Telugu Global
NEWS

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు..

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో రైల్వే అధికారులు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. ప్యాసింజర్ కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి సేవలందించారు. అప్పటికి రైళ్ల రాకపోకలు పూర్తిగా పునఃప్రారంభం కాకపోవడంతో ఎక్కడికక్కడ పెద్ద స్టేషన్లలో ఇలాంటి కోచ్ లను ఏర్పాటు చేసి కరోనా రోగులకోసం ఉపయోగించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అలాంటి వినూత్న ఆలోచనను అమలులో పెట్టారు. రాజమండ్రి డిపోకి చెందిన రెండు స్లీపర్ బస్సులను […]

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు..
X

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో రైల్వే అధికారులు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. ప్యాసింజర్ కోచ్ లను ఐసోలేషన్ వార్డులుగా మార్చి సేవలందించారు. అప్పటికి రైళ్ల రాకపోకలు పూర్తిగా పునఃప్రారంభం కాకపోవడంతో ఎక్కడికక్కడ పెద్ద స్టేషన్లలో ఇలాంటి కోచ్ లను ఏర్పాటు చేసి కరోనా రోగులకోసం ఉపయోగించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అలాంటి వినూత్న ఆలోచనను అమలులో పెట్టారు. రాజమండ్రి డిపోకి చెందిన రెండు స్లీపర్ బస్సులను ఆక్సిజన్ బెడ్లు ఉన్న మినీ ఐసీయూలుగా మార్చేశారు. బస్సుకి 6 ఆక్సిజన్ బెడ్లు చొప్పున రెండు బస్సుల్లో 12 బెడ్లు రెడీ చేసి వాటికి ‘జగనన్న ప్రాణవాయువు రథ చక్రాలు’ అని పేరు పెట్టారు.

ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రధానంగా బెడ్ల కొరత వేధిస్తోంది. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. బెడ్లు దొరక్క, ఇన్ పేషెంట్ గా చేర్చుకోక ఆస్పత్రుల ఆవరణల్లోనే ప్రాణాలు వదులుతున్న చాలామందిని చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో ఆర్టీసీ బస్సులను కరోనా వార్డులుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మినీ ఐసీయూలుగా ఉన్న వీటిని ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్ లు దొరక్క ఇబ్బంది పడేవారికి కేటాయిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు బస్సులను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఉంచారు. ఈ విధానం సక్సెస్ అయితే.. ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని అమలులోకి తెచ్చే అవకాశం ఉంది.

టీటీడీ ఆధ్వర్యంలో జర్మన్ షెడ్ల నిర్మాణం..
అటు ఆస్పత్రుల్లో బెడ్లు లేక కరోనా రోగులు పడుతున్న ఇబ్బందులపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్పందించింది. కొవిడ్ బాధితుల చికిత్స కోసం జర్మన్ షెడ్లు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. రాష్ట్రంలో రూ.3.52కోట్ల రూపాయలతో 22 షెడ్లు నిర్మించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 2, అనంతపురంలో 3, కర్నూలులో 2, కృష్ణాలో 3, గుంటూరులో 3, కాకినాడలో 3, ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ షెడ్లు నిర్మించేందుకు నేరుగా జిల్లా కలెక్టర్లకు టీటీడీ నిధులు అందిస్తోంది. ఒక్కో షెడ్‌ లో 30 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే తిరుపతి స్విమ్స్‌ పద్మావతి ఆస్పత్రి వద్ద ప్రయోగాత్మకంగా ఇలాంటి జర్మన్ షెడ్ ఏర్పాటు చేశారు.

First Published:  13 May 2021 12:16 PM IST
Next Story