సొంత కుంపటా? హస్తం గూటికా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని, కొత్త పార్టీ విషయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు కూడా ఆయనకి ఉన్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో చాలామంది టీఆర్ఎస్ అసంతృప్త నేతలు కూడా ఈటలతో టచ్ లో ఉన్నారని సమాచారం. వీరందరితో సమాలోచనలు జరుపుతున్న ఈటల త్వరలోనే ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి, టీఆర్ఎస్ […]

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని, కొత్త పార్టీ విషయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు కూడా ఆయనకి ఉన్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో చాలామంది టీఆర్ఎస్ అసంతృప్త నేతలు కూడా ఈటలతో టచ్ లో ఉన్నారని సమాచారం. వీరందరితో సమాలోచనలు జరుపుతున్న ఈటల త్వరలోనే ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి, టీఆర్ఎస్ కి రాజీనామా చేసి, అదే వేదికపై కొత్త పార్టీ ప్రకటిస్తారని కూడా వార్తలొచ్చాయి. తెలంగాణలో లాక్ డౌన్ వేళ, బహిరంగ సభలు, సమావేశాలకు ప్రభుత్వతం ఒప్పుకునే అకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
ఈటల వ్యవహారం బయటపడిన తర్వాత ఇతర పార్టీల నేతలు చాలామంది ఆయనకు మద్దతుగా మాట్లాడారు. ఈటలను బలిపశువుని చేస్తున్నారని, వాడుకుని వదిలేశారంటూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ నేతలే కాదు, తెలంగాణ జన సమితి నేత కోదండరాం ఈటలకు బహిరంగంగా మద్దతు తెలిపి, కేసీఆర్ పై ఉమ్మడి పోరాటం సాగిస్తామంటూ కదలి రమ్మన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈటల ఏ రాజకీయ పార్టీ నేతల్నీ కలవలేదు. స్వతంత్రంగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డితో మాత్రమే ఆయన మంతనాలు సాగించారు. ఇప్పుడు సడన్ గా భట్టితో ఈటల భేటీ కలకలం రేపింది.
వాస్తవానికి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి మనగలగడం అంత సులభమేం కాదు. అందులోనూ టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి వేరు కుంపట్లు పెట్టినవారి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అందుకే ఆయా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈటల ఏదో ఒక జాతీయ పార్టీలో చేరతారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే హైదరాబాద్ లోని భట్టి నివాసానికి వచ్చి ఆయనతో కీలక చర్చలు జరిపారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్ లో కార్యకర్తలు, నేతలతో కొన్నిరోజులుగా మంతనాలు జరుపుతున్న ఈటల.. తాజాగా హైదరాబాద్ కి మకాం మార్చారు. భట్టితో భేటీ అయిన ఆయన.. రాజకీయ ప్రకటన ఏదైనా చేస్తారా..? లేక మరింతమంది నాయకులతో కలసి తుది నిర్ణయం తీసుకుంటారా.. అనేది తేలాల్సి ఉంది.