, మరిన్ని ప్రైవేట్ ఆస్పత్రులను కొవిడ్ సేవలకు వినియోగించ వచ్చని పేర్కొంది. అంబులెన్సులు అధిక రుసుములను వసూలు చేయకుండా అవసరమైతే వాటిని కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలని సూచించింది. సిబ్బంది కొరతను అధిగమించడానికి నర్సింగ్‌ చివరి సంవత్సరం విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని చెప్పింది.

కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్య సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కొంతమంది దాఖలు చేసిన వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఆ అంశాన్ని పరిశీలించాలంటూ ప్రభుత్వానికి సూచించింది. రోగులు, వారి బంధువులు ఆసుపత్రుల చుట్టూ తిరిగే ఇబ్బందిని అధిగమించడానికి ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్ల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేసేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్య స్థితిపై ప్రతిరోజూ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని చెప్పింది. కరోనా కట్టడిపై పూర్తి వివరాలు తమ ముందుంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

కర్ఫ్యూతో ఫలితం ఉందా..?
రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ ఎంతవరకు ఫలితాన్నిచ్చిందని, కర్ఫ్యూ పెట్టినా కేసుల సంఖ్య ఎందుకు తగ్గడంలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కర్ఫ్యూ కొంతమేర సత్ఫలితాలనిస్తోందని, వైరస్‌ వేగంగా వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలిగామని, నెలాఖరు వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నామని, దీనివల్ల మెరుగైన ఫలితాలుంటాయని.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకి తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్‌ ఆసుపత్రుల సంఖ్యను 650 నుంచి 680కి పెంచామని చెప్పారు. కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చాక సిబ్బంది కరోనా బారిన పడుతున్నారనే కారణంగా.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కొవిడ్ సేవలకు ముందుకు రావడంలేదని ఆయన కోర్టుకి వివరించారు.

First Published:  18 May 2021 2:09 AM IST
Next Story