అటా.. ఇటా.. ఈటల ప్రస్థానం ఎటు..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ వ్యూహాలు అంత తేలిగ్గా అర్థం అయ్యేలా కనిపించట్లేదు. నిన్న కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమైన ఆయన, ఈరోజు బీజేపీ ఎంపీ అరవింద్ సహా, ఆయన తండ్రి, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ తో మంతనాలు జరిపారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్.. కొంతకాలంగా ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. అరవింద్ బీజేపీ ఎంపీ కావడంతో ఆయన తండ్రి డీఎస్ ని […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ వ్యూహాలు అంత తేలిగ్గా అర్థం అయ్యేలా కనిపించట్లేదు. నిన్న కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమైన ఆయన, ఈరోజు బీజేపీ ఎంపీ అరవింద్ సహా, ఆయన తండ్రి, రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ తో మంతనాలు జరిపారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్.. కొంతకాలంగా ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. అరవింద్ బీజేపీ ఎంపీ కావడంతో ఆయన తండ్రి డీఎస్ ని కూడా ఆ పార్టీ సానుభూతి పరుడిగా భావించాల్సిందే. త్వరలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఈటల భేటీ అవుతారని తెలుస్తోంది.
భూకబ్జా ఆరోపణలు రావడంతో.. వైద్య, ఆరోగ్య మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వేసిన ఎంక్వయిరీ కమిటీలు, కేసీఆర్ పై ఈటల పేల్చిన మాటల తూటాలు.. వారి మధ్య మరింత దూరాన్ని పెంచాయి. దీంతో ఈటల కొత్త పార్టీ పెట్టడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నేతలతో ఈటల కొన్నిరోజులుగా సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. ఈటల సొంత పార్టీ పెట్టడం ఖాయమనుకుంటున్న నేపథ్యంలో రెండురోజులుగా ఆయన జాతీయ పార్టీల నేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ కి మకాం మార్చిన ఈటల.. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఆ భేటీ తర్వాత ఇరు వర్గాలనుంచి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. మరుసటి రోజే బీజేపీ శిబిరంతో మంతనాలు జరిపారు ఈటల. అయితే ఈ చర్చలు ఇక్కడితో ఆగేలా లేవు. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో కూడా ఈటల చర్చలు జరుపుతారని తెలుస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ తో ఈటల భేటీ అవుతారని అంటున్నారు.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఈటలతో టచ్ లోకి వచ్చారు. వీరంతా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నవారే. ఇక తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి.. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఈటల పలు సందర్భాల్లో మీడియాకు చెప్పారు. ప్రస్తుతం జాతీయ పార్టీల నేతలచో చర్చల్లో మునిగిపోయిన ఈటల లాభనష్టాలు బేరీజు వేసుకుని ఏ పార్టీలో చేరతారో డిసైడ్ చేసుకునేట్టు ఉన్నారు. సొంత పార్టీ పెట్టడమా లేక, కాంగ్రెస్, బీజేపీల్లో చేరడమా అనే విషయంలో ఆలోచనలో పడ్డారు.