Telugu Global
National

టీకాలొద్దు.. ఆవుపేడ చాలు..

ఆమధ్య ఆవుపేడ, ఆవు మూత్రం గురించి బీజేపీ నేతలు బాగా ప్రచారం చేసేవారు. సర్వరోగ నివారణిగా గో మూత్రాన్ని హైలెట్ చేసేవారు. గతంలో కరోనా టైమ్ లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినవారిలో చాలామంది, తర్వాతి కాలంలో కరోనాబారిన పడి ఇంటి చిట్కాలు పక్కనపెట్టి కార్పొరేట్ వైద్యం అందుకున్నారు. తాజాగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో కూడా ఆవు పేరు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది. గుజరాత్ లోని శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ […]

టీకాలొద్దు.. ఆవుపేడ చాలు..
X

ఆమధ్య ఆవుపేడ, ఆవు మూత్రం గురించి బీజేపీ నేతలు బాగా ప్రచారం చేసేవారు. సర్వరోగ నివారణిగా గో మూత్రాన్ని హైలెట్ చేసేవారు. గతంలో కరోనా టైమ్ లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినవారిలో చాలామంది, తర్వాతి కాలంలో కరోనాబారిన పడి ఇంటి చిట్కాలు పక్కనపెట్టి కార్పొరేట్ వైద్యం అందుకున్నారు. తాజాగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో కూడా ఆవు పేరు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది. గుజరాత్ లోని శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ విశ్వవిద్యా ప్రతిష్ఠానంలో కొందరు కరోనా రాకుండా ఆవుపేడ చికిత్స తీసుకుంటున్నారు. ప్రతి ఆదివారం ఇక్కడ ఆవుపేడతో ట్రీట్ మెంట్ ఉంటుంది. ఆవు పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుని రోజంతా అలాగే ఉండి, సాయంత్రం అయ్యాక ఆవు పాలతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. దీంతో కరోనా తమ దరి చేరదని వారి నమ్మకం. విద్యాధికులు, వైద్య రంగంలో పనిచేసేవారు, కొవిడ్ ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, మందుల కంపెనీల్లో పనిచేసేవారు సైతం.. ఇలా ఆవుపేడ చికిత్సకు క్యూ కట్టడం విచిత్రం.

ఆవు పేడ చికిత్స ప్రమాదకరమని, దాన్ని శరీరానికి పూసుకోవడం వల్ల మ్యూకో మైకోసిస్‌ వంటి ఫంగల్‌ ఇన్‌ ఫెక్షన్లు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఆవుపేడకు లేదని చెబుతున్నారు. ఆవుపేడ, మూత్రంతో చికిత్స ఎంతవరకూ పనిచేస్తుంది, దీని ద్వారా కొవిడ్‌ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ఎంతవరకు పెరుగుతుందనేదానిపై శాస్త్రీ ఆధారాలు లేవు, ఏ పరిశోధనలు కూడా ఆవుపేడ కరోనాని అడ్డుకుంటుందని చెప్పలేదు. మరి సదరు గురుకుల్ విశ్వ విద్యా ప్రతిష్టానం అలా ఎందుకు ప్రచారం చేస్తోంది, దాన్ని నమ్మినవారు ఆవుపేడ పూసుకుని రోజంతా ఎందుకలా కూర్చుంటున్నారనేదే ప్రశ్నార్థకం. కనీసం అవగాహన కల్పించాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం విమర్శలకు దారి తీస్తోంది.

“పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థం. ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కొవిడ్‌ ఇన్‌ ఫెక్షన్‌ నుంచి రక్షణ ఇవ్వలేదు. పేడ చికిత్సలో శాస్త్రీయత ఏమీ లేదు. ప్రజలు ఇలాంటి చికిత్సల జోలికి వెళ్లకుండా… వైద్యులను సంప్రదించాలి” అని భారతీయ వైద్య మండలి మహిళా విభాగం ఛైర్‌ పర్సన్‌ డా.మోనా దేశాయ్‌ లాంటి వారు చెబుతున్నా.. ఇంకా ఈ పేడ చికిత్సకోసం వెళ్తున్నవారు చాలామందే ఉన్నారు.

మొత్తమ్మీద వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తుంటే.. కొంతమంది ఇలా మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ విశ్వాసాలతో ఆవుపేడ ఉంటే చాలు మాకు టీకా అక్కర్లేదు అని అంటున్నారు. భారత్ లో కొవిడ్ వ్యాప్తి ఇలాంటి తప్పుడు ప్రచారాలతోనే మరింత ఎక్కువ అవుతోంది. ముక్కులో నిమ్మకాయ రసం పిండుకుంటే కరోనా పారిపోతుందని చెప్పే సోషల్ మీడియా నిపుణుల్లాగే.. ఆవుపేడ పూసుకుంటే కరోనా దరిచేరదంటున్న ఈ సోకాల్డ్ మేథావులు కూడా సమాజానికి అత్యంత ప్రమాదకరం.

First Published:  12 May 2021 6:57 AM IST
Next Story