Telugu Global
National

భారత్ కు సింగిల్ డోసే దిక్కయ్యేనా..?

బ్రిటన్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ మొదలైన 3 నెలలకే 70శాతం పని పూర్తయింది. భారత్ వంటి దేశాల్లో మాత్రం పర్సంటేజీలు చెప్పేందుకే ప్రభుత్వం వెనకాడుతోంది. జనాభా సంఖ్య భారత్ లో వ్యాక్సినేషన్ కు ప్రతిబంధకంగా ఉందనేది ఎంత వాస్తవమో, టీకా లభ్యత, టీకా సంస్థలకు ఇచ్చే అనుమతుల విషయంలో ప్రభుత్వ వైఖరి వల్లే వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోందనేది కూడా అంతే వాస్తవం. ఈ దశలో కొవాక్సిన్, కొవిషీల్డ్ కి తోడుగా ఇటీవలే ‘స్పుత్నిక్-వి’ టీకా మార్కెట్లోకి వచ్చింది. […]

భారత్ కు సింగిల్ డోసే దిక్కయ్యేనా..?
X

బ్రిటన్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ మొదలైన 3 నెలలకే 70శాతం పని పూర్తయింది. భారత్ వంటి దేశాల్లో మాత్రం పర్సంటేజీలు చెప్పేందుకే ప్రభుత్వం వెనకాడుతోంది. జనాభా సంఖ్య భారత్ లో వ్యాక్సినేషన్ కు ప్రతిబంధకంగా ఉందనేది ఎంత వాస్తవమో, టీకా లభ్యత, టీకా సంస్థలకు ఇచ్చే అనుమతుల విషయంలో ప్రభుత్వ వైఖరి వల్లే వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోందనేది కూడా అంతే వాస్తవం. ఈ దశలో కొవాక్సిన్, కొవిషీల్డ్ కి తోడుగా ఇటీవలే ‘స్పుత్నిక్-వి’ టీకా మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇది కూడా రెండు డోసులు తీసుకోవాల్సిందే.

తొలి డోసుకే కష్టంగా ఉంటే..
భారత్ లో ప్రజలకు తొలిడోసు టీకా అందించడానికే ప్రభుత్వాలు కిందామీదా పడుతున్నాయి. ఉన్న టీకాలన్నీ రెండో డోసుకి ఉపయోగిస్తున్నాయి. తొలి డోసు ఇప్పుడల్లా లేదని కరాఖండిగా చెప్పేస్తున్నాయి. మరోవైపు తొలిడోసు, రెండో డోసు మధ్య వ్యవధిని పెంచుకుంటూ పోతోంది కేంద్రం. టీకాల కొరత వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తొలిడోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ లో చాలామంది వివిధ కారణాలతో రెండో డోస్ కి దూరంగా ఉన్నారనేది కూడా కఠోర వాస్తవం. ఈ దశలో ఒకే ఒక్క డోసుతో పని పూర్తయితే ఎంత సులభంగా ఉంటుంది. అందుకే సింగిల్ డోస్ టీకాలవైపు భారత్ చూస్తోంది. రష్యా తయారీ ‘స్పుత్నిక్ లైట్’, జాన్సన్ అండ్ జాన్సస్ సంస్థ తయారు చేస్తున్న ‘జాన్సెన్’ సింగిల్ డోస్ టీకాలకు త్వరలో భారత్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

‘స్పుత్నిక్ లైట్’ చివరి దశ ప్రయోగ ఫలితాలు త్వరలోనే వెల్లడి కావాల్సి ఉండగా.. జులైలో ఇది భారత్ లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రష్యాకు చెందిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్.. ‘స్పుత్నిక్ లైట్’ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. అటు, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన ‘జాన్సెన్’ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కోసం భారత్ లో తగిన భాగస్వామి కోసం ఎదురు చూస్తోంది. భారత్ లోనే ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు తగిన వనరులున్న భాగస్వామి కోసం ఈ అమెరికా సంస్థ ప్రయత్నిస్తోంది.

ఈ సమయంలో సింగిల్ డోస్ టీకా ‘స్పుత్నిక్ లైట్’ కి వెనెజులా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామం అంటున్నారు. గమలేయా ఇన్‌ స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్ లైట్’ వ్యాక్సిన్‌ కరోనాకు వ్యతిరేకంగా 79.4శాతం ప్రభావ వంతంగా పని చేస్తుందని రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) తెలిపింది. ఇప్పటికే వెనెజులా రెండు డోసుల ‘స్పుత్నిక్-వి’ ని వినియోగిస్తోంది. ఇకపై సింగిల్ డోస్ వ్యాక్సిన్లు కూడా అక్కడ అందుబాటులోకి వస్తాయి. వెనెజులా లాగే ‘స్పుత్నిక్-వి’ ని వినియోగిస్తున్న భారత్.. అదే తరహాలో సింగిల్ డోస్ ‘స్పుత్నిక్ లైట్’ టీకాకు త్వరలో అనుమతులు మంజూరు చేసే అవకాశాలున్నాయి. సింగిల్ డోస్ టీకాల వినియోగం పెరిగితే భారత్ లో వ్యాక్సినేషన్ స్పీడ్ రెట్టింపయ్యే అవకాశం ఉంది.

First Published:  16 May 2021 6:42 AM IST
Next Story