Telugu Global
National

మావోయిస్ట్ లపై కరోనా పంజా..

మావోయిస్ట్ లను కరోనా కబళిస్తోంది. పట్టణాల్లో నివాసం ఉంటూ వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా ప్రజలు కరోనా కాటుకి విలవిల్లాడుతుంటే.. అడవుల్లో మందులు, టీకాలకు దూరంగా ఉండే మావోయిస్ట్ ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మావోయిస్ట్ ల అంత్య క్రియలకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేసింది. ఈ వీడియోలో మావోయిస్ట్ లు మోసుకెళ్తున్న మృతదేహాలు, కరోనాకు బలైనవారివేనంటూ ఛ‌త్తీస్ ఘడ్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. సోమవారం […]

మావోయిస్ట్ లపై కరోనా పంజా..
X

మావోయిస్ట్ లను కరోనా కబళిస్తోంది. పట్టణాల్లో నివాసం ఉంటూ వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా ప్రజలు కరోనా కాటుకి విలవిల్లాడుతుంటే.. అడవుల్లో మందులు, టీకాలకు దూరంగా ఉండే మావోయిస్ట్ ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మావోయిస్ట్ ల అంత్య క్రియలకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేసింది. ఈ వీడియోలో మావోయిస్ట్ లు మోసుకెళ్తున్న మృతదేహాలు, కరోనాకు బలైనవారివేనంటూ ఛ‌త్తీస్ ఘడ్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. సోమవారం ఒక్కరోజే బస్తర్ అడవుల్లో 10మంది మావోయిస్ట్ లు కరోనాతో చనిపోయారని పోలీసులంటున్నారు. ఛ‌త్తీస్ ఘడ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న కరోనా.. అక్కడి దండకారణ్యాలకూ పాకింది. దక్షిణ బస్తర్‌ అడవుల్లో ఇప్పటికే వందల మంది వైరస్‌ బారినపడటంతో మావోయిస్టు శిబిరాల్లో భయాందోళన నెలకొంది.

అటవీప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు 400 మంది మావోయిస్టులకు వైరస్‌ సోకినట్లు దంతెవాడ ఎస్సీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు. 20 రోజుల క్రితం సుక్మా, బీజాపూర్‌ అటవీ ప్రాంతాల మధ్య నక్సల్స్‌ భారీ సమావేశం నిర్వహించగా దాదాపు 500మంది ఆ సమావేశంలో పాల్గొన్నారు. వైరస్‌ వ్యాప్తికి ఈ మీటింగే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నక్సల్స్ వల్ల చుట్టు పక్కల గిరిజన పల్లెల్లో కూడా వైరస్ ప్రబలే అవకాశం ఉందని అధికారులు ముందు జాగ్రత్త హెచ్చరికలు చేస్తున్నారు.

మావోయిస్ట్ లకు ఉచితంగా కొవిడి చికిత్స..
ఇటు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఏఓబీలో కూడా మావోయిస్ట్ లు కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. గాలికొండ, కోరుకొండ, పెదబయలు, ప్రాంతాల్లో దళ సభ్యుల్లో చాలామందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. దీంతో విశాఖ రూరల్ జిల్లా పోలీసులు మావోయిస్ట్ లకు ఓ అవకాశం ఇచ్చారు. కరోనాతో బాధపడుతున్న మావోయిస్ట్ లు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ తమను సంప్రదిస్తే మంచి వైద్యం అందిస్తామని తెలిపారు. అటు తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కూడా మావోయిస్ట్ లను జనజీవన స్రవంతిలో కలసిపోవాలంటూ పిలుపునిచ్చారు. కొవిడ్ తో ప్రాణాలు కోల్పోవద్దని, లొంగిపోతే మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడతామని భరోసా ఇచ్చారు.

సమూహాలుగా సంచరించే మావోయిస్ట్ లలో ఒకరికి కరోనా వస్తే.. మిగతా వారికి సోకే అవకాశాలు చాలా ఎక్కువ. ఓవైపు కరోనా కబళిస్తుంటే, మరోవైపు అడవుల్లో ఒకచోటనుంచి మరో చోటకు శిబిరాలు మార్చడం వారికి కష్టంగా మారుతోంది. ఈ సందర్భంలో ప్రాణభయంతో మావోయిస్ట్ లు పోలీసులకు లొంగిపోయి చికిత్స తీసుకుంటారా, లేక అడవుల్లోనే మగ్గిపోతారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  11 May 2021 12:05 PM IST
Next Story