కేంద్రానికి మొట్టికాయలు.. కొన్నాళ్లు వాయిదా పడినట్టేనా..?
కరోనా సెకండ్ వేవ్ ని కేంద్రం సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైందంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. దేశంలో కరోనా పరిస్థితులపై సుమోటోగా విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ లభ్యత, వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం వంటి అంశాలపై కేంద్రం నిర్లక్ష్యాన్ని నిలదీసింది. పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో కలిపి సుమోటో కేసు విచారణ […]
కరోనా సెకండ్ వేవ్ ని కేంద్రం సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైందంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. దేశంలో కరోనా పరిస్థితులపై సుమోటోగా విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ లభ్యత, వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసం వంటి అంశాలపై కేంద్రం నిర్లక్ష్యాన్ని నిలదీసింది. పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో కలిపి సుమోటో కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక ధర్మాసనం.. ఈరోజు వాదనలు వినాల్సి ఉంది. అయితే జడ్జి చంద్రచూడ్ కి కరోనా సోకడంతో విచారణ వాయిదా పడేట్టు కనిపిస్తోంది. డీవై చంద్రచూడ్ కరోనా బారిన పడ్డారని ఆయన వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్నిరోజులపాటు కేసుల విచారణలో పాల్గొనకపోవచ్చని తెలుస్తోంది. దీంతో దేశంలో కరోనా పరిస్థితులపై సుప్రీం కోర్టు సుమోటోగా చేపట్టిన కేసు విచారణ వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ప్రత్యేక ధర్మాసనం పలుమార్లు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో గత విచారణ సమయానికి కేంద్రం 218 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ విషయంలో నిపుణుల సలహాలు, శాస్త్రవేత్తల అభిప్రాయం తీసుకున్నామని కేంద్రం అఫిడవిట్ లో తేల్చి చెప్పింది. ఇలాంటి విషయాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని కూడా అఫిడవిట్ లో పేర్కొంది. ఒకవేళ కేంద్రం నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే.. మునుపెన్నడూ చూడని అనాలోచిత పరిణామాలను చూడాల్సి వస్తుందని చెప్పింది. దీంతో సుమోటో కేసు వ్యవహారం సంచలనంగా మారింది. కేంద్రం, వర్సెస్ ప్రత్యేక ధర్మాసనం అన్నట్టు మారింది పరిస్థితి.
మరోవైపు కొవిడ్ నియంత్రణలో కేంద్రం నిర్లక్ష్యాన్ని పరోక్షంగా తప్పుబడుతూ.. సుప్రీంకోర్టు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని నియమించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ ఫోర్స్ పని మొదలు పెట్టిందా, టాస్క్ పోర్స్ సభ్యులకు కేంద్రం సహకరిస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. మొత్తానికి సర్వోన్నత న్యాయస్థానం చర్యలతో కేంద్రం అసంతృప్తిగా ఉందన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సరిగ్గా అఫిడవిట్ పై స్పందించే సమయంలో జస్టిస్ చంద్రచూడ్ కి కరోనా సోకడం, సుమోటో కేసు విచారణ వాయిదా పడే అవకాశాలుండటంతో.. కేంద్రానికి చీవాట్లు తినే బాధ కూడా కొన్నాళ్లు వాయిదా పడినట్టే భావించాలి.