Telugu Global
Health & Life Style

మార్కెట్లోకి స్పుత్నిక్ టీకా.. ఒక్కో డోసు ధర వెయ్యి రూపాయలు..

స్పుత్నిక్-వి టీకా వచ్చేవారం మార్కెట్లోకి వస్తుందని నీతిఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యులు ప్రకటించిన మరుసటి రోజే.. ఆ టీకా జనసామాన్యంలోకి అందుబాటులోకి వచ్చేసింది. స్పుత్నిక్-వి టీకా తొలిడోసుని హైదరాబాద్ లోని తన సిబ్బందికి వేసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది డాక్టర్ రెడ్డీస్ సంస్థ. శుక్రవారం నుంచి అధికారికంగా టీకా అందుబాటులోకి వచ్చినట్టేనని ఆ సంస్థ ప్రకటించింది. స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది. దీనికి 5శాతం జీఎస్టీ కలిపితే టీకా ధర డోసుకు […]

మార్కెట్లోకి స్పుత్నిక్ టీకా.. ఒక్కో డోసు ధర వెయ్యి రూపాయలు..
X

స్పుత్నిక్-వి టీకా వచ్చేవారం మార్కెట్లోకి వస్తుందని నీతిఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యులు ప్రకటించిన మరుసటి రోజే.. ఆ టీకా జనసామాన్యంలోకి అందుబాటులోకి వచ్చేసింది. స్పుత్నిక్-వి టీకా తొలిడోసుని హైదరాబాద్ లోని తన సిబ్బందికి వేసి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది డాక్టర్ రెడ్డీస్ సంస్థ. శుక్రవారం నుంచి అధికారికంగా టీకా అందుబాటులోకి వచ్చినట్టేనని ఆ సంస్థ ప్రకటించింది. స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.948గా నిర్ణయించింది. దీనికి 5శాతం జీఎస్టీ కలిపితే టీకా ధర డోసుకు రూ.995.40 గా తేలింది. అంటే ఒక్కో డోసు ఖరీదు దాదాపు వెయ్యి రూపాయలనమాట. రెండు డోసులకి 2 వేల రూపాయలు. తొలి డోసు తీసుకున్న మూడు వారాల లోపు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.

రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి టీకాను భారత్ లో పంపిణీ చేసేందుకు అనుమతులు తీసుకున్న డాక్టర్ రెడ్డీస్ సంస్థ తొలి విడతగా 1.5లక్షల డోసుల వ్యాక్సిన్ దిగుమతి చేసుకుంది. వీటి పంపిణీకి సెంట్రల్‌ డ్రగ్స్‌ లాబోరేటరీ అనుమతించిన వెంటనే పంపిణీ మొదలు పెట్టింది. దాదాపు 10కోట్ల డోసులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. భారత్ లో స్థానికంగా టీకా ఉత్పత్తి జులై నుంచి మొదలు పెడతామని తెలిపింది. స్థానికంగా పంపిణీ పెరిగిన అనంతరం వ్యాక్సిన్‌ ధర తగ్గే అవకాశం ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌ లో డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతం భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ మాత్రమే పంపిణీ అవుతున్నాయి. వీటి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పంపిణీ ఆలస్యం అవుతోంది. ఈ దశలో స్పుత్నిక్-వి మార్కెట్లోకి రావడం, మరిన్ని విదేశీ టీకాలకు అనుమతులిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేయడం శుభపరిణామం అంటున్నారు. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ 91శాతం ప్రభావశీలత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో తేలింది.

First Published:  14 May 2021 4:51 PM IST
Next Story