ఫార్మా మాఫియాతో మోదీ ప్రభుత్వం కుమ్మక్కయిందా..?
కరోనా తొలిదశలో దాని పుట్టుకకు కారణమైన చైనా సహా, బ్రిటన్, బ్రెజిల్, అమెరికా.. అన్ని అగ్రదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రెండోదశ వచ్చేనాటికి భారత్ ఒక్కటే ఎక్కువగా కరోనాకి టార్గెట్ అయింది. కారణం ఏంటి? వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. కేవలం రెండు కంపెనీలకు మాత్రమే వ్యాక్సిన్ తయారీకి అనుమతులిచ్చి దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం. సకాలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయి ఉంటే భారత్ లో కరోనా విలయం ఈ స్థాయిలో ఉండేది […]
కరోనా తొలిదశలో దాని పుట్టుకకు కారణమైన చైనా సహా, బ్రిటన్, బ్రెజిల్, అమెరికా.. అన్ని అగ్రదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రెండోదశ వచ్చేనాటికి భారత్ ఒక్కటే ఎక్కువగా కరోనాకి టార్గెట్ అయింది. కారణం ఏంటి? వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. కేవలం రెండు కంపెనీలకు మాత్రమే వ్యాక్సిన్ తయారీకి అనుమతులిచ్చి దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం. సకాలంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయి ఉంటే భారత్ లో కరోనా విలయం ఈ స్థాయిలో ఉండేది కాదనేది అన్ని వర్గాల అభిప్రాయం. అసలు జాతి ప్రయోజనాలకంటే ఆ రెండు కంపెనీల ప్రయోజనాలే మోదీ ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయా అనే ప్రశ్న ఇప్పుడు ప్రముఖంగా వినపడుతోంది. దేశంలో వేలాది మరణాలకు, లక్షల మంది వ్యాధి బారిన పడడానికి బాధ్యత ఎవరిది? వ్యాక్సిన్ కోసం దేశంలో రోజూకు కిలో మీటర్ల మేర ప్రజలు క్యూలో ఉంటున్నారు. దీనికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? వ్యాక్సిన్ తయారీ, సరఫరా, అనుమతి అంతా కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతోంది. దానికి తోడు జాతీయ విపత్తు సమయంలో కూడా రాష్ర్ట అధికారాలను సైతం కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకోవడం మోదీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పా? కాదా? ఈ ప్రశ్నలన్నిటికీ కేంద్రం సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది.
కొవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్, కొవిషీల్డ్ ఉత్పత్తిదారు సీరమ్ సంస్థలను అభినందించాల్సిందే, అదే సమయంలో వాటికి అత్యవసర అనుమతులు ఇచ్చి టీకాను జనసామాన్యంలోకి తీసుకు రావడం కూడా ఏమాత్రం తప్పు కాదు. కానీ దేశ జనాభాకి సరిపడా ఉత్పత్తి సామర్థ్యం ఆ రెండు కంపెనీలకు ఉందా లేదా అనేది కేంద్రం ఆలోచించకపోవడమే అతి పెద్ద తప్పు. కనీసం టీకా ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకుని, భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి అయ్యేలా చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. కానీ కేంద్రం అలా చేయలేదు. జాతి ప్రయోజనాలకంటే కేవలం ఫార్మా కంపెనీ ప్రయోజనాలే తనకు ముఖ్యం అన్నట్టు ప్రధాని మోదీ వ్యవహరించారు. దేశంలో దాదాపు 10 సంస్థలకు కరోనా వ్యాక్సిన్ తయారు చేసే సామర్థ్యం ఉన్నా కూడా కేవలం భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలకు మాత్రమే అనుమతి ఇవ్వడం, దేశీయ అవసరాలు తీరకుండా విదేశాలకు వ్యాక్సిన్ అమ్ముకోడానికి ఆ రెండు కంపెనీలకు అనుమతి ఇవ్వడం కచ్చితంగా మోదీ చేసిన తప్పే. జాతి ప్రయోజనాలకన్నా ఫార్మా కంపెనీల ప్రయోజనాలే ముఖ్యం అనుకున్నారు కాబట్టే, వాటికి వంతపాడారు, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు.
కేవలం రెండు కంపెనీలకే వ్యాక్సిన్ తయారీ అనుమతులివ్వడంతో, సకాలంలో ఉత్పత్తి జరగక వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. కొన్ని చోట్ల మొదటి డోసు టీకా వేసుకున్నవారికి గడువు దాటిపోతున్నా రెండో డోసు దొరకడంలేదు. ఇలా చేస్తే.. అసలు టీకా తీసుకున్న ప్రయోజనాలు వారికి కలుగుతాయా? దీనికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా..? మే నెలలో కేవలం 2 కోట్ల డోసులు మాత్రమే కేంద్రం రాష్ట్రాలకు కేటాయించింది. వీటితో దేశవ్యాప్తంగా రోజూ కేవలం 6.45 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందుతోంది. మరి మిగతావారి పరిస్థితి ఏంటో మోదీయే సెలవివ్వాలి. ఇదే పరిస్థితి కొనసాగితే, భారత దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందడానికి మరో 3 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే అప్పటి వరకు ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలేనా..?
ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారీకి నిధులు కేటాయించి, వ్యాక్సిన్ ఉత్పత్తిని భారీగా పెంచి ఉచితంగా ప్రజలందరికీ టీకాలు వేయిస్తుంటే.. మనదేశంలో మాత్రం అలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా కేంద్రం.. ఎన్నికలకు ప్రాధాన్యతనిచ్చింది. కుంభమేళా వంటి మత కార్యక్రమాలకు అనుమతులిచ్చి కరోనా ప్రబలడానికి కారణం అయింది. ఫార్మా మాఫియాతో చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. దేశీయ ఫార్మా కంపెనీలైన జైడస్ క్యాడిలా, హెటిరో డ్రగ్స్, విర్కో బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, బయోలాజికల్ ఇ, అరబిందో ఫార్మా వంటి కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి అనుమతులు కోరుతున్నా కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
మరోవైపు వ్యాక్సిన్ ధరల విషయంలో కూడా ఫార్మా కంపెనీలకు మేలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొవిషీల్డ్ టీకా ఒక్కో డోసు రూ.150కి కొంటుంటే, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్ సంస్థలకు రూ.600 కి అమ్మేలా సీరం సంస్థ నిర్ణయించింది. విపత్తు సాయంలో కూడా ప్రైవేటు కంపెనీలకు నిర్ణయాధికారాలివ్వడం ప్రభుత్వం తప్పే కదా..? రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఓపెన్ మార్కెట్ ధరలకే వ్యాక్సిన్ ను విక్రయిస్తామంటూ కంపెనీలు చెబుతున్నాయి. దీని వల్ల రాష్ట్రాల ఖజానాలపై పెనుభారం పడుతోంది.
వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రాలను సంప్రదించకపోవడం కూడా కేంద్రం చేసిన, చేస్తున్న తప్పే. 18నుంచి 44 ఏళ్ల లోపు వయసున్నవారికి వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం, కనీసం రాష్ట్రాలను సంప్రదించలేదు, రాష్ట్రాల వద్ద ఉన్న నిల్వల గురించి వాకబు చేయలేదు. రాష్ట్రాల వద్ద వ్యాక్సిన్ లేదని తెలిసి కూడా 18ఏళ్లు పైబడినవారికి టీకాలు వేయండని ఆదేశాలివ్వడం ఎంతవరకు కరెక్ట్. ఈ తప్పులన్నీ చేసిన కేంద్రం ఇప్పుడు ప్రజా కోర్టులో దోషిగా నిలబడింది. ఫార్మా మాఫియాతో చేతులు కలిపి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టింది.