Telugu Global
NEWS

మాటలనుంచి చేతల్లోకి మారిన ఈటల రాజకీయం..

హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. ఆధిపత్యపోరు మొదలైంది. నిన్నటి వరకూ మాటల తూటాలు పేలితే, ఇప్పుడు ఇరు వర్గాలు నేరుగా ఘర్షణకు దిగుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులతో తాడో పేడో తేల్చుకోడానికి రెడీ అయ్యారు ఈటల వర్గీయులు. ఆలస్యం చేస్తే అధికార పార్టీ వ్యూహాలతో హుజూరాబాద్ లో పట్టు కోల్పోతామని భావించిన ఈటల.. తన అనుచరులకు మార్గనిర్దేశనం చేశారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణుల్ని నిలువరించాలని పిలుపునిచ్చారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫైటింగ్ సీన్ జరిగింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మార్కెట్‌ […]

మాటలనుంచి చేతల్లోకి మారిన ఈటల రాజకీయం..
X

హుజూరాబాద్ రాజకీయం వేడెక్కింది. ఆధిపత్యపోరు మొదలైంది. నిన్నటి వరకూ మాటల తూటాలు పేలితే, ఇప్పుడు ఇరు వర్గాలు నేరుగా ఘర్షణకు దిగుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులతో తాడో పేడో తేల్చుకోడానికి రెడీ అయ్యారు ఈటల వర్గీయులు. ఆలస్యం చేస్తే అధికార పార్టీ వ్యూహాలతో హుజూరాబాద్ లో పట్టు కోల్పోతామని భావించిన ఈటల.. తన అనుచరులకు మార్గనిర్దేశనం చేశారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణుల్ని నిలువరించాలని పిలుపునిచ్చారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫైటింగ్ సీన్ జరిగింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మార్కెట్‌ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులు వీణవంక బస్టాండు ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. లాక్‌ డౌన్‌ అమలులో ఉండగా ఇంత మందితో సమావేశం ఎలా పెడతారంటూ ఈటల వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా పరిస్థితి సద్దుమణగపోవడంతో.. ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కి తరలించారు.

మంత్రి గంగుల కమలాకర్ హుజూరాబాద్ రాకతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారింది. ఈటల ఇలాకాలో మకాం వేసిన గంగుల టీఆర్ఎస్ శ్రేణుల్ని ఆ శిబిరంవైపు వెళ్లకుండా నిలువరిస్తున్నారు. జాతీయ పార్టీల నేతల్ని కలిసేందుకు ఈటల హైదరాబాద్ వెళ్లిన తర్వాత గంగుల, హుజూరాబాద్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. గ్రామస్థాయి నాయకులతోపాటు.. జిల్లా నేతల్ని సైతం నయానో భయానో ఒప్పించి మేమంతా టీఆర్ఎస్ తోనే ఉంటామని చెప్పిస్తున్నారు. పదే పదే ఎక్కడికక్కడ నేతలతో పరేడ్ లు పెట్టించి, ఈటల రాజీనామా చేయాలంటూ సవాళ్లు చేయిస్తున్నారు. అదే సమయంలో తమ వర్గం వారిని కాపాడుకోడానికి ఈటల కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే అధికార పార్టీని వదిలిపెట్టి ఈటలతో రావడానికి ఎక్కువమంది సుముఖంగా లేరని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎంపీపీలు, సర్పంచ్ లు, మున్సిపాల్టీ కౌన్సిలర్లు మాత్రమే ఈటలతో ఉన్నారు. టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ గట్టిగా అమలు చేస్తే వారు కూడా ఈటలతో ఉంటారో లేదో అనుమానమే.

ఈటలతో కొండా దంపతుల భేటీ
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా మురళి, సురేఖ దంపతులు కూడా ఈటల రాజేందర్ తో భేటీ కావడం విశేషం. అయితే ఈటల కాంగ్రెస్ లోకి వస్తే కొండా దంపతులు ఆయన వర్గంలో ఉంటారా, లేక ఆయన సొంత పార్టీ పెడితే.. అందులోకి వెళ్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. మరోవైపు డీఎస్ తో భేటీ తర్వాత ఈటల ఇంకా బీజేపీ కీలక నేతలెవర్నీ కలవలేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ నేతలతోనే ఆయన ఎక్కువగా టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  16 May 2021 9:45 PM GMT
Next Story